భర్తే శత్రువై బాధిస్తే..! | Marriage Counseling | Sakshi
Sakshi News home page

భర్తే శత్రువై బాధిస్తే..!

Published Tue, Aug 4 2015 10:47 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

భర్తే శత్రువై బాధిస్తే..!

భర్తే శత్రువై బాధిస్తే..!

మ్యారేజ్  కౌన్సెలింగ్
 
భార్యా రూపవతి శత్రుః అన్నారు. భార్య అందంగా ఉన్నా, తన కన్నా మంచి ఉద్యోగంలో ఉన్నా కొంతమంది భర్తల్లో
 ఆత్మన్యూనతాభావం మొదలౌతుంది. ఆ న్యూనత లోంచి అనుమానం మొదలౌతుంది. ఆ అనుమానంతో భార్యను శత్రువుగా భావిస్తారు. మాటలతో హింసిస్తారు. దౌర్జన్యం చేస్తారు. చివరికి ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీయాలని చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సెషన్స్ కోర్టును ఆశ్రయించి బాధిత మహిళలు న్యాయాన్ని, రక్షణను పొందవచ్చు.

మాది ప్రేమ వివాహం. మా కులాలు వేరు కావడం వల్ల ఇంటిలోని వాళ్లు ఒప్పుకోకపోవడంతో వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్లు మా కాపురం సజావుగానే సాగింది. అయితే ఉద్యోగంలోనూ, అందంలోనూ నేను అతనికన్నా ఒక మెట్టుపైనే ఉండటం వల్ల తనలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయింది. దాంతో నాపై అసూయతో నన్ను చిత్రహింసల పాలు చేశారు. దాంతో నేను గత కొద్ది కాలంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటున్నాను. అయితే ఒక రోజు ఆయన బాగా తాగి నేను ఉంటున్న హాస్టల్‌కు వచ్చి, నన్ను నా కులం పేరుతో దూషించి, అందరి ముందు అవమానించాడు. దాంతో నా ఆత్మగౌరవం దెబ్బతింది. ఇక నేను అతనితో కాపురం చెయ్యదలచుకోలేదు. ఏం చేయాలో తగిన సలహా ఇవ్వగలరు.
 - నిర్మల, ఆదిలాబాద్

మీ బాధ అర్థమైంది. మీకు రెండు మార్గాలున్నాయి. గృహహింస నిరోధక చట్టం 18ని అనుసరించి పిటిషన్ వేసి, రక్షణ ఉత్తర్వులు పొందటం, అంటే మీ వద్దకు వచ్చి దూషించకుండా, మీ ఆఫీస్‌కు లేదా హాస్టల్‌కు రాకుండా, దారికాచి వేధించకుండా ఆర్డర్స్ పొందవచ్చు. ఇంకోమార్గం..మీరు ఎస్‌సీ అంటున్నారు కదా, షెడ్యూల్డ్ కులాలు, తెగల అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం ఎస్సీఎస్టీలకు చెందిన వారిని కులం పేరుతో దూషించినా, బహిరంగ ప్రదేశాల్లో అవమానించినా, మహిళలను దూషించినా, అవమానపరచాలనే ఉద్దేశ్యంతో దౌర్జన్యం చేసినా, బలప్రయోగం చేసినా, లైంగిక దాడికి గురి చేసినా, వెట్టిచాకిరీ చేయించినా, వివస్త్రను చేసినా, సంస్కారహీనంగా ప్రవర్తించినా, అసహ్యకర ద్రవపదార్థాలు తాగించినా, తినిపించినా అవి తీవ్ర నేరాలవుతాయి. వారికి ఆర్నెల నుంచి ఐదేళ్ల వరకు శిక్ష విధించబడుతుంది. మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఈ చట్టం కింద కేసులు వేయాలంటే స్పెషల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాలి.
 
నా వయసు 75, నా భార్యకు 70 ఏళ్లు. మాకు సంతానం లేదు. కొద్దిపాటి ఆస్తి ఉంది. ఈ వయసులో మాకు సేవ చేసి, మా అవసరాలు తీర్చే వారెవరూ లేక, మాకు దూరపు బంధువైన ఒకరిని నమ్మి, మా అద్దె ఇళ్ల నుంచి వచ్చే ఆదాయంలో కొంత అతనుంచుకుని, మా ఆలనాపాలనా చూసుకోవలసిందిగా కాగితం రాసిచ్చాము. కొన్ని నెలలు మమ్ములను బాగానే చూసుకున్నాడు. తరువాత ఒకరోజు తీర్థయాత్రలకని నన్నూ, నా భార్యనూ కారులో ఎక్కించుకుని వెళ్లి, మమ్ములను ఒక ఊరి బయట దింపి, ఇప్పుడే వస్తానని చెప్పి, ఎక్కడికో వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దాంతో మేము ఎలాగో మా వూరు చేరుకున్నాము. జీవిత చరమాంకంలో ఉన్న మేము ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో సలహా ఇవ్వగలరు.
 - వి.ఆర్. నూజివీడు

మీరు ఏ కాగితం రాసుకున్నారో స్పష్టంగా లేదు. ఒకవేళ అదేమైనా అగ్రిమెంట్ అయినట్లయితే దానిని మీరు రద్దు చేసుకోవచ్చు. లేకుంటే బహుమతి రూపంలో కాని, మరే విధంగా గానీ ఆస్తి మార్పిడి చేసి ఉంటే మీరు వయోవృద్ధులు కనుక తలిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2007 ప్రకారం ఆ ఆస్తి మార్పిడి లేక బహుమతిని చెల్లనివిగా ప్రకటించవలసిందిగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చును. ఈ చట్టానికి సంబంధించిన కేసులను మాత్రమే విచారించేందుకు ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. ఈ చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం ఒక వయోవృద్ధుడు తనకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, భౌతిక అవసరాలు తీరుస్తాడనే షరతుకు లోబడి ఒక వ్యక్తికి తన ఆస్తిని/ఆదాయాన్ని బహుమతి రూపంలో గానీ, మరోవిధంగా గానీ అప్పగించినట్లయితే, ఆ ఆస్తిని లేదా ఆదాయాన్ని పొందిన వ్యక్తి వారి ఆలనాపాలన చూడడంలో విఫలమైనప్పుడు ఆస్తి మోసపూరితంగా / బలవంతంగా పొందినట్లు భావించబడి, సదరు ఆస్తిమార్పిడి చెల్లనిదిగా ప్రకటించే అధికారం ఆ ట్రిబ్యునల్‌కు ఉంది. సెక్షన్ 24 ప్రకారం వయోవృద్ధులను నిరాదరణకు గురి చేసినందుకు, వదిలి వేసినందుకు, జైలుశిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. మీరు ఆ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించండి.

ఇటీవలి కాలంలో ర్యాగింగ్ ఎక్కువై, ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువు మానేస్తున్నారు. తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవుతున్నారు. మా కాలేజీలో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా మేమొక యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌గా ఏర్పడాలని అనుకుంటున్నాము. దయచేసి ర్యాగింగ్ చట్టం గురించి కాస్త వివరించండి.
 - రాధిక, భీమవరం

ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టం 1977 ప్రకారం బుద్ధిపూర్వకంగా ఒక విద్యార్థిని అవమానించినా, ఏడిపించినా, భయభ్రాంతులకు గురి చేసినా, బెదిరించినా, గాయపరిచినా, నిర్బంధించినా, అత్యాచార యత్నం చేసినా, అసహజమైన లైంగిక చర్యలకు లోను చే సినా, ఆత్మహత్యకు ప్రేరేపించినా, అది ర్యాగింగ్ కిందకు వస్తుంది. వీటికి ర్యాగింగ్ తీవ్రతను బట్టి 6 నెలల నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. జైలుశిక్ష పడిన విద్యార్థిని కాలేజీ నుంచి తొలగించడం, మరే కాలేజీలో చేరకుండా ఉత్తర్వులివ్వడం జరుగుతుంది. యాజమాన్యం విద్యార్థుల ఫిర్యాదులను పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ర్యాగింగ్‌ను ప్రోత్సహించినందుకు చట్టప్రకారం వారు కూడా శిక్షార్హులవుతారు. దీనికి సంబంధించి రాఘవన్ కమిటీ, యు.జి.సి; సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. ఆల్ ది బెస్ట్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement