భార్య ఉద్యోగం చేస్తున్నా... భరణం ఇవ్వవలసిందే!
కేస్ స్టడీ
ప్రసాద్, లక్ష్మిల వివాహమై 5 సం. అయింది. భారీ కట్నకానుకలు ముట్టచెప్పారు లక్ష్మి అమ్మనాన్నలు. ఇద్దరూ ఉద్యోగులే. వారికిప్పుడు రెండేళ్లబాబున్నాడు. గత సంవత్సరం నుండి ప్రసాద్ ఇంటికి రావడం మానేశాడు. ఏ కారణంగా రావట్లేదని అడిగితే పొంతనలేని సమాధానమిస్తున్నాడు. కారణం తెలుసుకోవడానికి లక్ష్మి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కట్నం సరిపోలేదని, తనకు ప్రమోషన్ వచ్చి జీతం పెరిగిందని, కనుక అదనపు కట్నం కావాలని, డబ్బు వచ్చేవరకు తను వేరే రూంలో వుంటానని నిస్సిగ్గుగా చెప్పాడు ప్రసాద్. తన పేరెంట్స్ ఇక ఇవ్వలేరని తేల్చేసింది లక్ష్మి. ససేమిరా అన్నాడు ప్రసాద్. పోలీసు కేసులు తననేమీ చేయలేవని, ఉద్యోగం చేస్తున్న కారణంగా లక్ష్మికి మెయిన్‌టెనెన్స్ రాదని బెదిరించసాగాడు. లక్ష్మి లీగల్ హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. తనకు పోలీసు కేసు పెట్టే ఉద్దేశం లేదని, మెయిన్‌టెనెన్స్ వస్తుందా రాదా అని వివరం అడిగింది.
భార్యనూ, పిల్లలను పోషించవలసిన బాధ్యత భర్తదే అని, కనుక భరణం వస్తుందని, ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన భరణం రాకుండా పోదనీ, ఇద్దరి ఆదాయాలూ, ఖర్చులూ పరిగణనలోకి తీసుకుని, భార్య ఆదాయం పోషణకు సరిపోకుండా భరణం వస్తుందని, మైనర్ బాబు ఉన్నాడు కనుక తప్పకుండా మెయిన్‌టెనెన్స్ వస్తుందని తెలుసుకుంది. పైగా నిష్కారణంగా బెదిరింపులకు దిగడం, భార్యతో కాపురం చేయకపోవడం, ఆలనాపాలనా చూడకపోవడం, భార్య ఉండగానే మరో స్త్రీతో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడం వంటివన్నీ కూడా శిక్షార్హమైన చర్యలని, ఈ విషయాలన్నీ భర్త కూడా తెలుసుకునేలా చేసింది. దాంతో ఆమె భర్త ప్రసాద్ దెబ్బకు దారిలోకొచ్చాడు.