స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ తాజా సంచికలో ప్రచురణ
ఇది అరుదైన గౌరవం: ఇండియన్ బిజినెస్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రాజె క్టుపై ప్రతిష్టాత్మక స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ప్రశంసలు కురిపించింది. విశ్వవిద్యా లయానికి చెందిన మేనేజ్ మెంట్ విద్యార్థులకు, ప్రాక్టీ షనర్లకు మెట్రో ప్రాజెక్టు విజయగాథ ఒక కేస్ స్టడీగా ఆ సంస్థ ప్రచురించే స్టాన్‌ఫోర్డ్ సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ (ఎస్‌ఎస్‌ఐఆర్) తాజా సంచికలో (స్ప్రింగ్–2024) ప్రచురించింది. ఇది ఒక భారతీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవం అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అభివర్ణించింది. ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే అనేక సమస్యలు, వాటిని అధిగమించడానికి కావలసిన నాయకత్వ లక్షణాలు, తదితర అంశాలపై తగిన సూచనలు, పరిష్కార మార్గాలను ఈ త్రైమాసిక జర్నల్ అందజేస్తుంది.
ఈ క్రమంలో వివిధ దేశాల్లోని పలు ప్రాజెక్టులపైన విస్తృత అధ్యయనాల్లో భాగంగా ఐఎస్‌బీ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ రామ్ నిడుమోలు, ఆయన బృందం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపైన క్షుణ్ణంగా జరిపిన అధ్యయనాన్ని స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ఒక కేస్ స్టడీగా ఎంపిక చేసుకొని ప్రచురించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు సంస్థ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి బృందం అసాధారణ నాయకత్వ ప్రతిభను కనబరిచినట్లు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు.
ఒకదశలో ఈ ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ క్రమంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి దాన్ని సుసాధ్యం చేశారని జర్నల్‌లో ప్రశంసించారు. ప్రాజెక్టును విజయపథంలో నడిపించారని, ఇది ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమని ఈ కేస్ స్టడీ తెలియజేసింది. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్ విస్తృత ప్రయోజనా లను దృష్టిలో ఉంచుకొని అన్ని సమస్యల్లో సమర్ధవంతమైన నాయకత్వ ప్రతిభను ఎన్వీఎస్ కనబరిచినట్లు జర్నల్‌లో ప్రచురితమైంది.
Comments
Please login to add a commentAdd a comment