కేస్ స్టడీ
జానకి ఒక పెద్ద ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి. భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫీస్‌లో నిజాయితీ గల అధికారిగా, హుందాగా ఉండే మహిళగా జానకికి మంచి పేరుంది. ఆఫీస్ వ్యవహారాలలో ఎంత నిక్కచ్చిగా ఉంటుందో, తోటి ఉద్యోగులకు సాయం చేయడంలో అంత ఉదారంగా వ్యవహరిస్తుంది. ఎవరికి ఏ కష్టమొచ్చినా, వెంటనే స్పందించే ఏకైక వ్యక్తిగా మంచి పేరుంది. మహిళా ఉద్యోగులూ, పురుష ఉద్యోగులూ అందరూ గౌరవించే, అభిమానించే ఆఫీసర్ జానకి. సబార్డినేట్స్‌తో కలుపుగోలుగా ఉంటూ, ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్న సమయంలో, కొత్తగా వచ్చిన తన పై ఆఫీసర్‌తో సమస్య మొదలైంది జానకికి.
ఛార్జ్ తీసుకున్న రోజు నుంచే అతనికి జానకికై కన్ను పడింది. అందంగా, హుందాగా ఉండే జానకిని ఎలాగైనా గదీసుకోవాలనుకున్నాడు. ఆయన వయసు రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉంది. అయినా చెడుబుద్ధి మాత్రం ఇంకా పోలేదు. మహిళా ఉద్యోగులంటే చులకన భావం. వారంతా సులువుగా లొంగిపోతారన్న దురభిప్రాయం. దాంతో అవసరం ఉన్నా, లేకున్నా జానకిని తన ఛాంబర్‌కి పిలిపించుకుని ఆమె చీరల సెలక్షన్ బాగుంటుందని ఒకసారి, ‘మీ భర్త విదేశాల్లో ఉన్నారుగా, మీకు కంపెనీ ఎలా?’ అంటూ ద్వంద్వార్థ సంభాషణలు చేయడం మొదలు పెట్టాడు. అతని వ్యవహారం పసిగట్టిన జానకి అంటీముట్టనట్టుగా వ్యవహరించసాగింది.
ఎంతో అవసరం ఉంటే తప్ప అతని ఛాంబర్‌కు వెళ్లడం లేదు. ఫైళ్లన్నీ అటెండర్‌తో పంపసాగింది. దాంతో అతనికి పంతం పెరిగింది. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అదనపు పని అప్పగించి, ఆఫీస్ టైమ్ దాటాక కూడా ఆఫీస్ పని చేసేలా వేధించసాగాడు. ఇవన్నీ జానకిని ఎంతో కృంగదీశాయి. అయినా ఎవరికీ చెప్పుకోలేదు. భర్త విదేశాలలో ఉన్నారు. తోటి ఉద్యోగులకు చెప్పాలంటే అతని వయసు దృష్ట్యా నమ్మరేమో అని! అతని వెకిలి ప్రవర్తన, తనను తాకాలని చేసే ప్రయత్నాలు, ద్వంద్వార్థాల డైలాగులు, అనవసరపు పొగడ్తలు భరించలేకపోయింది. తమ కార్యాలయంలో ‘పని చేసే చోట లైంగిక వేధింపుల చట్టం’ గురించి తన ఆధ్వర్యంలోనే రెండుమూడు అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసింది. ఆ చట్టం ప్రకారం ‘ఫిర్యాదుల కమిటీ’ కూడా ఏర్పడేలాగా కృషి చేసింది. ఈ కొత్త మేనేజర్‌కి చట్టం గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఇంత బరితెగించి ప్రవర్తిస్తున్నాడని తీవ్రమైన మనోవ్యధకు గురైంది.
తోటి మహిళా ఉద్యోగులు ఇది గమనించి, జానకిపై ఎంతో ఒత్తిడి తెస్తే అసలు విషయం తెలిపింది. వారు అవాక్కయ్యారు. వారిలో ఇంకొకరి పరిస్థితి కూడా జానకిలాగే ఉంది. ఆమెను కూడా కొత్త మేనేజర్ ఇలాగే వేధిస్తున్నాడట. లొంగిపోతే ప్రమోషన్‌కు సిఫారసు చేస్తానని, లేకుంటే మారుమూల ప్రాంతానికి బదిలీ ఉత్వర్వులు ఇప్పిస్తాననీ బెదిరింపులకూ దిగాడట. ఇక లాభం లేదనుకుని జానకి, ఆమె కలిసి ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారు దానిని ‘ఫిర్యాదుల కమిటీ’ కి పంపించారు. వారు దీనిని క్షుణ్ణంగా విచారించి, తోటి ఉద్యోగుల అభిప్రాయాలను కూడా అడిగి, వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ‘లైంగిక వేధింపులు’ జరిగాయని నిర్థారణకు వచ్చారు. వారిని వేధింపులకు గురి చేసిన ఉన్నతాధికారిని పిలిచి విచారించి, ‘ప్రవర్తన మార్చుకుంటారా లేక క్రిమినల్ కేసు పెట్టమంటారా?’ అని అడిగారు.
దెబ్బకు దిగి వచ్చిన మేనేజర్ తనకు పెళ్లి కావలసిన పిల్లలున్నారనీ, కేసు పెట్టవద్దనీ జానకి వాళ్లకి రాతపూర్వకంగా క్షమాపణ రాసి ఇచ్చి, తనే మారుమూల ప్రదేశానికి బదిలీ చేయించుకుని వెళ్లాడు.
ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్ ష్యామిలీ కౌన్సెలర్
పనిచేసేచోట వేధిస్తే పనిష్మెంటే...!
Published Tue, Jul 28 2015 11:19 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement