ఆ కేసు అత్తమామలపై కూడా వేయచ్చు!
గృహహింస :: కేస్ స్టడీ
శ్రీలత వివాహమై నాలుగేళ్లయింది. భర్త ఐటీ ఉద్యోగి. రెండేళ్ల బాబు. దురదృష్టవశాత్తూ అనారోగ్యంతో భర్త మరణించాడు. అప్పటిదాకా భర్త, అత్తమామలతో కలిసి ఉన్న శ్రీలత పుట్టింటికి చేరింది. పుట్టెడు దుఃఖంతో ఉండి ఏ వ్యవహారాలూ పట్టించుకోలేదు. అత్తగారింట్లో దాదాపు యాభై తులాల బంగారం ఉండిపోయింది. బీరువాలో ఉంచి అత్తగారే తాళం వేశారు. భర్తచనిపోయిన నెలవరకూ అత్తింటివాళ్లు సానుభూతి చూపారు.
ఏమైందో ఏమో హఠాత్తుగా వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. శ్రీలత వల్లే తమ కుమారునికి ఆరోగ్యం దెబ్బతిందనీ, ఆమె కారణంగానే అతను మరణించాడనీ, ఆమె జాతకం బాగోలేదనీ నిందించసాగారు. లేనిపోని అభాండాలు వేస్తూ, కొడుకే తమకు కాకుండా పోయాక కోడలితో తమకిక ఏ సంబంధమూ లేదని తెగేసి చెప్పారు.
శ్రీలత వారి కడుపుకోతని అర్థం చేసుకుని మిన్నకుండింది. అత్తగారింటినుండి ఏ సహాయమూ ఆశించలేదు, అందలేదు. కానీ బీరువాలో ఉన్న నగలు ఆమె పుట్టింటివారు పెట్టినవి.
అవి ఆమె స్త్రీ ధనం. వాటికోసం అత్తగారిని అడిగితే ఆమె ససేమిరా అన్నారు. తమకేం తెలీదని, శ్రీలతే వాటిని తీసుకొని వెళ్లిందని గొడవ పెట్టుకున్నారు. అత్తగారు ఆ నగలను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి శ్రీలత విస్తుపోయింది. తెలిసినవారు గృహహింస కేసు వేయమన్నారు. సాధారణంగా ఆ కేసులు భర్తలపై వేస్తారు కదా! మరి అత్తగారిపై వేయవచ్చా అనే సందేహంతో న్యాయవాదిని ఆశ్రయించింది.
అత్తమామలపై ఖచ్చితంగా కే సు వేయవచ్చునని, శ్రీలతకు వారు వివాహం ద్వారా బంధువులవుతారని, అందువల్ల గృహహింస చట్టం ప్రకారం వారిపై కేసు వేయవచ్చునని న్యాయవాది తెలిపారు. నగలకు సంబంధించిన బిల్లులు, బీరువాలో అత్తగారు భద్రపరిచిన విషయం తెలిసిన సాక్షులు, కట్టుబట్టలతో పుట్టింటికి వెళ్లిన వైనం తెలిసిన శ్రేయోభిలాషులు ఉండడంతో ఊపిరి పీల్చుకొని కే సు వేసి, తన స్త్రీధనం దక్కించుకోవాలని నిర్ణయించుకుంది శ్రీలత.