కృష్ణుడు కాదు.. రాధ..! | Marriage counseling | Sakshi
Sakshi News home page

కృష్ణుడు కాదు.. రాధ..!

Published Wed, May 13 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

కృష్ణుడు కాదు.. రాధ..!

కృష్ణుడు కాదు.. రాధ..!

మ్యారేజ్ కౌన్సెలింగ్
తీసేందుకు కాదు మూడుముళ్లు.వెనుకంజ వేసేందుకు కాదు... ఏడడుగులు. దాంపత్యంలో కలతలు వస్తుంటాయి... పోతుంటాయి.అర్ధం చేసుకుంటే ఏ స్పర్ధా సమస్య కాదు. నిజానికి సమస్యలు ఉన్నప్పుడే పరిష్కారాలు పుట్టుకొస్తాయి. పదిమందికీ అవి సమాధానాలవుతాయి.


ప్రియాంక, రాధాకృష్ణ భార్యాభర్తలు. వారి పెళ్లయి దాదాపు ఏడాది కావస్తోంది. అయితే ఒక్కసారి కూడా రాధాకృష్ణ భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు.

శారీరకంగా కలవలేదు. పగలంతా బాగానే ఉండేవాడు కానీ, రాత్రి బెడ్‌రూమ్‌లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించేవాడు. ప్రియాంక చీర కట్టుకునేవాడు, బొట్టుపెట్టుకునేవాడు. కాళ్లకు పట్టీలు పెట్టుకుని డ్యాన్స్ చేసేవాడు. ఆమెను మగవాడిలా తయారవమనేవాడు. భర్త పేరులో కృష్ణుడు లేడు. రాధ మాత్రమే ఉంది అని అర్థం చేసుకుంది ప్రియాంక. అంతా తన కర్మ అని సరిపెట్టుకుంది. ఈ విషయాన్ని ఎవరితోటీ చెప్పలేదు. మనసులోనే ఉంచుకుని, తనలో తనే కుమిలిపోతుండేది. అయితే ఆమె అత్తమామలు మాత్రం పెళ్లయి, కాపురానికి వచ్చి నెల దాటినప్పటినుంచే ఆమె నెల తప్పడం కోసం ఆత్రంగా ఎదురు చూసేవాళ్లు.

ప్రతి నెలా ఆమెకు నెలసరి రాగానే నిరుత్సాహ పడిపోయేవారు. ఆరు నెలలు గడిచేసరికి కోడలు గొడ్రాలేమోనని అనుమానపడి, సూటీపోటీ మాటలతో వేధించేవారు. తమ కుమారుడు ప్రయోజకుడే కాని, లోపమల్లా కోడలిలోనే ఉందని వారంతట వారే నిర్థారించుకుని, సంతానం కలగడం కోసం ప్రియాంక చేత రకరకాల నాటుమందులు, పసర్లు మింగించేవారు. ఆ మందులు మింగీ మింగీ ప్రియాంకకు జీవితం మీద విరక్తి పుట్టేది. ఇంతలో ఓ రోజు భర్త జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతుండడంతో బలవంతాన హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. పరీక్షలలో అతను హెచ్.ఐ.వి. పాజిటివ్ అని తేలింది.

అప్పటి వరకు ఉగ్గబట్టుకుని ఉన్న ప్రియాంక అసలు విషయాన్ని అప్పుడు బయట పెట్టింది. ప్రియాంక తలిదండ్రులు, సోదరులు కలిసి విషయాన్ని తెలియజేస్తూ కోర్టుకు వెళ్లారు. పెళ్లయి ఏడాది గడిచినా, శారీరకంగా కలయిక జరగడకపోవడం, పైగా భర్తకు ఎయిడ్స్ ఉందని నిర్థారణ కావడంతో ఫ్యామిలీ కోర్టు వెంటనే వారికి విడాకులు మంజూరు చేయడమే కాక, పెళ్లిలో కట్టకానుకలు, ఇతర లాంఛనాల కింద ప్రియాంక తలిదండ్రులు ఖర్చుపెట్టిన సొమ్మంతటినీ వడ్డీతో సహా అత్తమామల నుంచి తిరిగి ఇప్పించింది.
 జరిగినదంతా మర్చిపోయి, ప్రియాంక మళ్లీ పెళ్లి చేసుకుని, భర్తతో హాయిగా ఉంది.  ఇప్పుడు ఆమెకు ఆరునెలల బాబు.
 
ప్రశ్న - జవాబు:-

నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిని. నా పై అధికారి ప్రవర్తన ఏమీ బాగుండట్లేదు. పనికి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇంట్లో ఉన్నా మెసేజ్‌లు వస్తున్నాయి. వారాంతంలో ఈ సమస్య మరీ అధికంగా ఉంటోంది. ఈ మెసేజ్‌లు మా వారి కంటపడితే ఏమవుతుందో ఏమో అనే భయంతో ఫోన్‌ను ఆయన కంటపడకుండా దాస్తున్నాను. దీంతో ఆయన నన్ను తీవ్రంగా అనుమానిస్తున్నారు. ఈ సమస్య మూలంగా మనశ్శాంతి కోల్పోయాను. ఆఫీస్‌కు వెళ్లాలంటేనే భయంగా ఉంటోంది. స్నేహితులతో చెబితే, ఉద్యోగంలో ఇవన్నీ మామూలేనంటున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? అతనికి బుద్ధి చెప్పేదెలా?
- శ్రీజ, ఈమెయిల్

 
మీరు పనిచేసే ఆఫీసులో ఒక కౌన్సెలింగ్ బెంచ్ ఏర్పాటు చేసి ఉందా, లేదా ముందు తెలుసుకోండి. ఎందుకంటే పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురి కాకుండా ప్రతి కార్పొరేట్ కార్యాలయంలోనూ ఒక బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్‌కి ముగ్గురు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారు. వారిలో ఒక మహిళా కౌన్సెలర్ (స్వచ్ఛంద సేవకురాలు), ఆఫీసుకు సంబంధించిన ఒక మహిళా ఉద్యోగి, మరొక మహిళా న్యాయవాది సభ్యులుగా ఉంటారు. వేధింపులకు గురయ్యే మహిళ ఆ బెంచ్‌కు ఫిర్యాదు చేస్తే వారు తగిన చర్యలు తీసుకొని, ఆ పై అధికారులకు విషయం తెలియజేసి మీకు న్యాయం జరిగేలా చూస్తారు.

వేధింపులకు సంబంధించిన విషయాన్ని ఫిర్యాదు చేసినప్పుడు ఆ ప్రభావం పనిపై పడకూడదు. అంటే ప్రమోషన్లు రాకుండా అడ్డుకోవడం, ట్రాన్స్‌ఫర్లు చేయడం.. వంటి ప్రతీకార చర్యలేవీ చోటుచేసుకోకూడదు. అంత రహస్యంగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలి. ఒకవేళ అలాంటి బెంచ్ మీ ఆఫీసులో లేకపోతే ఆ పై అధికారులకు ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తూ విజ్ఞప్తి పంపండి. రాతపూర్వకంగానూ ఫిర్యాదు చేయవచ్చు. మరో విషయం.. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని మీ భర్తకు తెలియజేయకుండా ఉండటం సరికాదు. అందుకే మీ కాపురంలో అనుమానం చోటుచేసుకుంటోంది. మొదటి మెసేజ్‌కే మీరు ఈ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పటికైనా ఈ విషయాన్ని మీ భర్తకు తెలియజేయండి.
 
మా పెళ్లయి రెండున్నర సంవత్సరాలైంది. అయితే ఇంతవరకూ మేము శారీరకంగా ఒకటి కాలేకపోయాము. దగ్గరవుదామని నేను ప్రయత్నించిన ప్రతిసారీ ఆమె ఏదో ఒక వంకతో నన్ను దూరం పెడుతోంది. ఆమె మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఇంకా ఈ దూరాన్ని భరించడం నా వల్ల కాదు. ఆమెకు విడాకులివ్వాలనుకుంటున్నాను. ఎలా ప్రొసీడవ్వాలి? సలహా ఇవ్వండి.
- బి.కుమార్, ఆదోని

 
భార్య లేదా భర్తతో శారీరక సంబంధానికి  ఉద్దేశ్యపూర్వకంగా దూరంగా ఉన్నట్లయితే, దానిని రుజువు చేయగలిగితే జీవిత భాగస్వామి నుంచి చట్టప్రకారం విడిపోవచ్చు. మీ భార్య మిమ్మల్ని దూరం పెట్టడానికి రెండు కారణాలు ఉండి ఉండవచ్చు. ఒకటి ఆమెకు మీరంటే ఇష్టం లే కపోవడం... రెండు... ఆమెకు శారీరకపరమైన లోపం ఏమైనా ఉండటం. కొందరు స్త్రీలలో ఫ్రిజిడిటీ అంటే సంసార జీవితమంటే విముఖత ఉండవచ్చు.  వీటిలో సరైన కారణమేంటో తెలుసుకోండి.  జీవిత భాగస్వామితో శారీరక సంబంధాన్ని తిరస్కరించడం కూడా క్రుయాలిటీ కిందికి వస్తుంది. కోర్టు దీనిని తీవ్రంగా పరిగణిస్తుంది. సంబంధిత ఆధారాలతో మీరు విడాకుల కోసం కోర్టుకు వెళ్లవచ్చు. కోర్టు మీ సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని వెంటనే విడాకులు మంజూరు చేస్తుంది.
 
నాకు ఐదేళ్ల పాప ఉంది. మేము డైవోర్స్ తీసుకుని రెండేళ్లయింది. మా పాపను చూడటానికి ఆయన నెలకొకసారి ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో మా మధ్య అవగాహన ఏర్పడింది. మా తప్పు మేము తెలుసుకున్నాము. మేము తిరిగి కలిసి ఉందామను కుంటున్నాము. అయితే ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత కోర్టు అనుమతి లేకుండా తిరిగి కలవటం సబబు కాదని మాకు తెలిసిన వాళ్లంటున్నారు. ఇది నిజమేనా? మేము ఏం చేయాలి? సలహా ఇవ్వండి.
- పి. కవిత, కరీంనగర్

 
మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు. అయితే మీరు విన్నది నిజమే. ఒకసారి చట్టపరంగా విడిపోయారు కాబట్టి తిరిగి మీరు కలిసి ఉంటే అది సహజీవనం కింద వస్తుంది కానీ, చట్టబద్ధమైన బంధం కానేరదు.  మీ పాప భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, తిరిగి మీ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు ఎదురయినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ప్రతి వివాహాన్నీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలన్న చట్టాన్ని అనుసరించి, మీరు ఈసారి రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్టర్ చేసుకోండి. అప్పుడు మీ బంధానికి ఒక అర్థం, పవిత్రత వస్తాయి.
 
మా పెళ్లయి నాలుగేళ్లయింది. ఆయన నన్ను బాగానే చూసుకుంటారు. అయితే ప్రతి విషయంలోనూ అమ్మ మాటే వింటాడు. ఇంటిలో ఏ చిన్న వస్తువు కొనాలన్నా, ఏమి కావాలన్నా అమ్మనే సంప్రదిస్తాడు తప్పితే నన్ను అడగడు. అన్నం కూడా అమ్మ పెడితేనే తింటాడు. నేను ఇది భరించలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తగిన సలహా ఇవ్వగలరు.
-కె. రజని, భీమవరం

 
అమ్మ మాట వినడం అనే ఆ ఒక్క లక్షణం తప్పించి మీ ఆయన మంచివాడే అని నువ్వే చెబుతున్నావు. కేవలం అమ్మ మాట లేదా భార్య మాట మాత్రమే వినాలి, అది తప్పించి వేరే వారి మాట వినకూడదు అని చట్టం ఎక్కడా చెప్పలేదు. అదేవిధంగా భార్యమాట వినని వారిని శిక్షించే హక్కు కూడా చట్టానికి లేదు. ఇది కేవలం మీ ఇద్దరి మధ్య అవగాహనపరమైన సమస్య. భవిష్యత్తులో నువ్వు కూడా అమ్మవి అవుతావు, నీ పిల్లలు నీ మాట వింటారు. అది తప్పు అని అప్పుడూ ఇప్పుడూ కూడా ఎవరూ చెప్పలేరు. అన్నింటికీ అమ్మ మాట వింటున్నాడు, అమ్మకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే బాధతోనో, అసహనంతోనో అతన్ని దూరం పెట్టవద్దు. ప్రేమతో నీ మాట వినేలా చేసుకో. లేనిపోని చికాకులతో కాపురాన్ని కోర్టు గుమ్మం దాకా తీసుకెళ్లడం శ్రేయస్కరం కాదు.
సాక్షి ఫ్యామిలీ కౌన్సెలర్స్: నిశ్చల సిద్ధారెడ్డి, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, అనురాధ, అడ్వకేట్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement