తను మేజర్ అయితే... మీ ప్రాబ్లెమ్ మైనర్ అవుతుంది! | Marriage Counseling | Sakshi
Sakshi News home page

తను మేజర్ అయితే... మీ ప్రాబ్లెమ్ మైనర్ అవుతుంది!

Published Wed, Jul 22 2015 3:11 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

తను మేజర్ అయితే...  మీ ప్రాబ్లెమ్ మైనర్ అవుతుంది!

తను మేజర్ అయితే... మీ ప్రాబ్లెమ్ మైనర్ అవుతుంది!

మ్యారేజ్ కౌన్సెలింగ్
 
నేను నా క్లాస్‌మేట్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. పెద్దలకు ఇష్టం లేకుండా ఇద్దరం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుని రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్టర్ కూడా చేసుకున్నాము. ఇద్దరం గుజరాత్ వెళ్లి కొన్ని రోజులు కాపురం కూడా చేశాము. కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ నుండి వాళ్ల పుట్టింటి వాళ్లొచ్చి, ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్లిపోయారు. తర్వాత ఆ అమ్మాయితో డిక్లేర్ ది మ్యారేజ్ యాజ్ నల్ అండ్ వాయిడ్ అని... పెళ్లిని రద్దుచేయమంటూ కోర్టులో కేస్ ఫైల్ చేయించారు. ఆ అమ్మాయి మేజర్ కాదని, ఇంకా మైనర్ కాబట్టి మా పెళ్లి చెల్లదని వాదిస్తున్నారు. నేను ఆమె లేనిదే జీవించలేను. ఈ పరిస్థితుల్లో నేను ఏమి చేయాలి?
 - సుహాస్, కర్నూల్


మీకు తెలిసి మీ భార్య మేజర్ కదా. మీరూ అదే చెబుతూ కోర్టులో కౌంటర్ ఫైల్ చేయండి. ఆమె వయసును నిర్ధారించడానికి డాక్టర్ ఎగ్జామినేషన్ కోసం ఒక ఐ.ఎ. ఫైల్ చేయించండి. అదీగాక ఆమె వయసు నిర్థారణకు ఆమె టెంత్ క్లాస్ సర్టిఫికేట్ కూడా పనికి వస్తుంది. అది మీ దగ్గర ఉంటే కోర్టులో దాఖలు చేయవచ్చు. మీరు ఆమె మేజర్ అని నిరూపించగలిగితే చాలు. మీరు ఎలాగూ చట్టబద్ధంగా వివాహితులే. పైగా పెళ్లి రిజిస్టర్ కూడా అయింది కాబట్టి పెళ్లి రద్దు చేయడం చెల్లదు. మీ కేసు డిస్మిస్ అవుతుంది. ఆమెకు నిజంగా మీ మీద ప్రేమ ఉంటే మీతో కలిసి జీవించడానికి తప్పక వచ్చి తీరుతుంది. విచారించకండి, ధైర్యంగా కేస్ వాదించుకోండి.
 
మది సంఘంలో బాగా పేరు ప్రఖ్యాతులున్న ధనిక కుటుంబం. మా వివాహాన్ని పెద్దలే కుదిర్చారు. మాకు ఇద్దరు పిల్లలు. 16 ఏళ్ల మా వైవాహిక జీవితంలో నేనెప్పుడూ నా భార్యను హింసించింది కానీ, బాధపెట్టింది కానీ లేదు. కానీ నా భార్య మాత్రం తన అనైతిక చర్యతో నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా కూతురికి 14 సంవత్సరాలు, మా అబ్బాయికి 12 సంవత్సరాలు. ఈ ఎదిగిన ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని నా భార్య నేను ఇంటిలో లేని సమయంలో నా ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. నిజానికి ఈ విషయాన్ని గతంలోనే ఎంతోమంది నాకు చెప్పినా నేను నమ్మలేదు. కానీ, ఒకరోజు స్వయంగా నా కళ్లారా చూసిన తర్వాత నమ్మక తప్పలేదు. అదేమిటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. మరో విచిత్రం ఏమిటంటే నా తలిదండ్రులకు ముందే ఈ విషయం తెలుసట. అయితే ఈ సంగతి బయట పెట్టి నా మనసు వికలం చేయడం ఇష్టం లేక, పరువు మర్యాదలు పోగొట్టుకోవడం ఇష్టం లేకా నోరు నొక్కుకుని ఉన్నారట. ఇప్పుడు విషయం బయట పడిన తర్వాత నా తలిదండ్రులు ఆమె పుట్టింటి వారిని పిలిపించి వాళ్లముందే హితవు చెప్పారు. అప్పుడు మాత్రం అందరూ నంగిగా మాట్లాడుతూ సమాధానం దాటవేశారు. ఆ తర్వాత నా భార్య ఇంటిలో ఎవరూ లేనప్పుడు నన్ను, పిల్లల్ని వదిలేసి అతనితో కలిసి ఇంటిలోనుంచి వెళ్లిపోయింది. ఎంత వెదికినా దొరకలేదు. ఎంతో పరువుగల కుటుంబం మాది. ఈ సంఘటనతో మేము చాలా రోజుల పాటు తల ఎత్తుకుని తిరగలేకపోయాము. ఇది జరిగి ఐదేళ్లయింది. నేను ఆమెకోసం ఇంకా ఎదురు చూడటం వృథా అని, ఇంట్లో అందరూ నాకు మళ్లీ పెళ్లి చేయాలని, డైవోర్స్ తీసుకోమని బలవంత పెడుతున్నారు. నేను ఏమి చేయాలి?
 - శ్యామ్, హైదరాబాద్

 
మీరు వెంటనే లీగల్‌గా డైవోర్స్ కోసం కోర్టులో కేసు ఫైల్ చేయండి. అడల్టరీ గ్రౌండ్స్ కింద మీకు కచ్చితంగా విడాకులు మంజూరవుతాయి. పిల్లల కష్టడీ కోసం కేసు ఫైల్ చేయండి. వాళ్లు చెప్పిన దాని ఆధారంగానూ, తండ్రి ఎలాగూ పిల్లలకు సహజమైన సంరక్షకుడు కాబట్టి వారి కష్టడీ మీకే వస్తుంది. తర్వాత మీ జీవితాన్ని మీకు ఇష్టమైన విధంగా గడపవచ్చు.
 
మా తలిదండ్రులకు మేము ఇద్దరం ఆడపిల్లలం, ఒక కొడుకు. ముగ్గురికీ పెళ్లయిపోయింది. నాన్నగారి వైపు వారు బాగా స్థితిమంతులు కావడం వల్ల మా ఇద్దరికీ బాగా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. మాపెళ్లయిన కొద్దిరోజులకు తమ్ముడి పెళ్లయింది. అందరం సుఖంగా కాపురాలు చేసుకుంటున్నాము. నాన్న ఈ మధ్య సడెన్‌గా పోయారు. ఆయనకు మా ఇద్దరి ఆడపిల్లల మీద ఉన్న ప్రేమతో తన ఆస్తిని మూడు భాగాలుగా చేసి ముగ్గురికీ సరిసమానంగానూ, బ్యాంక్‌లో ఉన్న రెండు కోట్ల క్యాష్ డిపాజిట్లు తమ్ముడికీ చెందేలాగానూ వీలునామా రాశారు. అయితే వీలునామాను రిజిస్టర్ చేయలేదు. దాంతో తమ్ముడు అమ్మ దగ్గరున్న ఆ విల్లును దొంగ విల్లు అనీ, ఆ సిగ్నేచర్ నాన్నగారిది కాదనీ బుకాయిస్తూ మాకు ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. మేము ఏం చేయాలిప్పుడు?
 - ముకుంద, హైదరాబాద్


 మీరు మొదట మీ మేనమామలు, ఇతర సమీప బంధువులను మీ తమ్ముడి దగ్గర కూర్చోబెట్టి మంచి మాటల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నాన్నగారు ప్రభుత్వాధికారి అంటున్నారు కాబట్టి ఆయన సంతకాలు ఎన్నో చోట్ల ఉండే ఉంటాయి. వీలునామాలో ఉన్న మీ నాన్నగారి సంతకాన్ని వాటితో సరిపోల్చి చూడమనండి. అందుకు మీ తమ్ముడు ఒప్పుకోకపోతే ఎలాగూ మీ నాన్నగారి వీలునామా పైన ఇద్దరు సాక్షుల సంతకాలు ఉంటాయి కాబట్టి వారి సహకారంతో మీ ఇద్దరు అక్కచెల్లెళ్లు ‘డిక్లేర్ ది విల్ యాజ్ వ్యాలిడ్’ అంటూ ఒక పిటీషన్, మీ అంగీకారం లేనిదే ఆస్తిపాస్తులు అమ్మడానికి వీలు లేదని హెచ్చరిస్తూ ఒక ఇంజెంక్షన్ కేసును ఫైల్ చేయండి. ఈలోగా మీ లాయర్ సహకారంతో నాన్నగారి సిగ్నేచర్స్‌ను ఫోరెన్సిక్ లేదా హ్యాండ్ రైటింగ్ నిపుణుల వెరిఫికేషన్‌కు పంపితే వీలునామాలో మీ నాన్నగారి సంతకాలు అసలువో కాదో రూఢీ చేస్తూ రిపోర్ట్ వస్తుంది. దాని ఆధారంగా కోర్టు మీ పక్షాన తీర్పు ఇస్తుంది. కోర్టు తీర్పును మీ తమ్ముడు శిరసావహించవలసిందే కదా!
 
కేస్ స్టడీ

 
చక్కదిద్దుకోవడం మన చేతుల్లోనే...
సుందరీ సుబ్బారావుల పెళ్లయి పదేళ్లయింది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. పేరుకు తగ్గట్టు సుందరి చాలా అందంగా ఉంటుంది. సుబ్బారావు ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. ఓ రోజు సుబ్బారావు, అతని పిల్లలు స్కూలు నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం పెట్టి, తాళం చెవులు పక్కింటివాళ్లకి ఇచ్చి వెళ్లింది. లోపలికి వెళ్లి చూసే సరికి ఆమె తన నగలు, బట్టలతోబాటు కొంత డబ్బు కూడా తీసుకుని వెళ్లినట్లు అర్థమయింది. వెతకగా వెతకగా ఆమె తన క్లాస్‌మేట్‌తో కలిసి వెళ్లిపోయిందని తెలిసింది. దాంతో సుబ్బారావు హతాశుడయ్యాడు. గుండె రాయి చేసుకుని తన తల్లి సాయంతో పిల్లలను పెంచుకుంటూ ఎలాగో జీవిస్తున్నాడు. ఆమె వెళ్లిపోయి ఇప్పటికి ఏడెనిమిదేళ్లకు పైగానే అయింది. ఇటీవలే తల్లి చనిపోవడంతో పిల్లల పెంపకం చాలా కష్టమైపోయింది. మనసులో మాట చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. దాంతో జీవితం దుర్భరంగా అనిపించింది. బంధువులు, శ్రేయోభిలాషుల సలహాతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. లాయర్ సూచన మేరకు నాట్ హర్డ్ ఫర్ 7 యియర్స్ అనే గ్రౌండ్ మీద డైవోర్స్ ఫైల్ చేశాడు. భార్య చిరునామా కూడా తెలియదు కాబట్టి పేపర్ పబ్లికేషన్ ద్వారా డైవోర్స్ ఫైల్ చేశాడు. ఆమె ఎక్స్‌పార్టీ అయింది కాబట్టి కోర్టు డైవోర్స్ మంజూరు చేసింది.
 ఆ తర్వాత తమ బంధువుల్లోనే ఒక పద్ధతైన అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకుని హాయిగా భార్యాపిల్లలతో కలసి జీవనం సాగించాడు. ప్రపంచంలో కష్టాలెదురయేవాళ్లు చాలామంది ఉన్నారు. కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మహత్యే పరిష్కారం కాదు. జీవితాన్ని కష్టాలకు ఎదురొడ్డి చక్కగా ఎలా మలుచుకోవచ్చో అనేందుకు ఇదొక ఉదాహరణ.

ప్రేమ ధైర్యాన్నిస్తుంది. పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడే శక్తిని ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఆ శక్తి సరిపోదు. పెద్దలను ఎదిరించి పెళ్లయితే చేసుకోవచ్చు కానీ... చట్టం ముందు దాన్ని నిలబెట్టుకోవడం... పెద్ద సమస్య అయి కూర్చుంటుంది! అమ్మాయి మైనర్ అయినప్పుడు  ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే అమ్మాయి, అబ్బాయి ఈ మేజర్, మైనర్ సమస్యల గురించి పెళ్లికి ముందే ఆలోచించాలి.
 
నిశ్చల సిద్ధారెడ్డి
అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement