కేస్ స్టడీ
వారు ఒక రకంగా శాపగ్రస్తులు. విధివంచితులు. ఎవరో చేసిన పాపాలకు బలైనవారు. వారంతా హెచ్‌ఐవీ బాధితులు. ఖరీదైన వైద్యానికి నోచుకోని పేదలు. కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ వారిచ్చే ఏఆర్‌టీ పైన ఆధారపడుతున్నవారు. తమనెవరూ గమనించకుండా ముఖాలకు స్కార్ఫ్ కట్టుకొని ఆస్పత్రికివెళ్లి నెలనెలా మందులు తెచ్చుకోవాలి. పరీక్షలు చేయించుకోవాలి. ఇక హాస్పిటల్ సిబ్బంది ఛీత్కారాలకు, వేధింపులకూ కొదవేలేదు. వారిని తాకితేనే పాపమన్నట్టుగా, గాలిసోకితేనే నష్టమన్నట్టుగా చూస్తూ వారిని ఎంతో అవమానిస్తున్నారు. మానవీయంగా ప్రవర్తించవలసిన వైద్యసిబ్బంది వారి పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. హింసిస్తున్నారు. ఒక్కొక్కసారి వారిని నెట్టివేస్తున్నారు. చులకనగా చూస్తున్నారు. హేళన చేస్తున్నారు.
ఎంత రోగగ్రస్తులైనా, వారికీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంటుంది కదా, అందుకే వారు అసలు తమకు గల హక్కులూ, రక్షణల గురించి తెలుసుకోవాలని ఒక స్వచ్ఛంద సేవాసంస్థను సంప్రదించారు. హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కోర్టుల తీర్పు ప్రకారం, అంతర్జాతీయ ఒప్పందాల్లో పేర్కొన్న ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నో హక్కులున్నాయి.
1. వివక్ష లేకుండా ఉండడం, సమానత్వపు హక్కు చట్టం ముందు అందరూ సమానమేనన్న హక్కు.
2. స్వేచ్ఛ రక్షణ ఉండే హక్కు
3. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించే హక్కు
4. ఎయిడ్స్ ఉన్న వ్యక్తులను వివాహం చేసుకునే హక్కు
5. గుప్తత హక్కు
6. అమానవీయ హింసల నుండి రక్షణ పొందే హక్కు
7. ఉద్యోగ హక్కు
8. నష్టపరిహారం పొందే హక్కు
వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకారం ప్రతి పేషెంట్‌కి నెలకు 1000/- ఆర్థిక సహాయం పొందవచ్చును. వారి హక్కులకు భంగం వాటిల్లితే హైకోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. కనుక హాస్పిటల్ వారి అమానవీయ ప్రవర్తన గురించి కోర్టును ఆశ్రయించి న్యాయం పొందాలని నిర్ణయించుకున్నారు.
ఆ రోగులకూ హక్కులు ఉన్నాయి
Published Tue, Sep 22 2015 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM
Advertisement