గృహహింస చట్టంపై గ్రామీణ మహిళల్లో అవగాహన
శ్రీకాకుళం అర్బన్: గృహహింస చట్టంపై గ్రామస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.అన్నపూర్ణ అన్నారు. మహిళా మార్గదర్శి సేవాసంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని వరం రెసిడెన్సీలో గురువారం గృహహింస నుంచి మహిళలకు రక్షణ చట్టం-2005పై జిల్లాస్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహహిం సను నేరంగా గుర్తించి గృహహింస నిరోధక చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఇది సివిల్ చట్టమని, నేరం చేసిన వాళ్లను దండించడం కాకుండా బాధితులకు ఉపశమనం కల్పించే దిశగా ఈ చట్టం ఏర్పాటు చేసినట్టు వివరిం చారు. తన కుటుంబానికి సంబంధించిన మగవారు జరిపే ఎటువంటి హింసనుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు గృహహింస చట్టం ఏర్పాటైందన్నారు.
బాధితులు ఈ చట్టాన్ని ఉపయోగించి సెక్షన్ 17, 18, 19, 20, 21, 22, 23 ద్వారా నివసించే హక్కు, రక్షణ ఉత్తర్వులు, నివాసపు ఉత్తర్వులు, పిల్లల సంరక్షణ ఉత్తర్వులు, నష్టపరిహారం ఉత్తర్వులు పొందవచ్చన్నారు. గృహహింస బాధితులు ఎవరైనా ఉంటే రక్షణాధికారి ద్వారా లేదా సర్వీస్ ప్రొవైడర్‌ల ద్వారా న్యాయ సహా యం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కొంతమంది దంపతులు గొడవలు పడి కోర్టుకు వెళతారే తప్ప వారి పిల్లలు గురించి ఆలోచించరన్నారు. న్యాయమూర్తి కూడా బం ధాలు, బాంధవ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని, లేదంటే వీటి ప్రభావం సమాజంపై పడుతోందన్నారు. విశ్రాంత జిల్లా జడ్జి పప్పల జగన్నాథరావు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చాయని, వాటిపై అవగాహన లేకనే ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తోందన్నారు.
న్యాయవాది సనపల పాపినాయుడు మాట్లాడుతూ గృహహింస చట్టం అమలైన నాటి నుంచి ఏడు సంవత్సరాల కాలంలో కేవలం 141 కేసులు మాత్రమే నమోదయ్యావంటే ఈ చట్టం క్షేత్రస్థాయిలోకి వెళ్లలేదని అర్ధమవుతోందన్నారు. క్షేత్రప్రచార అధికారి జి.కొండలరావు మాట్లాడుతూ అవగాహనా లోపం వల్ల గ్రామస్థాయి నుంచి ఈ చట్టం వరకూ వచ్చే కేసులు కేవలం 5.1 శాతం మాత్రమేనన్నారు. మహిళా మార్గదర్శి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏఎన్ లక్ష్మీకుమారి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో 2007లో ఈ చట్టం కింద కేసును కోర్టులో వేసి 70 రోజుల్లో న్యాయం పొందడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమానికి ముందుగా గృహహింస, స్త్రీలపై హింస జరుగుతున్న వివిధ కారణాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్‌ను అన్నపూర్ణ ప్రారంభించారు. అలాగే మహిళా మార్గదర్శి ఆధ్వర్యంలో కుటుంబంలో స్త్రీ ఏవిధంగా హింసను అనుభవిస్తుందో కళ్లకు కట్టినట్లుగా గృహహింసపై నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు పేడాడ సన్యాసప్పారావు, మహిళా మార్గదర్శి ప్రతినిధులు సీహెచ్ భారతి, మీనా, అమల, సుశీల, జనచేతన, సీఎస్‌ఎస్, బ్రెడ్స్, గ్రామీణ చైతన్య వేదిక, మహిళా సమతా సొసైటీ తదితర స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.