బ్యాడ్ టచ్‌కి శిక్ష తప్పదు! | Punished to a bad touch | Sakshi
Sakshi News home page

బ్యాడ్ టచ్‌కి శిక్ష తప్పదు!

Published Wed, Aug 19 2015 12:37 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

Punished to a bad touch

కేస్ స్టడీ
లైంగిక వేధింపులు
స్నేహ వాళ్లు కొత్తగా ఆ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చారు. ఆమె, ఆమె భర్త ఇద్దరూ ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగులు. వారికి ముద్దులు మూటగట్టే ఒక ఐదేళ్ల చిన్నారి. పేరు శ్రేయ. స్నేహ  తన పాపను స్కూల్‌లో చేర్పించాలని చుట్టు పక్కల స్కూళ్ల గురించి వాకబు చేసింది. వారుండేది ఊరి శివార్లలోని కాలనీలో కావడం వల్ల స్కూళ్లన్నీ దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అదే అపార్ట్‌మెంట్‌లో రమ్య కుటుంబం స్నేహకు పరిచయమైంది. వారి పాప శ్వేతది కూడా శ్రేయ వయస్సే. వాళ్లు కూడా మంచి స్కూల్‌కోసం వెతుకుతున్నారు. ఇక ఇద్దరూ కలిసి వెతకగా 20 కి.మీ. దూరంలో ఉండే ఒక మంచి ‘కార్పొరేట్’ స్కూల్ గురించి తెలిసింది. పెద్ద బిల్డింగ్, మంచి టీచర్స్, బస్ సౌకర్యం కూడా ఉండడంతో అందులో చిన్నారులనిద్దరినీ చేర్పించారు
 
పిల్లలనిద్దరినీ స్కూల్‌లో చేర్పించి వారమైంది. స్నేహ, రమ్యలిద్దరూ మంచి స్కూల్ దొరికినందుకు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నెల రోజులైనా కాకముందే పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్లమని మొరాయించారు. ఇంటికి వచ్చేటప్పుడు భయంభయంగా వచ్చేవారు. స్కూల్‌కు అయిష్టంగా వెళ్లేవారు. రానురాను పిల్లల మానసిక స్థితిలో మార్పు వచ్చింది. ఎంతో చలాకీగా ఆరోగ్యంగా ఉండే పిల్లలు రోజురోజుకూ డీలా పడిపోతున్నారు. చూపుల్లో బేలతనం, దైన్యం కనిపించసాగాయి. నిద్రలో కూడా ఏవేవో కలవరిస్తున్నారు.
 
ఇక లాభం లేదనుకొని స్నేహ, రమ్యలిద్దరూ స్కూల్‌లో ఆరా తీశారు. అక్కడ అంతా బాగానే ఉంది. పిల్లలు మధ్యాహ్నం భోంచేస్తున్నారు. క్లాస్‌లో పాఠాలు వింటున్నారు. టీచర్స్ నుండి ఏ కంప్లైట్స్ లేవు. మరెందుకు పిల్లలిలా డల్‌గా, భయం భయంగా ఉన్నారా అని స్నేహ, రమ్య బుర్ర బద్దలు కొట్టుకున్నారు. ఒక రోజు పిల్లలను తీసుకుని పార్క్‌కి వెళ్లారు. ఎన్నో రకాలుగా బుజ్జగించి, లాలించగా గుండెలు బద్దలయ్యే విషయం ఆ చిన్నారుల నుండి బయటపడింది. స్కూల్ బస్ ఇంటిముందుకే వచ్చేది. మరలా ఇంటి ముందే దిగేది. మొదట ఎక్కే పిల్లలూ, ఆఖరిలో దిగే పిల్లలు శ్రేయ, శ్వేతలే. ఇటీవల పిల్లలు నవ్వుతూ ఎందుకు ‘బై’ చెప్పడం లేదో ఆ తల్లులకు అర్థమైంది.
 
తమది ఆఖరు స్టాప్ కాపడం వల్ల బస్‌లో కేవలం శ్రేయ, శ్వేతలే ఉండేవారు. డ్రైవర్ బస్ నడుపుతుంటే, హెల్పర్ (పిల్లలను కూర్చోబెట్టి, దింపే వ్యక్తి) పిల్లల పక్కన చేరి వారిని తాకరాని చోట్లల్లో తాకుతూ, వికృతమైన చేష్టలు చేయడం ప్రారంభించాడు. ‘అంకుల్’ అని ప్రేమగా, అమాయకంగా పిలిచే ఆ చిన్నారుల పట్ల ఆ నీచుడు గత కొన్ని రోజులుగా అమానుషంగా ప్రవర్తించసాగాడు. అందుకే పిల్లలు స్కూల్ అంటే హడలిపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లులు ఆగ్రహంతో రగిలిపోయారు. స్కూల్‌కి వెళ్లి యాజమాన్యానికి కంప్లైట్ ఇచ్చి, ఆ నీచుడిని పట్టుకొని చితగ్గొట్టి పోలీసులను ఆశ్రయించారు.
 
పోలీసులు ‘లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం 2012’ను అనుసరించి కేస్ బుక్ చేసి వాడిని జైలుకు పంపారు. ఈ చట్ట ప్రకారం నిందితులకు ఏడేళ్ల నుండి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. అంటే వేధింపుల తీవ్రతను అనుసరించి శిక్షలు పెరుగుతుంటాయి. పై చిన్నారుల విషయంలో ‘లైంగిక దాడి’ జరిగింది కాబట్టి దానికి మూడేళ్లకు తగ్గకుండా ఐదేళ్ల వరకు పొడిగించగల శిక్ష పడుతుంది.
 చిన్నారుల వాంగ్మూలం వారి ఇంటికి వెళ్లి తీసుకోవాలని, కేసును ఇన్‌కెమెరాగా విచారించాలని, పిల్లలను ఏ రకంగా ఇబ్బంది పెట్టకూడదని, చట్టం ప్రకారం ప్రచార మాధ్యమాలు కూడా బిడ్డ పేరును, గుర్తింపును, కుటుంబ వివరాలు, బిడ్డను గుర్తించేందుకు దారి తీసే విషయాలు బయట పెట్టకూడదని చట్టం నిర్దేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement