Case Study
-
హైదరాబాద్ మెట్రో రైల్ సక్సెస్.. ఒక కేస్‌స్టడీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రాజె క్టుపై ప్రతిష్టాత్మక స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ప్రశంసలు కురిపించింది. విశ్వవిద్యా లయానికి చెందిన మేనేజ్ మెంట్ విద్యార్థులకు, ప్రాక్టీ షనర్లకు మెట్రో ప్రాజెక్టు విజయగాథ ఒక కేస్ స్టడీగా ఆ సంస్థ ప్రచురించే స్టాన్ఫోర్డ్ సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ (ఎస్ఎస్ఐఆర్) తాజా సంచికలో (స్ప్రింగ్–2024) ప్రచురించింది. ఇది ఒక భారతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవం అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అభివర్ణించింది. ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే అనేక సమస్యలు, వాటిని అధిగమించడానికి కావలసిన నాయకత్వ లక్షణాలు, తదితర అంశాలపై తగిన సూచనలు, పరిష్కార మార్గాలను ఈ త్రైమాసిక జర్నల్ అందజేస్తుంది. ఈ క్రమంలో వివిధ దేశాల్లోని పలు ప్రాజెక్టులపైన విస్తృత అధ్యయనాల్లో భాగంగా ఐఎస్బీ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రామ్ నిడుమోలు, ఆయన బృందం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపైన క్షుణ్ణంగా జరిపిన అధ్యయనాన్ని స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ఒక కేస్ స్టడీగా ఎంపిక చేసుకొని ప్రచురించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు సంస్థ ఎండీ ఎన్వీఎస్రెడ్డి బృందం అసాధారణ నాయకత్వ ప్రతిభను కనబరిచినట్లు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఒకదశలో ఈ ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ క్రమంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి దాన్ని సుసాధ్యం చేశారని జర్నల్‌లో ప్రశంసించారు. ప్రాజెక్టును విజయపథంలో నడిపించారని, ఇది ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమని ఈ కేస్ స్టడీ తెలియజేసింది. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్ విస్తృత ప్రయోజనా లను దృష్టిలో ఉంచుకొని అన్ని సమస్యల్లో సమర్ధవంతమైన నాయకత్వ ప్రతిభను ఎన్వీఎస్ కనబరిచినట్లు జర్నల్‌లో ప్రచురితమైంది. -
కరెన్సీ నోట్లపై 28 రోజుల పాటు వైరస్
మెల్బోర్న్ : వేసవిలోనే కరోనాను నియంత్రించకపోతే ఇక శీతాకాలంలో ఇది మరింత ముదిరే అవకాశం ఉందని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆస్ట్రేలియాకు చెందిన కాన్సాస్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనం ప్రకారం..వేసవి సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే చల్లటి వాతావరణంలో వైరస్ ఎక్కువకాలం జీవించి ఉంటుందని తెలిపారు. మృదువైన గాజు పరికరాలు, కరెన్సీ నోట్లు, మొబైల్ టచ్ స్క్రీన్‌పై 28 రోజుల వరకు వైరస్ నిలిచే ఉంటుందని ఇది అత్యంత ప్రమాదకరమని పరిశోధనలో వెల్లడైంది. వేసవి సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే తేమతో నిండిన వాతావరణంలో కోవిడ్ ఐదు రెట్లు బలంగా ఉంటుందని పరిశోధనకు నాయకత్వం వహించిన వైరాలజిస్ట్ జుర్జెన్ రిచ్ట్ తెలియజేశారు. దీన్ని బట్టి శీతాకాలంలో పరిస్థితిని నియంత్రించడం అతిపెద్ద సవాలు అని పేర్కొన్నారు. (కరోనాని అంతం చేస్తాం) 40 డిగ్రీల సెల్సియస్ వద్ద కొన్ని ఉపరితలాలపై వైరస్ మనుగడ ఒక రోజు కన్నా తక్కువకు పడిపోయిందని తేలింది. టచ్‌స్క్రీన్ పరికరాలైన మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఎటిఎంలు, సూపర్‌మార్కెట్ సెల్ఫ్ సర్వ్ చెక్‌అవుట్‌లు, ఎయిర్పోర్ట్ చెక్ఇన్‌ల వద్ద వైరస్ తీవ్రత అధికంగా ఉంటుంది. కరోనా సోకిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇతరులకు త్వరగా సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వారు తుమ్మడం, దగ్గడం, మాట్లాడేప్పడు విడుదలయ్యే వైరస్ కణాలు ఉపరితలాలపై నిలచే ఉంటాయి. ఇది వైరస్ వ్యాప్తికి సహాయపడుతుందని పేర్కొన్నారు. కరెన్సీ ఒకరి చేత నుంచి మరొకరికి మారేకొద్దీ వైరస్ వారందరికి కోవిడ్ ప్రమాదం పొంచి ఉన్నట్లేనని తెలిపారు. (‘ఇలా ఇస్తే కరోనా వ్యాక్సిన్ అద్భుత ఫలితాలివ్వచ్చు’) -
బాహుబలి.. ఓ పాఠం!
‘బాహుబలి’ సినిమా ఖాతాలో మరో రికార్డు చేరింది. అదేంటంటే.. ‘బాహుబలి’ సినిమా సక్సెస్‌ను పాఠంగా చెప్పబోతున్నారు. ఈ చిత్ర విజయాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎమ్ఎ) ఓ కేస్ స్టడీగా తీసుకుని, పరిశోధన చేయనున్నట్లు అక్కడి ప్రొఫెసర్ భరతన్ కందస్వామి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి’ చక్కని మార్కెటింగ్ స్ట్రాటజీతో మంచి వసూళ్లు రాబట్టింది. సీక్వెల్స్ తీస్తున్నప్పుడు ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయితే రెండో పార్ట్‌కి పబ్లిసిటీ ఈజీగా వస్తుంది. మార్కెటింగ్ సులువు అవుతుంది. ప్రధానంగా నేను సీక్వెల్స్ నిర్మాణం, మార్కెటింగ్ మంత్ర, కలెక్షన్స్ మీద దృష్టి పెట్టబోతున్నాను. ఈ విషయాల్లో అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులకు డిజిటల్ మార్కెట్ గురించి కూడా చెబుతాం. సినిమా ఇండస్ట్రీ గురించి అన్ని కోణాల నుంచి విద్యార్థులకు తెలియజేయనున్నాం.అందుకే సక్సెస్ సాధించిన ‘బాహుబలి’ సినిమాను ఓ కేస్ స్టడీగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి’ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచింది. -
ఆ కేసు అత్తమామలపై కూడా వేయచ్చు!
గృహహింస :: కేస్ స్టడీ శ్రీలత వివాహమై నాలుగేళ్లయింది. భర్త ఐటీ ఉద్యోగి. రెండేళ్ల బాబు. దురదృష్టవశాత్తూ అనారోగ్యంతో భర్త మరణించాడు. అప్పటిదాకా భర్త, అత్తమామలతో కలిసి ఉన్న శ్రీలత పుట్టింటికి చేరింది. పుట్టెడు దుఃఖంతో ఉండి ఏ వ్యవహారాలూ పట్టించుకోలేదు. అత్తగారింట్లో దాదాపు యాభై తులాల బంగారం ఉండిపోయింది. బీరువాలో ఉంచి అత్తగారే తాళం వేశారు. భర్తచనిపోయిన నెలవరకూ అత్తింటివాళ్లు సానుభూతి చూపారు. ఏమైందో ఏమో హఠాత్తుగా వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. శ్రీలత వల్లే తమ కుమారునికి ఆరోగ్యం దెబ్బతిందనీ, ఆమె కారణంగానే అతను మరణించాడనీ, ఆమె జాతకం బాగోలేదనీ నిందించసాగారు. లేనిపోని అభాండాలు వేస్తూ, కొడుకే తమకు కాకుండా పోయాక కోడలితో తమకిక ఏ సంబంధమూ లేదని తెగేసి చెప్పారు. శ్రీలత వారి కడుపుకోతని అర్థం చేసుకుని మిన్నకుండింది. అత్తగారింటినుండి ఏ సహాయమూ ఆశించలేదు, అందలేదు. కానీ బీరువాలో ఉన్న నగలు ఆమె పుట్టింటివారు పెట్టినవి. అవి ఆమె స్త్రీ ధనం. వాటికోసం అత్తగారిని అడిగితే ఆమె ససేమిరా అన్నారు. తమకేం తెలీదని, శ్రీలతే వాటిని తీసుకొని వెళ్లిందని గొడవ పెట్టుకున్నారు. అత్తగారు ఆ నగలను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి శ్రీలత విస్తుపోయింది. తెలిసినవారు గృహహింస కేసు వేయమన్నారు. సాధారణంగా ఆ కేసులు భర్తలపై వేస్తారు కదా! మరి అత్తగారిపై వేయవచ్చా అనే సందేహంతో న్యాయవాదిని ఆశ్రయించింది. అత్తమామలపై ఖచ్చితంగా కే సు వేయవచ్చునని, శ్రీలతకు వారు వివాహం ద్వారా బంధువులవుతారని, అందువల్ల గృహహింస చట్టం ప్రకారం వారిపై కేసు వేయవచ్చునని న్యాయవాది తెలిపారు. నగలకు సంబంధించిన బిల్లులు, బీరువాలో అత్తగారు భద్రపరిచిన విషయం తెలిసిన సాక్షులు, కట్టుబట్టలతో పుట్టింటికి వెళ్లిన వైనం తెలిసిన శ్రేయోభిలాషులు ఉండడంతో ఊపిరి పీల్చుకొని కే సు వేసి, తన స్త్రీధనం దక్కించుకోవాలని నిర్ణయించుకుంది శ్రీలత. -
పెళ్లప్పటి నుండి ఆయన ప్రవర్తన....
వివాహ హక్కుల పునరుద్ధరణకు కేసు వేయచ్చు..! లీగల్ కౌన్సెలింగ్ మాకు వివాహమై తొమ్మిది సంవత్సరాలయింది. మేమిద్దరం ఓ ఏడాదిపాటు అన్యోన్యంగానే జీవించాము. తర్వాత మా అత్తమామలు మా కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల మా ఇద్దరికీ చీటికిమాటికీ గొడవలు అయ్యేవి. వాళ్లు నన్ను అదనపు కట్నం కోసం సూటిపోటి మాటలనేవారు. తన వాళ్లని సంతృప్తి పరచడం కోసం మొదట మా వారు మాటలతో వేధించేవారు. తర్వాత్తర్వాత నాపై చేయి చేసుకోవడం, హింసించడం వరకూ వెళ్లింది. కానీ, రెండేళ్ల క్రితం ఓ రోజు నన్ను శారీరకంగా, మానసికంగా హింసించి, నన్ను, నా ఇద్దరు పిల్లల్ని ఇంట్లోనుంచి వెళ్లగొట్టేశారు. నేను ఎంత ప్రాధేయపడినా వినలేదు. గత్యంతరం లేక నా ఇద్దరు పిల్లల్నీ తీసుకుని పుట్టింటికి చేరాను. మా తలిదండ్రులు వృద్ధులైపోయారు. నాన్న రిటైరై చాలా కాలం అయింది. పెళ్లి కావాల్సిన ఇద్దరు పిల్లల బాధ్యత ఇంకా ఆయన మీద ఉంది. దానికి తోడు నా భారం, నా పిల్లల భారం కూడా ఆయన మీద పడింది. ఇదిలా ఉండగా తనకు విడాకులు కావాలని కోరుతూ కోర్టులో కేసు వేసినట్లు సమన్లు పంపించారు. అయితే మా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా నాకు భర్త నుంచి విడిపోవడం ఇష్టం లేదు. కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఏం చేయాలి? నా పిల్లల పోషణ ఎలా? - పి. సుభాషిణి, హైదరాబాద్ మీ వారు విడాకులు కోరుతూ కోర్టులో కేసు వేశారంటున్నారు. పైగా అది మీకిష్టం లేదంటున్నారు. సరైన సాక్ష్యాధారాలు చూపకుండా విడాకులు మంజూరు కావు. కాబట్టి మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ (వివాహ హక్కుల పునరుద్ధరణ కోసం) కేసు వేయండి. అప్పుడు కోర్టు వారు మీ భర్త వేసిన విడాకుల కేసు, మీరు వేసిన రెస్టిట్యూషన్ కేసు రెండూ కలిపి విచారిస్తారు. మీ పిల్లల పోషణ, మీ పోషణ కోసం మీరు కోర్టులో 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయండి. మీ వారు ప్రభుత్వోద్యోగి అంటున్నారు కాబట్టి ఆయన ఆర్జన శ క్తిని బట్టి మీకు, మీ పిల్లలకు మెయింటెనెన్స్ మంజూరు అవుతుంది. దిగులు పడకండి. మీ సంసారాన్ని చక్కదిద్దడానికి మీ తలిదండ్రులు, మీ తరఫున ఇతర పెద్దమనుషులను తీసుకుని మీ వారి దగ్గరకు వెళ్లి ఒకసారి మాట్లాడి చూడమనండి. కోర్టులో భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఉంటుంది కాబట్టి మీ వారు మనసు మార్చుకుని మీతో కాపురం చేయవచ్చునేమో ప్రయత్నించి చూడండి. ఒకవేళ హెరాస్మెంట్ తట్టుకోలేన నుకుంటే 498 ఎ కింద కేసు ఫైల్ చేయవచ్చు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు డిగ్రీ చదివానంటున్నారు కాబట్టి, ఇంట్లో ఖాళీగా ఉండకుండా మీకు, మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేలా మీకు చేతనైన ఏదో ఒక పని చేయడం ప్రారంభించండి. బెస్టాఫ్ లక్. 6 నెలల క్రితం మా వివాహం జరిగింది. పెళ్లప్పటి నుండి ఆయన ప్రవర్తన అసహజంగా ఉండేది. ఎప్పుడూ ఈ లోకంలో లేనట్లు, ఎక్కడో వేరే లోకంలో విహరిస్తున్నట్లు ఉండడం, అడిగిన దానికి సమాధానం సరిగా సమాధానం చెప్పకపోవడం, భ్రమలలో బతకడంతో సరిపోతోంది. ఇన్నాళ్లూ ఓర్చుకున్నాను. ఇక భరించలేక పెద్దల మధ్య పెట్టాము. వారేమో సర్దుకు పోయి జీవించాలి అంటున్నారు. బంధుమిత్రులేమో సంవత్సరం లోపల విడాకులు రావు అంటున్నారు. నేను ఏమి చేయాలి? -ఎ.నాగశిరీష, విజయవాడ మీరు చెబుతున్న వివరాలను బట్టి మీ భర్త మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. ఆయన ప్రధానంగా స్క్రిజోఫినియాతో బాధపడుతున్నట్లున్నారు. దీనితో బాధపడేవాళ్లు తీవ్రమైన భావోద్వేగాలకు గురవుతారు. భ్రమలు, భ్రాంతులతో జీవిస్తుంటారు. నిజాలు మరచిపోవడం, విపరీత ధోరణులతో అతిగా ప్రవర్తించడం... లాంటివి చేస్తుంటారు. ఇవన్నీ విడాకులు తీసుకోవడానికి తగిన కారణాలు. ఇది విడాకులు తీసుకునేందుకు ఒక సహేతుకమైన కారణ ం అవుతుంది. మీరు మొదట మీ భర్తను డాక్టర్ లేదా సైకాలజిస్ట్ దగ్గరకు పరీక్షలకు తీసుకెళ్లండి. డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని కోర్టులో డిక్లేర్ ది మ్యారేజ్ యాజ్ నల్ అండ్ వాయిడ్ అంటే మీ వివాహం చెల్లదని తీర్పివ్వవలసిందిగా కేసు ఫైల్ చేయండి. ఈ సందర్భంగా మీవారి ఆరోగ్య విషయంలో డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్‌ను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్‌గా వేయండి. మీరు కోర్టులో కేసు వేసి విడాకులు మంజూరయ్యాక మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చినట్లు తీర్చిదిద్దుకోండి. ధైర్యంగా ఉండండి. కేస్ స్టడీ దత్తతకు అనేక నియమ నిబంధనలున్నాయి సుజాత, రమేష్‌ల వివాహమై పదేళ్లయింది. సంతానంకోసం వారు చెయ్యని ప్రయత్నం లేదు. ‘సరోగసి’ అంటే వారికి ఇష్టం లేదు. పిల్లల కోసం వీరి ప్రయత్నాల గురించి తెలిసి, వారి దూరపు బంధువుల కుటుంబం ఒకటి వాళ్ల పాపను దత్తత ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే దత్తత ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా చాలా సులభమే అనుకుంటున్న ఆ రెండు జంటలు అందుకు అనేక నియమ నిబంధనలు ఉంటాయని తెలిసి ఆశ్చర్యపోయారు. దత్తత స్వీకారం గురించి దానికి సంబంధించిన షరతులు, అర్హతల గురించి హిందూ అడాప్షన్ అండ్ మెయిన్టెనెన్స్ యాక్ట్ 1956 ఇలా చెబుతోంది. దత్తత తీసుకునే విషయంలో ఎటువంటి ఆంక్షలూ లేవు. స్త్రీ అయినా, పురుషుడైనా, వివాహితులైనా, కాకపోయినా, వితంతువులయినా, విడాకులు పొందిన వారైనా దత్తత తీసుకోవచ్చు. అయితే వారు మేజర్ అయి ఉండాలి. మానసిక స్వస్థత కలిగి ఉండాలి. అబ్బాయిని దత్తత చేసుకోవాలంటే వారికి అంతకుముందే అబ్బాయి జన్మించి ఉండకూడదు అమ్మాయిని దత్తత చేసుకోవాలంటే వారికి అంతకు ముందు అమ్మాయి జన్మించి ఉండకూడదు. అదేవిధంగా ఎవరైతే వారి పిల్లలను ఇతరులకు దత్తత ఇవ్వబోతున్నారో వారికి కొన్ని షరతులు ఉన్నాయి. భార్యాభర్తలిద్దరి పరస్పర అంగీకారంతోనే దత్తత ఇవ్వాలి. ఒకవేళ భర్త చనిపోయినా, హిందూ మతాన్ని వదలివేసినా తల్లి దత్తత ఇవ్వవచ్చును. దత్తత చేసుకోబోయే బాలుడు/బాలిక 15 సం॥లోపు వయస్సు కలిగిన హిందువు అయి ఉండాలి. అవివాహితులై ఉండాలి. ఏవైనా కులాచారాలు, సంప్రదాయాలు అనుమతించితే 15 సం॥లు వయస్సు దాటిన వారిని, వివాహితులను కూడా దత్తత చేసుకోవచ్చును. అలాగే ‘దత్తత స్వీకార పత్రం’ రాయించుకొని రిజిస్టర్ చేయించుకుంటే మంచిది. ముందు జాగ్రత్త చర్యగా ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయం... అమ్మాయిని దత్తత చేసుకుంటే దత్తత తీసుకునే తండ్రి ఆమె కంటే 21 సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి. అబ్బాయిని దత్తత చేసుకుంటే దత్తత తీసుకునే తల్లి అతనికంటే 21 సంవత్సరాలు పెద్దదై ఉండాలి. హిందూ అడాప్షన్ అండ్ మెయిన్టెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం... దత్తత చేసుకోబోయే బాలుడు/బాలిక 15 సం॥లోపు వయస్సు కలిగిన హిందువు అయి ఉండాలి. అవివాహితులై ఉండాలి. ఇక ముఖ్యమైన విషయం... అమ్మాయిని దత్తత చేసుకుంటే దత్తత తీసుకునే తండ్రి ఆమె కంటే 21 సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి. అబ్బాయిని దత్తత చేసుకుంటే దత్తత తీసుకునే తల్లి అతనికంటే 21 సంవత్సరాలు పెద్దదై ఉండాలి. -
విచారణలో ఉన్న విడాకుల కేసుల్లోనూ మనోవర్తి
కేస్ స్టడీ విష్ణు, మనోజలది ప్రేమ వివాహం. వివాహమై ఆరేళ్లయింది. విష్ణు ఒక అనాథ. దాతల ఆదరణతో పెద్దవాడై చిన్నవ్యాపారంలో సెటిల్ అయ్యాడు. మనోజది కూడా పేద కుటుంబమే. పెళ్లి నాటికి ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదువుపట్ల ఆమెకున్న శ్రద్ధను గ్రహించిన విష్ణు, ఎలాగైనా ఆమెను పెద్ద చదువులు చదివించి ఆఫీసర్‌ను చేయాలనుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడి ఆమెకు ఉన్నత విద్యనందించాడు. ఆమెకూడా అంతే కష్టపడింది. పోటీపరీక్షల్లో నెగ్గి గజిటెడ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించుకుంది. విష్ణుకల నెరవేరింది. కానీ విధి వక్రీకరించి విష్ణుకు పెద్ద యాక్సిడెంట్ అయింది. కాలూచేయి చచ్చుబడి ప్రాణం మాత్రం నిలబడింది. ఒక ఏడాదిపాటు ఎలాగో భరించిన మనోజ, తర్వాత అతన్ని అర్ధాంతరంగా వదిలేసి, విడాకుల కేసు వేసింది. విష్ణు గుండెల్లో పిడుగు పడింది. నోటీసులు తీసుకుని కోర్టుకు హాజరు కావాలన్నా దారి ఖర్చులకు కూడా డబ్బుల్లేవు. తిండికే గడవని పరిస్థితి. వ్యాపారం మూతపడింది. సంపాదించే సత్తువ లేదు. సంపాదనంతా భార్య ఉన్నతికే ఖర్చు చేశాడు. పిల్లలను కూడా పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. దిక్కుతోచని పరిస్థితిలో న్యాయవాదిని సంప్రతించాడు. సలహా ఇవ్వమని వేడుకున్నాడు. విష్ణు దీనస్థితికి జాలిపడిన న్యాయవాది, హిందూ వివాహ చట్టం సెక్షన్ 24 ప్రకారం కోర్టులో భార్యాభర్తల మధ్య విడాకుల కేసులు విచారణలో ఉన్నకాలంలో కోర్టు ఖర్చులకు, ఇతర ఖర్చులకు గాను కొంత సొమ్ము ఇవ్వాలని ఇరుపక్షాల ఆర్థిక పరిస్థితిని పరిశీలించి ఒక మధ్యంతర ఉత్తర్వును జారీ చేసే అవకాశం ఉంటుందని తెలియజేశారు. సెక్షన్ 24 వివాదంలో ఉన్న వివాహితులకు సత్వర తాత్కాలిక పరిష్కారాన్ని ఇవ్వటం కోసం ఉద్దేశించిందని వివరించారు. దాంతో విష్ణు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. -
భార్య ఉద్యోగం చేస్తున్నా... భరణం ఇవ్వవలసిందే!
కేస్ స్టడీ ప్రసాద్, లక్ష్మిల వివాహమై 5 సం. అయింది. భారీ కట్నకానుకలు ముట్టచెప్పారు లక్ష్మి అమ్మనాన్నలు. ఇద్దరూ ఉద్యోగులే. వారికిప్పుడు రెండేళ్లబాబున్నాడు. గత సంవత్సరం నుండి ప్రసాద్ ఇంటికి రావడం మానేశాడు. ఏ కారణంగా రావట్లేదని అడిగితే పొంతనలేని సమాధానమిస్తున్నాడు. కారణం తెలుసుకోవడానికి లక్ష్మి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కట్నం సరిపోలేదని, తనకు ప్రమోషన్ వచ్చి జీతం పెరిగిందని, కనుక అదనపు కట్నం కావాలని, డబ్బు వచ్చేవరకు తను వేరే రూంలో వుంటానని నిస్సిగ్గుగా చెప్పాడు ప్రసాద్. తన పేరెంట్స్ ఇక ఇవ్వలేరని తేల్చేసింది లక్ష్మి. ససేమిరా అన్నాడు ప్రసాద్. పోలీసు కేసులు తననేమీ చేయలేవని, ఉద్యోగం చేస్తున్న కారణంగా లక్ష్మికి మెయిన్టెనెన్స్ రాదని బెదిరించసాగాడు. లక్ష్మి లీగల్ హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. తనకు పోలీసు కేసు పెట్టే ఉద్దేశం లేదని, మెయిన్టెనెన్స్ వస్తుందా రాదా అని వివరం అడిగింది. భార్యనూ, పిల్లలను పోషించవలసిన బాధ్యత భర్తదే అని, కనుక భరణం వస్తుందని, ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన భరణం రాకుండా పోదనీ, ఇద్దరి ఆదాయాలూ, ఖర్చులూ పరిగణనలోకి తీసుకుని, భార్య ఆదాయం పోషణకు సరిపోకుండా భరణం వస్తుందని, మైనర్ బాబు ఉన్నాడు కనుక తప్పకుండా మెయిన్టెనెన్స్ వస్తుందని తెలుసుకుంది. పైగా నిష్కారణంగా బెదిరింపులకు దిగడం, భార్యతో కాపురం చేయకపోవడం, ఆలనాపాలనా చూడకపోవడం, భార్య ఉండగానే మరో స్త్రీతో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడం వంటివన్నీ కూడా శిక్షార్హమైన చర్యలని, ఈ విషయాలన్నీ భర్త కూడా తెలుసుకునేలా చేసింది. దాంతో ఆమె భర్త ప్రసాద్ దెబ్బకు దారిలోకొచ్చాడు. -
ఆ రోగులకూ హక్కులు ఉన్నాయి
కేస్ స్టడీ వారు ఒక రకంగా శాపగ్రస్తులు. విధివంచితులు. ఎవరో చేసిన పాపాలకు బలైనవారు. వారంతా హెచ్ఐవీ బాధితులు. ఖరీదైన వైద్యానికి నోచుకోని పేదలు. కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ వారిచ్చే ఏఆర్టీ పైన ఆధారపడుతున్నవారు. తమనెవరూ గమనించకుండా ముఖాలకు స్కార్ఫ్ కట్టుకొని ఆస్పత్రికివెళ్లి నెలనెలా మందులు తెచ్చుకోవాలి. పరీక్షలు చేయించుకోవాలి. ఇక హాస్పిటల్ సిబ్బంది ఛీత్కారాలకు, వేధింపులకూ కొదవేలేదు. వారిని తాకితేనే పాపమన్నట్టుగా, గాలిసోకితేనే నష్టమన్నట్టుగా చూస్తూ వారిని ఎంతో అవమానిస్తున్నారు. మానవీయంగా ప్రవర్తించవలసిన వైద్యసిబ్బంది వారి పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. హింసిస్తున్నారు. ఒక్కొక్కసారి వారిని నెట్టివేస్తున్నారు. చులకనగా చూస్తున్నారు. హేళన చేస్తున్నారు. ఎంత రోగగ్రస్తులైనా, వారికీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంటుంది కదా, అందుకే వారు అసలు తమకు గల హక్కులూ, రక్షణల గురించి తెలుసుకోవాలని ఒక స్వచ్ఛంద సేవాసంస్థను సంప్రదించారు. హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కోర్టుల తీర్పు ప్రకారం, అంతర్జాతీయ ఒప్పందాల్లో పేర్కొన్న ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నో హక్కులున్నాయి. 1. వివక్ష లేకుండా ఉండడం, సమానత్వపు హక్కు చట్టం ముందు అందరూ సమానమేనన్న హక్కు. 2. స్వేచ్ఛ రక్షణ ఉండే హక్కు 3. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించే హక్కు 4. ఎయిడ్స్ ఉన్న వ్యక్తులను వివాహం చేసుకునే హక్కు 5. గుప్తత హక్కు 6. అమానవీయ హింసల నుండి రక్షణ పొందే హక్కు 7. ఉద్యోగ హక్కు 8. నష్టపరిహారం పొందే హక్కు వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకారం ప్రతి పేషెంట్‌కి నెలకు 1000/- ఆర్థిక సహాయం పొందవచ్చును. వారి హక్కులకు భంగం వాటిల్లితే హైకోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. కనుక హాస్పిటల్ వారి అమానవీయ ప్రవర్తన గురించి కోర్టును ఆశ్రయించి న్యాయం పొందాలని నిర్ణయించుకున్నారు. -
బ్యాడ్ టచ్‌కి శిక్ష తప్పదు!
కేస్ స్టడీ లైంగిక వేధింపులు స్నేహ వాళ్లు కొత్తగా ఆ అపార్ట్మెంట్లోకి వచ్చారు. ఆమె, ఆమె భర్త ఇద్దరూ ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగులు. వారికి ముద్దులు మూటగట్టే ఒక ఐదేళ్ల చిన్నారి. పేరు శ్రేయ. స్నేహ తన పాపను స్కూల్లో చేర్పించాలని చుట్టు పక్కల స్కూళ్ల గురించి వాకబు చేసింది. వారుండేది ఊరి శివార్లలోని కాలనీలో కావడం వల్ల స్కూళ్లన్నీ దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అదే అపార్ట్మెంట్లో రమ్య కుటుంబం స్నేహకు పరిచయమైంది. వారి పాప శ్వేతది కూడా శ్రేయ వయస్సే. వాళ్లు కూడా మంచి స్కూల్‌కోసం వెతుకుతున్నారు. ఇక ఇద్దరూ కలిసి వెతకగా 20 కి.మీ. దూరంలో ఉండే ఒక మంచి ‘కార్పొరేట్’ స్కూల్ గురించి తెలిసింది. పెద్ద బిల్డింగ్, మంచి టీచర్స్, బస్ సౌకర్యం కూడా ఉండడంతో అందులో చిన్నారులనిద్దరినీ చేర్పించారు పిల్లలనిద్దరినీ స్కూల్లో చేర్పించి వారమైంది. స్నేహ, రమ్యలిద్దరూ మంచి స్కూల్ దొరికినందుకు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నెల రోజులైనా కాకముందే పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్లమని మొరాయించారు. ఇంటికి వచ్చేటప్పుడు భయంభయంగా వచ్చేవారు. స్కూల్‌కు అయిష్టంగా వెళ్లేవారు. రానురాను పిల్లల మానసిక స్థితిలో మార్పు వచ్చింది. ఎంతో చలాకీగా ఆరోగ్యంగా ఉండే పిల్లలు రోజురోజుకూ డీలా పడిపోతున్నారు. చూపుల్లో బేలతనం, దైన్యం కనిపించసాగాయి. నిద్రలో కూడా ఏవేవో కలవరిస్తున్నారు. ఇక లాభం లేదనుకొని స్నేహ, రమ్యలిద్దరూ స్కూల్లో ఆరా తీశారు. అక్కడ అంతా బాగానే ఉంది. పిల్లలు మధ్యాహ్నం భోంచేస్తున్నారు. క్లాస్‌లో పాఠాలు వింటున్నారు. టీచర్స్ నుండి ఏ కంప్లైట్స్ లేవు. మరెందుకు పిల్లలిలా డల్‌గా, భయం భయంగా ఉన్నారా అని స్నేహ, రమ్య బుర్ర బద్దలు కొట్టుకున్నారు. ఒక రోజు పిల్లలను తీసుకుని పార్క్‌కి వెళ్లారు. ఎన్నో రకాలుగా బుజ్జగించి, లాలించగా గుండెలు బద్దలయ్యే విషయం ఆ చిన్నారుల నుండి బయటపడింది. స్కూల్ బస్ ఇంటిముందుకే వచ్చేది. మరలా ఇంటి ముందే దిగేది. మొదట ఎక్కే పిల్లలూ, ఆఖరిలో దిగే పిల్లలు శ్రేయ, శ్వేతలే. ఇటీవల పిల్లలు నవ్వుతూ ఎందుకు ‘బై’ చెప్పడం లేదో ఆ తల్లులకు అర్థమైంది. తమది ఆఖరు స్టాప్ కాపడం వల్ల బస్‌లో కేవలం శ్రేయ, శ్వేతలే ఉండేవారు. డ్రైవర్ బస్ నడుపుతుంటే, హెల్పర్ (పిల్లలను కూర్చోబెట్టి, దింపే వ్యక్తి) పిల్లల పక్కన చేరి వారిని తాకరాని చోట్లల్లో తాకుతూ, వికృతమైన చేష్టలు చేయడం ప్రారంభించాడు. ‘అంకుల్’ అని ప్రేమగా, అమాయకంగా పిలిచే ఆ చిన్నారుల పట్ల ఆ నీచుడు గత కొన్ని రోజులుగా అమానుషంగా ప్రవర్తించసాగాడు. అందుకే పిల్లలు స్కూల్ అంటే హడలిపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లులు ఆగ్రహంతో రగిలిపోయారు. స్కూల్‌కి వెళ్లి యాజమాన్యానికి కంప్లైట్ ఇచ్చి, ఆ నీచుడిని పట్టుకొని చితగ్గొట్టి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ‘లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2012’ను అనుసరించి కేస్ బుక్ చేసి వాడిని జైలుకు పంపారు. ఈ చట్ట ప్రకారం నిందితులకు ఏడేళ్ల నుండి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. అంటే వేధింపుల తీవ్రతను అనుసరించి శిక్షలు పెరుగుతుంటాయి. పై చిన్నారుల విషయంలో ‘లైంగిక దాడి’ జరిగింది కాబట్టి దానికి మూడేళ్లకు తగ్గకుండా ఐదేళ్ల వరకు పొడిగించగల శిక్ష పడుతుంది. చిన్నారుల వాంగ్మూలం వారి ఇంటికి వెళ్లి తీసుకోవాలని, కేసును ఇన్కెమెరాగా విచారించాలని, పిల్లలను ఏ రకంగా ఇబ్బంది పెట్టకూడదని, చట్టం ప్రకారం ప్రచార మాధ్యమాలు కూడా బిడ్డ పేరును, గుర్తింపును, కుటుంబ వివరాలు, బిడ్డను గుర్తించేందుకు దారి తీసే విషయాలు బయట పెట్టకూడదని చట్టం నిర్దేశించింది. -
పనిచేసేచోట వేధిస్తే పనిష్మెంటే...!
కేస్ స్టడీ జానకి ఒక పెద్ద ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి. భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫీస్‌లో నిజాయితీ గల అధికారిగా, హుందాగా ఉండే మహిళగా జానకికి మంచి పేరుంది. ఆఫీస్ వ్యవహారాలలో ఎంత నిక్కచ్చిగా ఉంటుందో, తోటి ఉద్యోగులకు సాయం చేయడంలో అంత ఉదారంగా వ్యవహరిస్తుంది. ఎవరికి ఏ కష్టమొచ్చినా, వెంటనే స్పందించే ఏకైక వ్యక్తిగా మంచి పేరుంది. మహిళా ఉద్యోగులూ, పురుష ఉద్యోగులూ అందరూ గౌరవించే, అభిమానించే ఆఫీసర్ జానకి. సబార్డినేట్స్‌తో కలుపుగోలుగా ఉంటూ, ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్న సమయంలో, కొత్తగా వచ్చిన తన పై ఆఫీసర్‌తో సమస్య మొదలైంది జానకికి. ఛార్జ్ తీసుకున్న రోజు నుంచే అతనికి జానకికై కన్ను పడింది. అందంగా, హుందాగా ఉండే జానకిని ఎలాగైనా గదీసుకోవాలనుకున్నాడు. ఆయన వయసు రిటైర్మెంట్కు దగ్గరగా ఉంది. అయినా చెడుబుద్ధి మాత్రం ఇంకా పోలేదు. మహిళా ఉద్యోగులంటే చులకన భావం. వారంతా సులువుగా లొంగిపోతారన్న దురభిప్రాయం. దాంతో అవసరం ఉన్నా, లేకున్నా జానకిని తన ఛాంబర్‌కి పిలిపించుకుని ఆమె చీరల సెలక్షన్ బాగుంటుందని ఒకసారి, ‘మీ భర్త విదేశాల్లో ఉన్నారుగా, మీకు కంపెనీ ఎలా?’ అంటూ ద్వంద్వార్థ సంభాషణలు చేయడం మొదలు పెట్టాడు. అతని వ్యవహారం పసిగట్టిన జానకి అంటీముట్టనట్టుగా వ్యవహరించసాగింది. ఎంతో అవసరం ఉంటే తప్ప అతని ఛాంబర్‌కు వెళ్లడం లేదు. ఫైళ్లన్నీ అటెండర్‌తో పంపసాగింది. దాంతో అతనికి పంతం పెరిగింది. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అదనపు పని అప్పగించి, ఆఫీస్ టైమ్ దాటాక కూడా ఆఫీస్ పని చేసేలా వేధించసాగాడు. ఇవన్నీ జానకిని ఎంతో కృంగదీశాయి. అయినా ఎవరికీ చెప్పుకోలేదు. భర్త విదేశాలలో ఉన్నారు. తోటి ఉద్యోగులకు చెప్పాలంటే అతని వయసు దృష్ట్యా నమ్మరేమో అని! అతని వెకిలి ప్రవర్తన, తనను తాకాలని చేసే ప్రయత్నాలు, ద్వంద్వార్థాల డైలాగులు, అనవసరపు పొగడ్తలు భరించలేకపోయింది. తమ కార్యాలయంలో ‘పని చేసే చోట లైంగిక వేధింపుల చట్టం’ గురించి తన ఆధ్వర్యంలోనే రెండుమూడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసింది. ఆ చట్టం ప్రకారం ‘ఫిర్యాదుల కమిటీ’ కూడా ఏర్పడేలాగా కృషి చేసింది. ఈ కొత్త మేనేజర్‌కి చట్టం గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఇంత బరితెగించి ప్రవర్తిస్తున్నాడని తీవ్రమైన మనోవ్యధకు గురైంది. తోటి మహిళా ఉద్యోగులు ఇది గమనించి, జానకిపై ఎంతో ఒత్తిడి తెస్తే అసలు విషయం తెలిపింది. వారు అవాక్కయ్యారు. వారిలో ఇంకొకరి పరిస్థితి కూడా జానకిలాగే ఉంది. ఆమెను కూడా కొత్త మేనేజర్ ఇలాగే వేధిస్తున్నాడట. లొంగిపోతే ప్రమోషన్‌కు సిఫారసు చేస్తానని, లేకుంటే మారుమూల ప్రాంతానికి బదిలీ ఉత్వర్వులు ఇప్పిస్తాననీ బెదిరింపులకూ దిగాడట. ఇక లాభం లేదనుకుని జానకి, ఆమె కలిసి ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారు దానిని ‘ఫిర్యాదుల కమిటీ’ కి పంపించారు. వారు దీనిని క్షుణ్ణంగా విచారించి, తోటి ఉద్యోగుల అభిప్రాయాలను కూడా అడిగి, వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ‘లైంగిక వేధింపులు’ జరిగాయని నిర్థారణకు వచ్చారు. వారిని వేధింపులకు గురి చేసిన ఉన్నతాధికారిని పిలిచి విచారించి, ‘ప్రవర్తన మార్చుకుంటారా లేక క్రిమినల్ కేసు పెట్టమంటారా?’ అని అడిగారు. దెబ్బకు దిగి వచ్చిన మేనేజర్ తనకు పెళ్లి కావలసిన పిల్లలున్నారనీ, కేసు పెట్టవద్దనీ జానకి వాళ్లకి రాతపూర్వకంగా క్షమాపణ రాసి ఇచ్చి, తనే మారుమూల ప్రదేశానికి బదిలీ చేయించుకుని వెళ్లాడు. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ష్యామిలీ కౌన్సెలర్ -
తను మేజర్ అయితే... మీ ప్రాబ్లెమ్ మైనర్ అవుతుంది!
మ్యారేజ్ కౌన్సెలింగ్ నేను నా క్లాస్‌మేట్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. పెద్దలకు ఇష్టం లేకుండా ఇద్దరం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుని రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్టర్ కూడా చేసుకున్నాము. ఇద్దరం గుజరాత్ వెళ్లి కొన్ని రోజులు కాపురం కూడా చేశాము. కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ నుండి వాళ్ల పుట్టింటి వాళ్లొచ్చి, ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్లిపోయారు. తర్వాత ఆ అమ్మాయితో డిక్లేర్ ది మ్యారేజ్ యాజ్ నల్ అండ్ వాయిడ్ అని... పెళ్లిని రద్దుచేయమంటూ కోర్టులో కేస్ ఫైల్ చేయించారు. ఆ అమ్మాయి మేజర్ కాదని, ఇంకా మైనర్ కాబట్టి మా పెళ్లి చెల్లదని వాదిస్తున్నారు. నేను ఆమె లేనిదే జీవించలేను. ఈ పరిస్థితుల్లో నేను ఏమి చేయాలి? - సుహాస్, కర్నూల్ మీకు తెలిసి మీ భార్య మేజర్ కదా. మీరూ అదే చెబుతూ కోర్టులో కౌంటర్ ఫైల్ చేయండి. ఆమె వయసును నిర్ధారించడానికి డాక్టర్ ఎగ్జామినేషన్ కోసం ఒక ఐ.ఎ. ఫైల్ చేయించండి. అదీగాక ఆమె వయసు నిర్థారణకు ఆమె టెంత్ క్లాస్ సర్టిఫికేట్ కూడా పనికి వస్తుంది. అది మీ దగ్గర ఉంటే కోర్టులో దాఖలు చేయవచ్చు. మీరు ఆమె మేజర్ అని నిరూపించగలిగితే చాలు. మీరు ఎలాగూ చట్టబద్ధంగా వివాహితులే. పైగా పెళ్లి రిజిస్టర్ కూడా అయింది కాబట్టి పెళ్లి రద్దు చేయడం చెల్లదు. మీ కేసు డిస్మిస్ అవుతుంది. ఆమెకు నిజంగా మీ మీద ప్రేమ ఉంటే మీతో కలిసి జీవించడానికి తప్పక వచ్చి తీరుతుంది. విచారించకండి, ధైర్యంగా కేస్ వాదించుకోండి. మది సంఘంలో బాగా పేరు ప్రఖ్యాతులున్న ధనిక కుటుంబం. మా వివాహాన్ని పెద్దలే కుదిర్చారు. మాకు ఇద్దరు పిల్లలు. 16 ఏళ్ల మా వైవాహిక జీవితంలో నేనెప్పుడూ నా భార్యను హింసించింది కానీ, బాధపెట్టింది కానీ లేదు. కానీ నా భార్య మాత్రం తన అనైతిక చర్యతో నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా కూతురికి 14 సంవత్సరాలు, మా అబ్బాయికి 12 సంవత్సరాలు. ఈ ఎదిగిన ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని నా భార్య నేను ఇంటిలో లేని సమయంలో నా ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. నిజానికి ఈ విషయాన్ని గతంలోనే ఎంతోమంది నాకు చెప్పినా నేను నమ్మలేదు. కానీ, ఒకరోజు స్వయంగా నా కళ్లారా చూసిన తర్వాత నమ్మక తప్పలేదు. అదేమిటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. మరో విచిత్రం ఏమిటంటే నా తలిదండ్రులకు ముందే ఈ విషయం తెలుసట. అయితే ఈ సంగతి బయట పెట్టి నా మనసు వికలం చేయడం ఇష్టం లేక, పరువు మర్యాదలు పోగొట్టుకోవడం ఇష్టం లేకా నోరు నొక్కుకుని ఉన్నారట. ఇప్పుడు విషయం బయట పడిన తర్వాత నా తలిదండ్రులు ఆమె పుట్టింటి వారిని పిలిపించి వాళ్లముందే హితవు చెప్పారు. అప్పుడు మాత్రం అందరూ నంగిగా మాట్లాడుతూ సమాధానం దాటవేశారు. ఆ తర్వాత నా భార్య ఇంటిలో ఎవరూ లేనప్పుడు నన్ను, పిల్లల్ని వదిలేసి అతనితో కలిసి ఇంటిలోనుంచి వెళ్లిపోయింది. ఎంత వెదికినా దొరకలేదు. ఎంతో పరువుగల కుటుంబం మాది. ఈ సంఘటనతో మేము చాలా రోజుల పాటు తల ఎత్తుకుని తిరగలేకపోయాము. ఇది జరిగి ఐదేళ్లయింది. నేను ఆమెకోసం ఇంకా ఎదురు చూడటం వృథా అని, ఇంట్లో అందరూ నాకు మళ్లీ పెళ్లి చేయాలని, డైవోర్స్ తీసుకోమని బలవంత పెడుతున్నారు. నేను ఏమి చేయాలి? - శ్యామ్, హైదరాబాద్ మీరు వెంటనే లీగల్‌గా డైవోర్స్ కోసం కోర్టులో కేసు ఫైల్ చేయండి. అడల్టరీ గ్రౌండ్స్ కింద మీకు కచ్చితంగా విడాకులు మంజూరవుతాయి. పిల్లల కష్టడీ కోసం కేసు ఫైల్ చేయండి. వాళ్లు చెప్పిన దాని ఆధారంగానూ, తండ్రి ఎలాగూ పిల్లలకు సహజమైన సంరక్షకుడు కాబట్టి వారి కష్టడీ మీకే వస్తుంది. తర్వాత మీ జీవితాన్ని మీకు ఇష్టమైన విధంగా గడపవచ్చు. మా తలిదండ్రులకు మేము ఇద్దరం ఆడపిల్లలం, ఒక కొడుకు. ముగ్గురికీ పెళ్లయిపోయింది. నాన్నగారి వైపు వారు బాగా స్థితిమంతులు కావడం వల్ల మా ఇద్దరికీ బాగా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. మాపెళ్లయిన కొద్దిరోజులకు తమ్ముడి పెళ్లయింది. అందరం సుఖంగా కాపురాలు చేసుకుంటున్నాము. నాన్న ఈ మధ్య సడెన్‌గా పోయారు. ఆయనకు మా ఇద్దరి ఆడపిల్లల మీద ఉన్న ప్రేమతో తన ఆస్తిని మూడు భాగాలుగా చేసి ముగ్గురికీ సరిసమానంగానూ, బ్యాంక్‌లో ఉన్న రెండు కోట్ల క్యాష్ డిపాజిట్లు తమ్ముడికీ చెందేలాగానూ వీలునామా రాశారు. అయితే వీలునామాను రిజిస్టర్ చేయలేదు. దాంతో తమ్ముడు అమ్మ దగ్గరున్న ఆ విల్లును దొంగ విల్లు అనీ, ఆ సిగ్నేచర్ నాన్నగారిది కాదనీ బుకాయిస్తూ మాకు ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. మేము ఏం చేయాలిప్పుడు? - ముకుంద, హైదరాబాద్ మీరు మొదట మీ మేనమామలు, ఇతర సమీప బంధువులను మీ తమ్ముడి దగ్గర కూర్చోబెట్టి మంచి మాటల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నాన్నగారు ప్రభుత్వాధికారి అంటున్నారు కాబట్టి ఆయన సంతకాలు ఎన్నో చోట్ల ఉండే ఉంటాయి. వీలునామాలో ఉన్న మీ నాన్నగారి సంతకాన్ని వాటితో సరిపోల్చి చూడమనండి. అందుకు మీ తమ్ముడు ఒప్పుకోకపోతే ఎలాగూ మీ నాన్నగారి వీలునామా పైన ఇద్దరు సాక్షుల సంతకాలు ఉంటాయి కాబట్టి వారి సహకారంతో మీ ఇద్దరు అక్కచెల్లెళ్లు ‘డిక్లేర్ ది విల్ యాజ్ వ్యాలిడ్’ అంటూ ఒక పిటీషన్, మీ అంగీకారం లేనిదే ఆస్తిపాస్తులు అమ్మడానికి వీలు లేదని హెచ్చరిస్తూ ఒక ఇంజెంక్షన్ కేసును ఫైల్ చేయండి. ఈలోగా మీ లాయర్ సహకారంతో నాన్నగారి సిగ్నేచర్స్‌ను ఫోరెన్సిక్ లేదా హ్యాండ్ రైటింగ్ నిపుణుల వెరిఫికేషన్‌కు పంపితే వీలునామాలో మీ నాన్నగారి సంతకాలు అసలువో కాదో రూఢీ చేస్తూ రిపోర్ట్ వస్తుంది. దాని ఆధారంగా కోర్టు మీ పక్షాన తీర్పు ఇస్తుంది. కోర్టు తీర్పును మీ తమ్ముడు శిరసావహించవలసిందే కదా! కేస్ స్టడీ చక్కదిద్దుకోవడం మన చేతుల్లోనే... సుందరీ సుబ్బారావుల పెళ్లయి పదేళ్లయింది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. పేరుకు తగ్గట్టు సుందరి చాలా అందంగా ఉంటుంది. సుబ్బారావు ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. ఓ రోజు సుబ్బారావు, అతని పిల్లలు స్కూలు నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం పెట్టి, తాళం చెవులు పక్కింటివాళ్లకి ఇచ్చి వెళ్లింది. లోపలికి వెళ్లి చూసే సరికి ఆమె తన నగలు, బట్టలతోబాటు కొంత డబ్బు కూడా తీసుకుని వెళ్లినట్లు అర్థమయింది. వెతకగా వెతకగా ఆమె తన క్లాస్‌మేట్‌తో కలిసి వెళ్లిపోయిందని తెలిసింది. దాంతో సుబ్బారావు హతాశుడయ్యాడు. గుండె రాయి చేసుకుని తన తల్లి సాయంతో పిల్లలను పెంచుకుంటూ ఎలాగో జీవిస్తున్నాడు. ఆమె వెళ్లిపోయి ఇప్పటికి ఏడెనిమిదేళ్లకు పైగానే అయింది. ఇటీవలే తల్లి చనిపోవడంతో పిల్లల పెంపకం చాలా కష్టమైపోయింది. మనసులో మాట చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. దాంతో జీవితం దుర్భరంగా అనిపించింది. బంధువులు, శ్రేయోభిలాషుల సలహాతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. లాయర్ సూచన మేరకు నాట్ హర్డ్ ఫర్ 7 యియర్స్ అనే గ్రౌండ్ మీద డైవోర్స్ ఫైల్ చేశాడు. భార్య చిరునామా కూడా తెలియదు కాబట్టి పేపర్ పబ్లికేషన్ ద్వారా డైవోర్స్ ఫైల్ చేశాడు. ఆమె ఎక్స్‌పార్టీ అయింది కాబట్టి కోర్టు డైవోర్స్ మంజూరు చేసింది. ఆ తర్వాత తమ బంధువుల్లోనే ఒక పద్ధతైన అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకుని హాయిగా భార్యాపిల్లలతో కలసి జీవనం సాగించాడు. ప్రపంచంలో కష్టాలెదురయేవాళ్లు చాలామంది ఉన్నారు. కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మహత్యే పరిష్కారం కాదు. జీవితాన్ని కష్టాలకు ఎదురొడ్డి చక్కగా ఎలా మలుచుకోవచ్చో అనేందుకు ఇదొక ఉదాహరణ. ప్రేమ ధైర్యాన్నిస్తుంది. పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడే శక్తిని ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఆ శక్తి సరిపోదు. పెద్దలను ఎదిరించి పెళ్లయితే చేసుకోవచ్చు కానీ... చట్టం ముందు దాన్ని నిలబెట్టుకోవడం... పెద్ద సమస్య అయి కూర్చుంటుంది! అమ్మాయి మైనర్ అయినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే అమ్మాయి, అబ్బాయి ఈ మేజర్, మైనర్ సమస్యల గురించి పెళ్లికి ముందే ఆలోచించాలి. నిశ్చల సిద్ధారెడ్డి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్