ఇంటిమసీ తగ్గితే... జీవితం మసి!
మ్యారేజ్ కౌన్సెలింగ్
దూరం పెరిగితే
ఏ బంధం అయినా దగ్గరవుతుంది.
కానీ దాంపత్యబంధం అలాక్కాదు.
భార్యాభర్తలు నిరంతరం దగ్గరగా ఉండాలి.
ఉద్యోగరీత్యా దూరంగా
ఉండవలసి వచ్చినా...
మానసికంగా దగ్గరగా ఉండే
ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి.
అర్థం చేసుకుంటారులే
అనుకుని ఊరుకుంటే...
అపార్థాలు రావచ్చు.
అనుమానాలు తలెత్తవచ్చు.
చివరికి జీవితమే
అర్ధరహితంగా అనిపించవచ్చు.
మాకు పెళ్లయి 15 ఏళ్లవుతోంది. ముగ్గురు పిల్లలు. నాది మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం. క్యాంప్స్ ఎక్కువగా తిరుగుతుంటాను. నేను లేని సమయంలో నా భార్య మా పక్కింటాయనతో అక్రమ సంబంధం పెట్టుకుని, పిల్లల్ని ఒంటరిగా వదిలేసి అతనితో ఊళ్లు తిరగడం, ఉన్న ఊళ్లో సినిమాలు, షికార్లు చేయడం మొదలుపెట్టింది. అదేమని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ, నన్ను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఆమె ప్రవర్తనను గమనించిన వారు, చుట్టాలు, స్నేహితులు ఆమె గురించి నన్ను హెచ్చరిస్తుంటే సమాజంలో ఎంతో అవమానంగా, చిన్నతనంగా ఉంది. ఇక నా ముగ్గురు పిల్లల బాధ చెప్పనలవి కాదు. ఇటీవల ఆవిడ పిల్లల్ని పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. ప్రస్తుతం మా అమ్మే పిల్లల బాగోగులు చూస్తోంది. నేను విడాకులకు దరఖాస్తుచేయాలను కుంటున్నాను. సలహా చెప్పగలరు.
- సుందరయ్య, శాంతినగర్
మీరు మీ భార్యకున్న క్రూయల్టీ ఇల్లిసిట్ ఇంటిమసీ అంటే అక్రమ సంబంధాన్ని కారణంగా చూపుతూ డివోర్స్‌కు ఫైల్ చేయవచ్చు. దానితోపాటు పిల్లల్ని పట్టించుకోవడం లేదని, సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఇంకా పైన చెప్పిన అన్ని కారణాలు చూపుతూ, ఆమె అక్రమ సంబంధానికి అన్ని సాక్ష్యాలు, ఆధారాలు కోర్టులో ఫైల్ చేస్తూ విడాకులకు దరఖాస్తు చేయండి. మీ వైపు సాక్ష్యాలూ, ఆధారాలూ అన్నీ ఉన్నాయి కాబట్టి కోర్టువారు మీ పరిస్థితిని అర్థం చేసుకుని, మీకు వెంటనే విడాకులు మంజూరు చేసే అవకాశం ఉంది.
తీర్పు చెప్పే సమయంలో పిల్లల అభిప్రాయాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుం టుంది. ఆమె కూడా విడాకులకు సిద్ధంగా ఉందంటున్నారు కాబట్టి మీకు సులభంగానే విడాకులు రావొచ్చు. లేదా ఇద్దరు కలిసి పరస్పర అంగీకారంతో మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ ఫైల్ చేసి విడాకులు పొందవచ్చు. మీకిది ఇష్టం లేకపోతే పైన చెప్పినట్లు క్రూయల్టీ కింద అయినా విడాకులకు ఫైల్ చేసి ఆర్డర్ పొందవచ్చు. ప్రయత్నించి చూడండి.
మాకు పెళ్లయి 8 ఏళ్లయింది. ఇద్దరు పిల్లలు. ఆయనది బంగారంలాంటి ప్రభుత్వోద్యోగం. అయితే నా భర్తకు లేని చెడ్డ అలవాట్లు లేవు. తాగుబోతు. తిరుగుబోతు. దీనికి తోడు మాదక ద్రవ్యాలకు కూడా బానిస అయ్యాడు. తన దురలవాట్ల మూలంగా విధులకు గైర్హాజరవుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉన్నతోద్యోగులు ఈయన్ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు.దాంతో మరింత రెచ్చిపోయి రోజూ తాగొచ్చి ఇంట్లో నన్ను, పిల్లల్ని కొట్టడం, ఇంటిని నరకం చేయడమే తన దినచర్యగా మార్చుకున్నాడు. ఖర్చుల కోసం నా ఒంటిమీదున్న బంగారంతో సహా ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నింటినీ అమ్మేశాడు. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్‌ను కావడంతో నాకొచ్చే జీతంతో పిల్లల్ని పోషిస్తూ కష్టపడి చదివించుకుంటున్నాను. ఇక ఇతనితో జీవించడం దుర్లభం అని నిశ్చయించుకున్నాను. నేను విడాకులకు అప్లై చేసుకోవచ్చా? విడాకులు వస్తాయా?
- క్రిస్టినా, హైదరాబాద్
మీ భర్త మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా హింస పెట్టడాన్ని గురించి కోర్టుకు తెలియజేస్తూ విడాకులకు దరఖాస్తు చేయవచ్చు. క్రూయల్టీ గ్రౌండ్స్ కింద మీకు విడాకులు మంజూరవుతాయి. అయితే మీరు పైన చెప్పిన కారణాలన్నింటినీ సాక్ష్యాలతో కోర్టులో నిరూపించగలగాలి. మీరెలాగూ ప్రభుత్యోద్యోగి కాబట్టి మీకు, పిల్లలకు మెయింటినెన్స్ ఎలాగూ వద్దంటున్నారు కాబట్టి, అతన్నుండి మీరు పర్మినెంట్ కాంపన్సేషన్ (భరణం)గానీ, మెయింటినెన్స్‌గానీ కోరుకోవట్లేదు కాబట్టి క్రూరత్వం కింద డివోర్స్ గ్రాంట్ అవుతాయి. మీరు ఇక ప్రశాంతంగా పిల్లలతో గడపండి.