పెళ్లప్పటి నుండి ఆయన ప్రవర్తన.... | Legal counseling | Sakshi
Sakshi News home page

పెళ్లప్పటి నుండి ఆయన ప్రవర్తన....

Published Sun, Apr 17 2016 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

పెళ్లప్పటి నుండి ఆయన ప్రవర్తన....

పెళ్లప్పటి నుండి ఆయన ప్రవర్తన....

 వివాహ హక్కుల పునరుద్ధరణకు కేసు వేయచ్చు..!
లీగల్ కౌన్సెలింగ్

 

మాకు వివాహమై తొమ్మిది సంవత్సరాలయింది. మేమిద్దరం ఓ ఏడాదిపాటు అన్యోన్యంగానే జీవించాము. తర్వాత మా అత్తమామలు మా కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల మా ఇద్దరికీ చీటికిమాటికీ గొడవలు అయ్యేవి. వాళ్లు నన్ను అదనపు కట్నం కోసం సూటిపోటి మాటలనేవారు. తన వాళ్లని సంతృప్తి పరచడం కోసం మొదట మా వారు మాటలతో వేధించేవారు. తర్వాత్తర్వాత నాపై చేయి చేసుకోవడం, హింసించడం వరకూ వెళ్లింది. కానీ, రెండేళ్ల క్రితం ఓ రోజు నన్ను శారీరకంగా, మానసికంగా హింసించి, నన్ను, నా ఇద్దరు పిల్లల్ని ఇంట్లోనుంచి వెళ్లగొట్టేశారు. నేను ఎంత ప్రాధేయపడినా వినలేదు. గత్యంతరం లేక నా ఇద్దరు పిల్లల్నీ తీసుకుని పుట్టింటికి చేరాను. మా తలిదండ్రులు వృద్ధులైపోయారు. నాన్న రిటైరై చాలా కాలం అయింది. పెళ్లి కావాల్సిన ఇద్దరు పిల్లల బాధ్యత ఇంకా ఆయన మీద ఉంది. దానికి తోడు నా భారం, నా పిల్లల భారం కూడా ఆయన మీద పడింది. ఇదిలా ఉండగా తనకు విడాకులు కావాలని కోరుతూ కోర్టులో కేసు వేసినట్లు సమన్లు పంపించారు. అయితే మా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా నాకు భర్త నుంచి విడిపోవడం ఇష్టం లేదు. కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఏం చేయాలి? నా  పిల్లల పోషణ ఎలా?  - పి. సుభాషిణి, హైదరాబాద్
మీ వారు విడాకులు కోరుతూ కోర్టులో కేసు వేశారంటున్నారు. పైగా అది మీకిష్టం లేదంటున్నారు. సరైన సాక్ష్యాధారాలు చూపకుండా విడాకులు మంజూరు కావు. కాబట్టి మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ (వివాహ హక్కుల పునరుద్ధరణ కోసం) కేసు వేయండి. అప్పుడు కోర్టు వారు మీ భర్త వేసిన విడాకుల కేసు, మీరు వేసిన రెస్టిట్యూషన్ కేసు రెండూ కలిపి విచారిస్తారు. మీ పిల్లల పోషణ, మీ పోషణ కోసం మీరు కోర్టులో 125 సిఆర్‌పిసి కింద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయండి. మీ వారు ప్రభుత్వోద్యోగి అంటున్నారు కాబట్టి ఆయన ఆర్జన శ క్తిని బట్టి మీకు, మీ పిల్లలకు మెయింటెనెన్స్ మంజూరు అవుతుంది. దిగులు పడకండి. మీ సంసారాన్ని చక్కదిద్దడానికి మీ తలిదండ్రులు, మీ తరఫున ఇతర పెద్దమనుషులను తీసుకుని మీ వారి దగ్గరకు వెళ్లి ఒకసారి మాట్లాడి చూడమనండి. కోర్టులో భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఉంటుంది కాబట్టి మీ వారు మనసు మార్చుకుని మీతో కాపురం చేయవచ్చునేమో ప్రయత్నించి చూడండి.

 
ఒకవేళ హెరాస్‌మెంట్ తట్టుకోలేన నుకుంటే 498 ఎ కింద కేసు ఫైల్ చేయవచ్చు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు డిగ్రీ చదివానంటున్నారు కాబట్టి, ఇంట్లో ఖాళీగా ఉండకుండా మీకు, మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేలా మీకు చేతనైన ఏదో ఒక పని చేయడం ప్రారంభించండి. బెస్టాఫ్ లక్.

 

6 నెలల క్రితం మా వివాహం జరిగింది. పెళ్లప్పటి నుండి ఆయన ప్రవర్తన అసహజంగా ఉండేది. ఎప్పుడూ ఈ లోకంలో లేనట్లు, ఎక్కడో వేరే లోకంలో విహరిస్తున్నట్లు ఉండడం, అడిగిన దానికి సమాధానం సరిగా సమాధానం చెప్పకపోవడం, భ్రమలలో బతకడంతో సరిపోతోంది.  ఇన్నాళ్లూ ఓర్చుకున్నాను. ఇక భరించలేక పెద్దల మధ్య పెట్టాము. వారేమో సర్దుకు పోయి జీవించాలి అంటున్నారు. బంధుమిత్రులేమో సంవత్సరం లోపల విడాకులు రావు అంటున్నారు. నేను ఏమి చేయాలి?  -ఎ.నాగశిరీష, విజయవాడ
మీరు చెబుతున్న వివరాలను బట్టి మీ భర్త మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. ఆయన ప్రధానంగా స్క్రిజోఫినియాతో బాధపడుతున్నట్లున్నారు. దీనితో బాధపడేవాళ్లు తీవ్రమైన భావోద్వేగాలకు గురవుతారు. భ్రమలు, భ్రాంతులతో జీవిస్తుంటారు. నిజాలు మరచిపోవడం, విపరీత ధోరణులతో అతిగా ప్రవర్తించడం... లాంటివి చేస్తుంటారు. ఇవన్నీ విడాకులు తీసుకోవడానికి తగిన కారణాలు. ఇది విడాకులు తీసుకునేందుకు ఒక సహేతుకమైన కారణ ం అవుతుంది.

 
మీరు మొదట మీ భర్తను డాక్టర్ లేదా సైకాలజిస్ట్ దగ్గరకు పరీక్షలకు తీసుకెళ్లండి. డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని కోర్టులో డిక్లేర్ ది మ్యారేజ్ యాజ్ నల్ అండ్ వాయిడ్ అంటే మీ వివాహం చెల్లదని తీర్పివ్వవలసిందిగా కేసు ఫైల్ చేయండి. ఈ సందర్భంగా మీవారి ఆరోగ్య విషయంలో డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్‌ను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్‌గా వేయండి. మీరు కోర్టులో కేసు వేసి విడాకులు మంజూరయ్యాక మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చినట్లు తీర్చిదిద్దుకోండి. ధైర్యంగా ఉండండి.

 

 కేస్ స్టడీ
దత్తతకు అనేక నియమ నిబంధనలున్నాయి
సుజాత, రమేష్‌ల వివాహమై పదేళ్లయింది. సంతానంకోసం వారు చెయ్యని ప్రయత్నం లేదు. ‘సరోగసి’ అంటే వారికి ఇష్టం లేదు. పిల్లల కోసం వీరి ప్రయత్నాల గురించి తెలిసి, వారి దూరపు బంధువుల కుటుంబం ఒకటి వాళ్ల పాపను దత్తత ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే దత్తత ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా చాలా సులభమే అనుకుంటున్న ఆ రెండు జంటలు అందుకు అనేక నియమ నిబంధనలు ఉంటాయని తెలిసి ఆశ్చర్యపోయారు. దత్తత స్వీకారం గురించి దానికి సంబంధించిన షరతులు, అర్హతల గురించి హిందూ అడాప్షన్ అండ్ మెయిన్‌టెనెన్స్ యాక్ట్ 1956 ఇలా చెబుతోంది.

 
దత్తత తీసుకునే విషయంలో ఎటువంటి ఆంక్షలూ లేవు. స్త్రీ అయినా, పురుషుడైనా, వివాహితులైనా, కాకపోయినా, వితంతువులయినా, విడాకులు పొందిన వారైనా దత్తత తీసుకోవచ్చు. అయితే వారు మేజర్ అయి ఉండాలి. మానసిక స్వస్థత కలిగి ఉండాలి. అబ్బాయిని దత్తత చేసుకోవాలంటే వారికి అంతకుముందే అబ్బాయి జన్మించి ఉండకూడదు అమ్మాయిని దత్తత చేసుకోవాలంటే వారికి అంతకు ముందు అమ్మాయి జన్మించి ఉండకూడదు. అదేవిధంగా ఎవరైతే వారి పిల్లలను ఇతరులకు దత్తత ఇవ్వబోతున్నారో వారికి కొన్ని షరతులు ఉన్నాయి. భార్యాభర్తలిద్దరి పరస్పర అంగీకారంతోనే దత్తత ఇవ్వాలి. ఒకవేళ భర్త చనిపోయినా, హిందూ మతాన్ని వదలివేసినా తల్లి దత్తత ఇవ్వవచ్చును.

 

దత్తత చేసుకోబోయే బాలుడు/బాలిక 15 సం॥లోపు వయస్సు కలిగిన హిందువు అయి ఉండాలి. అవివాహితులై ఉండాలి. ఏవైనా కులాచారాలు, సంప్రదాయాలు అనుమతించితే 15 సం॥లు వయస్సు దాటిన వారిని, వివాహితులను కూడా దత్తత చేసుకోవచ్చును. అలాగే ‘దత్తత స్వీకార పత్రం’ రాయించుకొని రిజిస్టర్ చేయించుకుంటే మంచిది. ముందు జాగ్రత్త చర్యగా ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయం... అమ్మాయిని దత్తత చేసుకుంటే దత్తత తీసుకునే తండ్రి ఆమె కంటే 21 సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి. అబ్బాయిని దత్తత చేసుకుంటే దత్తత తీసుకునే తల్లి అతనికంటే 21 సంవత్సరాలు పెద్దదై ఉండాలి.



హిందూ అడాప్షన్ అండ్ మెయిన్‌టెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం...
దత్తత చేసుకోబోయే బాలుడు/బాలిక

15 సం॥లోపు వయస్సు కలిగిన హిందువు అయి ఉండాలి. అవివాహితులై ఉండాలి. ఇక ముఖ్యమైన విషయం... అమ్మాయిని దత్తత చేసుకుంటే దత్తత తీసుకునే తండ్రి ఆమె కంటే 21 సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి. అబ్బాయిని దత్తత చేసుకుంటే దత్తత తీసుకునే తల్లి అతనికంటే 21 సంవత్సరాలు పెద్దదై ఉండాలి.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement