కట్నం కోసం వ్యభిచారం చేయమంటున్నారు...
హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన నవవధువు
అఫ్జల్‌గంజ్: వ్యభిచారం చేసి అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్త, అత్తమామల నుంచి రక్షణ కల్పించాలని ఓ నవవధువు హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి 2015 జనవరి 28 లోగా నివేదిక అందించాలని మల్కాజిగిరి ఏసీపీకి హెచ్‌ఆర్‌సీ సభ్యులు మిర్యాల రామారావు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం బాధితురాలు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఫీర్జాదిగూడకు చెందిన యువతి (27), అవినాష్‌సింగ్‌లకు ఈ ఏడాది మే 24న పెళ్లైంది. రూ.4 లక్షల నగదు, 11 తులాల బంగారు నగలు, కిలో వెండి, బైక్ కానుకలుగా ఇచ్చారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే అవినాష్‌సింగ్‌తో పాటు అతని తల్లిదండ్రులు రూపాఠాకూర్,అమృత్‌సింగ్ అదనపు కట్నంగా రూ.10 లక్షలు తేవాలని బాధితురాలిని వేధించడం మొదలుపెట్టారు.
పెళ్లైనప్పటి నుంచీ ఒక్క రోజు కూడా భర్త తనను భార్యగా చూడలేదని, సంసారం కూడా చేయలేదని ఆమె వాపోయింది. మీ తల్లిదండ్రులు అదనపు కట్నం ఇవ్వకపోతే.. వ్యభిచారం చేసైనా నువ్వు డబ్బు తీసుకురావాలని వేధించారని, నాకు మద్దతుగా మాట్లాడిన వారితో వివాహేతర సంబంధం అంటగట్టడంతో పాటు తనకు బలవంతంగా కన్యత్వ పరీక్ష చేయించారని ఆమె వాపోయింది.
పగటిపూట తన తండ్రి వద్ద, రాత్రి తన వద్ద పడుకోవాలని భర్త కొద్ది రోజులుగా బలవంతం చేస్తున్నాడని బాధితురాలు కన్నీరుపెట్టుకుంది. వారి వేధింపులు తాళలేక నవంబర్ 3న మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఇప్పుడు హెచ్‌ఆర్సీని ఆశ్రయించానని బాధితురాలు తెలిపింది.