Section Officer
-
ఏసీబీకి చిక్కిన ఆర్థిక శాఖ సెక్షన్ అధికారి
సాక్షి, అమరావతి/నగరంపాలెం: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం లబ్దిదారు నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటూ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ(సంక్షేమ విభాగం–2) సెక్షన్ అధికారి ఒంటెద్దు నాగభూషణ్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళితే...గుంటూరు నగరం కొరిటెపాడులోని గౌతమినగర్ 4వ వీధికి చెందిన ఒంటెద్దు నాగభూషణరెడ్డి వెలగపూడి ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖ భవనం–2 (సంక్షేమం–2)లో సెక్షన్ అధికారిగా ఉన్నారు. మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా దీవెన పథకానికి కర్నూలులోని బాలాజీనగర్‌కు చెందిన మహమ్మద్ నదీమ్ హుస్సేన్ తన కుమారుడు అజంతుల్లా షరీఫ్ కోసం దరఖాస్తు చేశారు. దీంతో అజంతుల్లా షరీఫ్‌కు సుమారు రూ.15 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన ఉపకార వేతనం విడుదల చేసేందుకు సెక్షన్ అధికారి నాగభూషణరెడ్డి దరఖాస్తుదారు మహమ్మద్ నదీమ్ హుస్సేన్‌ను రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు కర్నూలు జిల్లాలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. వారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదును బదలాయించారు. ఈ క్రమంలో మహమ్మద్ నదీమ్ హుస్సేన్ శుక్రవారం ఉదయం 10.10 గంటలకు నాగభూషణరెడ్డికి సచివాలయ ఆవరణలోని పార్కింగ్ ప్రదేశంలో రూ.40 వేలు లంచం ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్యాంట్ జేబులోని డబ్బులను స్వా«దీనం చేసుకున్నారు. నాగభూషణ్ రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు తొలుత రూ.10 వేలు ఫోన్ పే చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అదనపు ఎస్పీ మహేంద్ర మత్తే, అధికారులు పాల్గొన్నారు. -
ఎక్కువ చేస్తున్నావ్..
సాక్షి, హైదరాబాద్ : అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న కాచిగూడ మహిళా సెక్షన్ అధికారిపై ఓ కార్పొరేటర్ భర్త దౌర్జన్యానికి దిగాడు. ప్రభుత్వ మహిళా ఉద్యోగిని దుర్భాషలాడడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఇతని దౌర్జాన్యాన్ని సెల్ఫోన్లో చిత్రిస్తున్న ఆమె చేతిలో నుంచి ఫోన్‌ను లాక్కున్నాడు. అంతేకాదు.. వార్నింగ్ ఇచ్చి సంఘటన స్థలం నుంచి ఆమెను తరిమేశాడు. దీంతో ఆ మహిళా ఉద్యోగిని విలపిస్తూ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన బుధవారం కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, బాధితురాలి కథనం ప్రకారం.. జీహెచ్ఎంసీ సర్కిల్–16లో జి.వాణి టౌన్‌ప్లానింగ్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్. కాచిగూడ డివిజన్ చెప్పల్‌బజార్‌లోని 3–2–505 డోర్ నంబర్లోని 50 గజాల స్థలంలో సురేష్ అనే వ్యక్తి జి+3 ఇంటి నిర్మాణం చేపట్టాడు. విషయం తెలిసిన వాణి బుధవారం అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని నిర్మాణంపై ప్రశ్నించారు. అనుమతి లేకుంటే నిలిపివేయండని చెప్పారు. దీంతో సురేష్ విషయాన్ని కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య భర్త ఎక్కాల కన్నకు సమాచారం అందించాడు. ఆయన భార్య కార్పొరేటర్‌ను తీసుకొని ఆఘమేఘాలపై అక్కడకు చేరుకున్నాడు. వస్తూ వస్తూనే.. ‘నువ్వు కాచిగూడకు సెక్షన్ ఆఫీసర్‌గా వచ్చి నెలరోజులు కాలేదు. ఎక్కువ చేస్తున్నావ్.. ఏంది సంగతి? ఇక్కడి అక్రమ నిర్మాణంపై ఎవరు ఫిర్యాదు చేశారు? అంటూ ఎక్కాల కన్నా సెక్షన్ ఆఫీసర్‌ను నిలదీశాడు. ఫిర్యాదు కాఫీ చూపించాలంటూ చిందులు తొక్కాడు. అక్రమ నిర్మాణం జరుగుతున్నట్టు తమ దృష్టికి వస్తే ఖచ్చితంగా తాము చర్యలు తీసుకుంటామని ఆమె సమాధామిచ్చారు. దీంతో రెచ్చిపోయిన కార్పొరేటర్ భర్త ఆమెను దుర్భాషలాడాడు. అతని దౌర్జన్యాన్ని అధికారి వాణి తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా ఎందుకు వీడియో తీస్తున్నావంటూ ఆమె చేతిలోని ఫోన్‌ను బలవంతంగా లాక్కొన్నాడు. దీంతో భయపడిన ఆమె ఏడుస్తూ అక్కడి నుంచి బయటపడ్డారు. సర్కిల్ డీఎంసీ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారించి కేసు నమోదు.. సెక్షన్ అధికారిణి జి.వాణి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆమెను సంఘటన స్థలానికి తీసుకువెళ్లి ఏం జరిగిందనే దానిపై విచారించారు. అంతేగాక వారు తీసిన వీడియోను పరిశీలించారు. సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఎక్కాల కన్నాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాణికి పలువురు అధికారుల మద్దతు కాచిగూడ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ జి.వాణిపై కార్పొరేటర్ భర్త దౌర్జన్యం చేసినట్లు తెలుసుకున్న వివిధ సర్కిళ్లల్లో పనిచేస్తున్న సెక్షన్ ఆపీసర్లు ఆమెకు బాసటగా నిలిచారు. పెద్దసంఖ్యలో కాచిగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వాణికి ఓదార్చి ధైర్యం చెప్పారు. న్యాయం జరిగేవరకు తామంతా వెంట ఉంటామని భరోసానిచ్చారు. -
సచివాలయంలో మరో ఉద్యోగిపై వేటు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరో ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. జలవనరుల శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డిపై బుధవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఉద్యోగుల వయోపరిమితి కుదింపు డ్రాఫ్ట్ కాపీ లీకేజీతో సంబంధం ఉందంటూ వెంకట్రామిరెడ్డిపై ఈ చర్యలు తీసుకున్నారు. కాగా ఇదే వ్యవహారంలో న్యాయశాఖ సెక్షన్ ఆఫీసర్ తిమ్మప్పను సస్పెండ్ చేసిన అధికారులు తాజాగా వెంకట్రామిరెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు వేయడంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపే ప్రతిపాదన లేదని గతంలో సీఎం చంద్రబాబు, మంత్రులు బుకాయించిన విషయం తెలిసిందే. అయితే జీఎం కాపీలను లీక్ చేశారంటూ చర్యలు తీసుకోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే చర్యలు తీసుకున్నారని వారు తెలిపారు. ఇటీవల జరిగిన సచివాలయ ఉద్యోగుల ఎన్నికల్లో వెంకట్రామి రెడ్డి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆ విషయంలో పోటీ నుంచి తప్పుకోవాలని వెంకట్రామిరెడ్డిని ఇంటికి పిలిచి సీఎం వార్నింగ్ ఇచ్చారని ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వెనుక.. ఆ ఎన్నికల వివాదమే కారణమని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ- ఆఫీసు విధానంలోనూ కాపీల లీక్ ఎలా సాధ్యమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. -
పనిచేసేచోట వేధిస్తే పనిష్మెంటే...!
కేస్ స్టడీ జానకి ఒక పెద్ద ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి. భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫీస్‌లో నిజాయితీ గల అధికారిగా, హుందాగా ఉండే మహిళగా జానకికి మంచి పేరుంది. ఆఫీస్ వ్యవహారాలలో ఎంత నిక్కచ్చిగా ఉంటుందో, తోటి ఉద్యోగులకు సాయం చేయడంలో అంత ఉదారంగా వ్యవహరిస్తుంది. ఎవరికి ఏ కష్టమొచ్చినా, వెంటనే స్పందించే ఏకైక వ్యక్తిగా మంచి పేరుంది. మహిళా ఉద్యోగులూ, పురుష ఉద్యోగులూ అందరూ గౌరవించే, అభిమానించే ఆఫీసర్ జానకి. సబార్డినేట్స్‌తో కలుపుగోలుగా ఉంటూ, ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్న సమయంలో, కొత్తగా వచ్చిన తన పై ఆఫీసర్‌తో సమస్య మొదలైంది జానకికి. ఛార్జ్ తీసుకున్న రోజు నుంచే అతనికి జానకికై కన్ను పడింది. అందంగా, హుందాగా ఉండే జానకిని ఎలాగైనా గదీసుకోవాలనుకున్నాడు. ఆయన వయసు రిటైర్మెంట్కు దగ్గరగా ఉంది. అయినా చెడుబుద్ధి మాత్రం ఇంకా పోలేదు. మహిళా ఉద్యోగులంటే చులకన భావం. వారంతా సులువుగా లొంగిపోతారన్న దురభిప్రాయం. దాంతో అవసరం ఉన్నా, లేకున్నా జానకిని తన ఛాంబర్‌కి పిలిపించుకుని ఆమె చీరల సెలక్షన్ బాగుంటుందని ఒకసారి, ‘మీ భర్త విదేశాల్లో ఉన్నారుగా, మీకు కంపెనీ ఎలా?’ అంటూ ద్వంద్వార్థ సంభాషణలు చేయడం మొదలు పెట్టాడు. అతని వ్యవహారం పసిగట్టిన జానకి అంటీముట్టనట్టుగా వ్యవహరించసాగింది. ఎంతో అవసరం ఉంటే తప్ప అతని ఛాంబర్‌కు వెళ్లడం లేదు. ఫైళ్లన్నీ అటెండర్‌తో పంపసాగింది. దాంతో అతనికి పంతం పెరిగింది. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అదనపు పని అప్పగించి, ఆఫీస్ టైమ్ దాటాక కూడా ఆఫీస్ పని చేసేలా వేధించసాగాడు. ఇవన్నీ జానకిని ఎంతో కృంగదీశాయి. అయినా ఎవరికీ చెప్పుకోలేదు. భర్త విదేశాలలో ఉన్నారు. తోటి ఉద్యోగులకు చెప్పాలంటే అతని వయసు దృష్ట్యా నమ్మరేమో అని! అతని వెకిలి ప్రవర్తన, తనను తాకాలని చేసే ప్రయత్నాలు, ద్వంద్వార్థాల డైలాగులు, అనవసరపు పొగడ్తలు భరించలేకపోయింది. తమ కార్యాలయంలో ‘పని చేసే చోట లైంగిక వేధింపుల చట్టం’ గురించి తన ఆధ్వర్యంలోనే రెండుమూడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసింది. ఆ చట్టం ప్రకారం ‘ఫిర్యాదుల కమిటీ’ కూడా ఏర్పడేలాగా కృషి చేసింది. ఈ కొత్త మేనేజర్‌కి చట్టం గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఇంత బరితెగించి ప్రవర్తిస్తున్నాడని తీవ్రమైన మనోవ్యధకు గురైంది. తోటి మహిళా ఉద్యోగులు ఇది గమనించి, జానకిపై ఎంతో ఒత్తిడి తెస్తే అసలు విషయం తెలిపింది. వారు అవాక్కయ్యారు. వారిలో ఇంకొకరి పరిస్థితి కూడా జానకిలాగే ఉంది. ఆమెను కూడా కొత్త మేనేజర్ ఇలాగే వేధిస్తున్నాడట. లొంగిపోతే ప్రమోషన్‌కు సిఫారసు చేస్తానని, లేకుంటే మారుమూల ప్రాంతానికి బదిలీ ఉత్వర్వులు ఇప్పిస్తాననీ బెదిరింపులకూ దిగాడట. ఇక లాభం లేదనుకుని జానకి, ఆమె కలిసి ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారు దానిని ‘ఫిర్యాదుల కమిటీ’ కి పంపించారు. వారు దీనిని క్షుణ్ణంగా విచారించి, తోటి ఉద్యోగుల అభిప్రాయాలను కూడా అడిగి, వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ‘లైంగిక వేధింపులు’ జరిగాయని నిర్థారణకు వచ్చారు. వారిని వేధింపులకు గురి చేసిన ఉన్నతాధికారిని పిలిచి విచారించి, ‘ప్రవర్తన మార్చుకుంటారా లేక క్రిమినల్ కేసు పెట్టమంటారా?’ అని అడిగారు. దెబ్బకు దిగి వచ్చిన మేనేజర్ తనకు పెళ్లి కావలసిన పిల్లలున్నారనీ, కేసు పెట్టవద్దనీ జానకి వాళ్లకి రాతపూర్వకంగా క్షమాపణ రాసి ఇచ్చి, తనే మారుమూల ప్రదేశానికి బదిలీ చేయించుకుని వెళ్లాడు. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ష్యామిలీ కౌన్సెలర్ -
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ తిమింగలం
-
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ తిమింగలం
హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్ ఇమ్మానియేల్ నివాసంపై ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గతంలో ఇమ్మానియేల్ మీద ఆరోపణలు రావటంతో ఈ సోదాలు చేపట్టారు. దాదాపు అయిదు కోట్ల వరకూ అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌తోని రెండు ప్రాంతాలతో పాటు వరంగల్లోనూ ఏకకాలంలో దాడులు చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అటవీశాఖలో పోస్టుల భర్తీకి...
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: అటవీశాఖ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు ఆదివారం నుంచి జరగనున్నాయి. జిల్లా అటవీశాఖలో రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న మొత్తం 254 పోస్టుల (బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బంగ్లా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్) భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖమ్మం కేంద్రంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. 141 అసిస్టెంట్ బీటాఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం ఖమ్మంలోని 17 కేంద్రాల్లో రాత పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 13,261 మంది అభ్యర్దులు హాజరుకానున్నారు. ఈ పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జన రల్ నాలెడ్జ్ పేపర్; 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమెటిక్స్ పేపర్; మధ్యాహ్నం 1:00 నుంచి 2:30 గంటల వరకు జనరల్ ఎస్సే పరీక్ష ఉంటాయి. ఈ నెల 18న 17 సెంటర్లలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(మొత్తం ఖాళీలు 92) పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 9,146 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జనరల్ నాలెడ్జ్ పేపర్, 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమేటిక్స్ పేపర్; మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:30 గంటల వరకు పార్ట్-1 జనరల్ ఎస్సే పరీక్ష ఉంటుంది. ఈ నెల 25న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (మొత్తం ఖాళీలు 16) పరీక్ష నాలుగు కేంద్రాలలో జరుగుతుంది. మొత్తం 1733 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జనరల్ నాలెడ్జ్ పేపర్; 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమేటిక్స్; మధ్యాహ్నం ఒంటి గంటనుంచి 2:00 గంటల వరకు పార్ట్-1 జనరల్ ఎస్సే పేపర్ పరీక్ష ఉంటుంది. తానేధార్, బంగ్లా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్ (డీఎం గ్రేడ్-3) పోస్టులకు వరంగల్‌లో పరీక్ష ఉంటుంది.