డీప్ వీన్ థ్రాంబోసిస్
కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద పెట్టినంత శ్రద్ధ తమ విషయానికి వచ్చేసరికి మహిళలు గాలికి వదిలేస్తారు. కుటుంబ సభ్యులు కూడా అంతగా పట్టించుకోరు. దాంతో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి, అది తీవ్రరూపం దాల్చేవరకు ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. అలాంటి సమస్యల్లో ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ ఒకటి. ఇది స్త్రీ, పురుషులిద్దరికీ వచ్చే సమస్య అయినప్పటికీ... మహిళల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ. గర్భధారణ నుంచి హార్మోన్ల సంక్లిష్టతల వరకు అనేక అంశాలు డీప్ వీన్ థ్రాంబోసిస్‌కు దారితీస్తాయి. రక్తనాళాల్లో.. ప్రధానంగా చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ (డీవీటీ)గా చెబుతారు. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.
డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాలి సిరల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇంచుమించు ప్రతి 20 మందిలో ఒకరికి... వారి జీవితకాలంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ బాధపెడుతుంది.
మహిళల్లోనే ప్రభావం చూపడానికి కారణాలు..
- ప్రెగ్నెన్సీ: స్త్రీలలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపించడానికి గల కారణాలలో గర్భధారణ ఒకటి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం తర్వాత ఆరు వారాల వరకు ఈ ముప్పు ఉంటుంది. గర్భధారణ తర్వాత రక్తనాళాల్లో రక్తప్రవాహం కాస్త నెమ్మదించడం మామూలే. దాంతో రక్తం గడ్డ కట్టే అవకాశాలు పెరగడం.
- గర్భసంచి బాగా సాగడం: దీంతో రక్తనాళాలపై ఒత్తిడి పడి రక్తం సాఫీగా ప్రవహించడానికి ఆటంకం కలుగుతుంది.
- నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు: వీటిల్లోని హార్మోన్లతో డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దాదాపు ప్రతి గర్భనిరోధక మాత్రలో ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిన్ ఉండటంతో అవి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టేలా చేసే అవకాశాలు పెరుగుతాయి. పైగా ఈస్ట్రోజెన్... కాలేయాన్ని ప్రేరేపించి... రక్తంలో ఉండే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ రక్తం గడ్డకట్టేలా చేసే ఫైబ్రినోజెన్‌ను ఎక్కువగా స్రవింపజేస్తుంది. దీనికితోడు గర్భనిరోధక మాత్రల్లో వాడే కొన్ని రకాల కాంబినేషన్స్ పిల్స్ వల్ల ఈ ముప్పు మరింత పెరుగుతుంది. అందువల్ల గర్భనిరోధక మాత్రలు వాడేవారు డాక్టర్ సలహా మేరకే వాడాలి.
- హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ: మెనో΄ాజ్ తర్వాత తీసుకునే హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీలోని మందుల్లో ఈస్ట్రోజెన్,ప్రోజెస్టిన్ కాంబినేషన్ ఉంటుంది. ఈ ఈస్ట్రోజెన్ పైన పేర్కొన్న ప్రభావాన్నే చూపడంతో డీప్ వీన్ థ్రాంబోసిస్ ముప్పు పెరుగుతుంది. అందువల్ల ఈస్ట్రోజెన్ మందుల్ని చర్మానికి అంటించే ΄్యాచ్‌ల రూపంలో ఇస్తే ఈ ముప్పు తగ్గుతుంది.
- జీవనశైలి అంశాలు: శారీరక శ్రమ లేకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని ఉండటం, స్థూలకాయం, ΄÷గతాగడం వంటివి రక్తప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. స్మోకింగ్ ద్వారా దేహంలోకి చేరే నికోటిన్ రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది.
వేర్వేరుగా లక్షణాల తీవ్రత..
డీప్ వీన్ థ్రాంబోసిస్‌లో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఆ లక్షణాలన్నీ అందరిలోనూ కనిపించక΄ోవచ్చు. దానికితోడు లక్షణాల తీవ్రతలో కూడా మార్పులుండవచ్చు. కొందరిలో రక్తపుగడ్డ చిన్నదిగా ఉంటే కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. సమస్య దానంతట అదే సమసి΄ోవచ్చు కూడా.
కొన్ని సాధారణ లక్షణాలు..
- రక్తం గడ్డ కట్టినచోట చర్మం వాపు (ముఖ్యంగా కాలు, ΄ాదం వంటివి)
- చర్మం ఎర్రబారడం, అక్కడ వేడిగా ఉన్నట్లు అనిపించడం
- ఒక్కోసారి చర్మంలోంచి రక్తనాళాలు కనిపించడం
- కాలిలో డీవీటీ ఏర్పడినప్పుడు కాలు బలహీనంగా ఉన్నట్లు అనిపించడం
- రక్తనాళాలు గట్టి పడడం
ఈ లక్షణాలు అకస్మాత్తుగా కనిపించినా లేదా కాలం గడుస్తున్న కొద్దీ తీవ్రత పెరుగుతూ పోతున్నా వెంటనే డాక్టర్‌కు చూపించాలి. కొన్నిసార్లు రక్తనాళంలో ఏర్పడ్డ ఈ గడ్డ (క్లాట్) రక్తప్రవాహంలో కొట్టుకుపోతూ, గుండె రక్తనాళల్లోకి చేరి, గుండెస్పందనలను ఆపివేసే ‘పల్మునరీ ఎంబాలిజమ్’ అనే కండిషన్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది.
చికిత్స..
- డీవీటీ వచ్చే అవకాశాలున్నవారు సపోర్ట్ స్టాకింగ్స్ / కంప్రెషన్ స్టాకింగ్స్ వాడటం.
- రక్తాన్ని పలచబార్చే మందులైన యాంటీ కోయాగ్యులెంట్స్ వాడటం..
- క్లాట్ బస్టర్స్ / థ్రాంబోలైటిక్స్ చికిత్స : చిన్న పైప్ (క్యాథెటర్) ద్వారా రక్తం గడ్డకట్టిన చోటికి థ్రాంబోలైటిక్స్ అని పిలిచే మందును పంపి, రక్తపుగడ్డను చెదరగొట్టే
- ఔషధాల్ని వాడటం.
నివారణ..
- మంచి సమతులాహారం తీసుకోవడం అంటే పొట్టు తీయని కాయధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకుంటూ బరువు పెరగకుండా చూసుకోవడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల రక్తప్రవాహం సాఫీగా మారి రక్తపు గడ్డలు ఏర్పడకుండా ఉంటుంది.
- తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం
- ఒకేచోట స్థిరంగా కూర్చుని ఉండకుండా కాసేపు నడక, స్ట్రెచ్చింగ్ వంటివి చేస్తూ ఉండటం
- దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు అదేపనిగా వాహనంలో కూర్చుని ఉండకుండా తరచూ బ్రేక్ తీసుకోవటం
- రక్తనాళాల్లో రక్తప్రవాహం సాఫీగా సాగేందుకు కంప్రెషన్ స్టాకింగ్ వంటివి వాడటం
- గర్భం దాల్చిన మహిళల కుటుంబ సభ్యుల్లో డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చిన ఆరోగ్య చరిత్ర ఉంటే ముందే డాక్టర్‌కు ఈ విషయాన్ని చెప్పడం మంచిది.
— డాక్టర్ నరేంద్రనాథ్ మేడ, కన్సల్టెంట్ వాస్క్యులార్ – ఎండో వాస్క్యులార్ సర్జన్
ఇవి చదవండి: హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..!
Comments
Please login to add a commentAdd a comment