మారిన మగాడి కథ... | Marriage Counseling | Sakshi
Sakshi News home page

మారిన మగాడి కథ...

Published Wed, May 6 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

మారిన మగాడి కథ...

మారిన మగాడి కథ...

మ్యారేజ్ కౌన్సెలింగ్
 
ఆమె సహనం వహించాలి..
అతడు సర్దుకుపోవాలి.
ఆమె అర్థం చేసుకోవాలి..
అతడు సంయమనం పాటించాలి.
ఒకరి కోపం.. మరొకరి శాంతం.
ఒకరి అలక.. మరొకరి సారీ.
ఇవీ వివాహ బంధంలో అవసరం. లేని పక్షంలో వారం వారం
సాక్షి ఫ్యామిలీ అందిస్తున్న ఈ కౌన్సెలింగ్ అవసరం....

 
అఖిల ఉన్నతోద్యోగంలో ఉంది. సమాజంలో ఆమెకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ, భర్త వైఖరి మూలంగా ఆమె మనసుకు చాలా బాధ కలిగింది. వెంటనే అతనితో తెగతెంపులు చేసుకోవాలనుకుంది. విషయం ఏమిటంటే... ఇంజినీరింగ్ పూర్తి చేసిన అఖిలకు అప్పుడే మెడిసిన్ పూర్తి చేసి, సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకున్న అన్వేష్‌తో వివాహం జరిగింది. అయితే అప్పటికే అన్వేష్‌కు తన దగ్గర పని చేసే  నర్సుతో అక్రమ సంబంధం ఉంది. ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక కూడా ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఆ సంగతి ఈ నోటా ఆ నోటా చెవిన పడ్డా నమ్మలేదు అఖిల. అయితే ఓసారి ఏదో పని ఉండి భర్త హాస్పిటల్‌కు వెళ్లిన అఖిల కంట పడింది వారి వ్యవహారం. దాంతో నమ్మక తప్పలేదు.

తనపై అపరిమితమైన ప్రేమ కురిపించే భర్త అంతపని చేస్తాడనుకోలేదు. వెంటనే  విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. హతాశుడైన అన్వేష్ ఆమె కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. విడాకులు ఇస్తే విషం తాగుతానన్నాడు. ఇంకెప్పటికీ ఆమె జోలికి పోనంటూ తలిదండ్రులు, అత్తమామలు తదితర పెద్దల సమక్షంలో కాగితం రాసిచ్చాడు. అందరూ సర్దిచెప్పడంతో అఖిల మనసు కొంత శాంతించింది. దాంతో విడాకుల నిర్ణయాన్ని విరమించుకుంది. అయితే  ఆ తర్వాత కొద్దికాలానికే అన్వేష్ తానిచ్చిన మాట తప్పాడు. ఈసారి అఖిల విషయాన్ని తేలిగ్గా తీసుకోదలచుకోలేదు. వెంటనే కోర్టులో విడాకుల పిటిషన్ వేసింది. కోర్టు నిబంధనల ప్రకారం ఆరునెలలపాటు ఇద్దరూ కలిసే ఉన్నారు. మొదట్లో ఎడమొహం పెడమొహంగా ఉన్నా, ఆ తర్వాత అతనిలో క్రమంగా మార్పు రావడం మొదలయింది. తాను చేసిన పనికి తీవ్రంగా పశ్చాత్తాప పడ్డాడు. ఇంతలో అఖిలకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఒక డాక్టర్‌గా మందులిచ్చాడు. భర్తగా సేవలు చేశాడు. ఇద్దరి మధ్యనా ఒక అవగాహన ఏర్పడింది. ఇంతలో ఇద్దరికీ విడాకులు మంజూరవుతున్నట్లు లాయరు ద్వారా కబురు తెలిసింది. అయితే ఈసారి అన్వేష్ నిజంగానే మారినట్లు అఖిలకు అర్థమైపోయింది. పిల్లలు చూస్తే పెద్దవాళ్లవుతున్నారు. తండ్రి అంటే వారికి అపరిమితమైన ఇష్టం. ఆ ఒక్క బలహీనత తప్ప అఖిల్ కూడా తనను ప్రేమగానే చూసుకుంటాడు. తాము విడిపోతే ఇద్దరి మధ్యనా అనవసరంగా పిల్లలు నలిగిపోవడం ఎందుకనుకుంది. అంతే! తాము పరస్పర అవగాహనకు వచ్చామనీ, విడాకులు వద్దనీ, కలిసే ఉండాలనుకుంటున్నామనీ విత్‌డ్రాయల్ పిటిషన్ వేశారు. కోర్టు అందుకు సమ్మతించింది. కథ సుఖాంతమైంది.
 
ప్రశ్న - జవాబు
 
నా భర్త, నేను విడాకుల కోసం కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాము. కేసు పెండింగ్‌లో ఉంది. నా భర్త మంచి జీతం వచ్చే ప్రభుత్వోద్యోగి. పెద్ద పాపకు పెళ్లి కుదిరింది. రెండోపాప ఇంజినీరింగ్ చేస్తోంది. పెద్దపాపకు పెళ్లి ఖర్చులు, రెండోపాపకు చదువు ఖర్చు నా తలకు మించిన పని. అయితే నేను ఆయన నుంచి భరణం కోరవచ్చా?
 - జలజ, బెంగళూరు

మీ భర్తకు మంచి జీతం వస్తుందంటున్నారు కదా, పెళ్లి ఖర్చులు, పెళ్లి పత్రిక జత చేస్తూ కోర్టులో ఫైల్ చేయాలి. అలాగే రెండో పాప ఫీజు నోటీసులు కూడా కోర్టులో ఫైల్ చేయాలి. కొంచెం ఆలస్యమైనా కోర్టు నుంచి మీకు సానుకూలంగా ఆర్డర్ వస్తుంది.
 నేను, నా భర్త కొన్ని కారణాల వల్ల కలసి ఉండటానికి ఇష్టపడక అనేక గొడవల తర్వాత మ్యూచివల్ కన్సెంట్ డైవోర్స్‌కోసం కోర్టులో కేస్ ఫైల్ చేశాము. ఇప్పటికి మూడు నెలలయింది. అయితే మా పెద్దల సలహాలు, సూచనలతో మనసు మార్చుకుని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాము. ఇప్పటికే విడాకుల పిటిషన్ కోర్టులో ఉంది కదా, మేము దాన్ని ఏ విధంగా విత్ డ్రా చేసుకోవాలి?
 - మాధురి, గుంటూరు

అసలు ఇటువంటి దానికోసమే అంటే విడిపోవాలనుకున్న వారు మనసు మార్చుకుని, తిరిగి కలవడం కోసమే కోర్టు ఆరు నెలలపాటు కలిసి ఉండాలని చెబుతుంది. మీరు కలసి ఉండాలని నిశ్చయించుకున్నారు కాబట్టి, మీరు వెంటనే కోర్టు తీర్పు వెలువడేలోగానే మీ విడాకుల పిటిషన్‌ను విరమించుకోవాలనుకుంటున్నామని తెలియజేస్తూ, కేసు విత్‌డ్రా చేసుకుంటున్నట్లుగా రాసివ్వండి. కోర్టు మీ కేసు కొట్టేస్తుంది. విష్ యు ఆల్ ది బెస్ట్.

నా భార్య అకారణంగా నా మీద కోపంతో రెండేళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయింది. నిజానికి నా కుటుంబమంటే నాకు వల్లమాలిన ప్రేమ. మాకు 3, 4 సంవత్సరాల వయస్సున్న పిల్లలున్నారు. నాకు పిల్లలను చూడాలని ఉంది. నా భార్యను, పిల్లలను తిరిగి మా ఇంటికి తెచ్చుకోవడానికి నేను చట్టపరంగా ఏమైనా చెయ్యవచ్చా?
 - మోహన్, వరంగల్

భార్య, పిల్లలంటే అంత ప్రేమ ఉన్న మీరు ఇంత కాలంగా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? వెంటనే మీ ఫ్యామిలీ కోర్టులో కాపురానికి రావలసిందిగా మీ భార్యపై సెక్షన్ 9, రెస్టిట్యూషన్ ఆఫ్ కన్‌జూగల్ రైట్స్ కింద ఒక కేసును, పిల్లల కోసం కస్టడీ ఆఫ్ చైల్డ్ కింద ఒక కేసు ఫైల్ చేయండి. అంతకంటే ముందు మీ ఆవిడతోనూ, పెద్దలతోనూ సామరస్యంగా మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నించండి. అప్పటికీ ఒప్పుకోని పక్షంలో కోర్టులో కేసు ఫైల్ చేయండి. కష్టడీ ఆఫ్ చైల్డ్ కేసులో విజిటేషన్ రైట్స్ కింద వారానికో, పదిరోజులకో ఒకసారి పిల్లలను చూడడానికి అనుమతి ఇవ్వమని చెప్పి, కోర్టులో ఒక ఐ.ఎ. వెయ్యండి. మీకు పిల్లలను చూసే అవకాశం కోర్టు తప్పక కల్పిస్తుంది. మన చట్టప్రకారం ఫాదర్ బీయింగ్ నేచురల్ గార్డియన్ మీకు పిల్లలను చూసే అవకాశం తప్పక కలుగుతుంది. బాధ పడకుండా ప్రయత్నించి చూడండి.
 నేను, నా భార్య ఇరవైఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుని బెహ్రయిన్‌లో ఉంటున్నాము. అయితే కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవాలనుకుం టున్నాము. ఇద్దరం క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకున్నాము. మా ఇద్దరి పేరెంట్స్ ఇండియాలోనే ఉన్నారు. ఇద్దరికీ సెలవు దొరకదు. విడాకులకెలా అప్లై చేసుకోవాలి?
 - ఆల్బర్ట్, బెహ్రయిన్

మీ ఇద్దరూ ఇండియాలోని అడ్వకేట్‌తో మాట్లాడి మ్యూచువల్ కన్సెంట్ కింద విడాకులకు అప్లై చేయవచ్చు. మీ పేరెంట్స్‌లో ఒకరికి జీపీఎ ఇవ్వాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి పిటిషన్ తీసుకుని, డైవోర్స్ మెయిన్  పిటిషన్‌తోబాటు జీపీఎ, కోర్టు పర్మిషన్ పిటిషన్ అంది, మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ అడ్వకేట్ దగ్గర నోటరీ చేయించుకుని, అవి తిరిగి ఇండియా పంపించి, జీపీఏ ద్వారా కోర్టులో మ్యూచువల్ డైవోర్స్‌కు ఫైల్ చేయవచ్చు. ఆరునెలల తర్వాత ఎవిడెన్స్ అఫిడవిట్ కోర్టులో దాఖలు చేసేటప్పుడు మాత్రం మీ ఇద్దరి హాజరూ కోర్టులో తప్పనిసరి. కాబట్టి మీ ఇద్దరూ కోర్టులో హాజరు కావలసి ఉంటుంది.
 
నిశ్చల సిద్ధారెడ్డి
అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్,
సికింద్రాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement