మన దేశంలో యోగా గురువులంటే పురుషులే కనిపిస్తుంటారు. కాని హన్సా యోగేంద్ర యోగా గురువుగా చేసిన కృషి ఎవరికీ తక్కువ కానిది. ముఖ్యంగా వయోవృద్ధులలో నైరాశ్యం తొలగి జీవన ఉత్సాహం ఏర్పడాలంటే ఏం చేయాలో ఆమె వీడియో పాఠాల ద్వారా తెలియచేస్తుంది. ఆలోచన, ఆహారం, ఆరోగ్యం ఈ మూడింటికీ మార్గదర్శి హన్సా యోగేంద్ర.
ముందు మనం హన్సా యోగేంద్ర రోజువారీ జీవితం చూద్దాం. ఆమె ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తారు. కాసేపు మంచం మీదే పవన ముక్తాసన వంటి ఒకటి రెండు ఆసనాలు వేస్తారు. కొన్ని నిమిషాల ప్రాణాయామం చేస్తారు. ఓంకార ధ్వని చేస్తారు. ‘ఇది సృష్టిలోని శక్తిని మీకు అనుసంధానిస్తుంది’ అంటారు. అప్పుడు ‘మార్నింగ్ డ్రింక్’ తాగుతారు. అంటే టీ, కాఫీ కాదు. రాత్రంతా వెండిగ్లాసులో ఉంచిన నీటిని కాచి దానిలో ఉసిరి, అల్లం, మిరియాలు, పసుపు, అశ్వగంధ మిశ్రమాల ΄పొడిని కొద్దిగా కలిపి కాస్త నిమ్మకాయ పిండి ఆ కషాయాన్ని తీసుకుంటారు. ‘ఇది జఠరాగ్నికి చాలా మంచిది’ అంటారామె. ఆ తర్వాత కాసేపు మత్సా్యసనం, భుజంగాసనం, శలభాసనం వేస్తారు. సరిగ్గా 8.30 అల్పాహారం తీసుకుంటారు.
అల్పాహారం అంటే రాత్రి నానబెట్టిన డ్రైఫ్రూట్స్. చివరలో పాలు. ఆ తర్వాత ఆమె యోగా వీడియోలు రికార్డు చేస్తారు. లేదంటే తమ మానసిక శారీరక బాధలు చెప్పుకోవడానికి వచ్చే అనుయాయుల సమస్యలు విని కౌన్సెలింగ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనంలో ఒక రోటీ, పప్పు, ఏదైనా కూర. ‘నేను భోజన బల్ల మీద నీళ్ల గ్లాస్ పెట్టుకోను. మజ్జిగ గ్లాసు పెట్టుకుంటాను. నీళ్ల కంటే మజ్జిగ మన జీర్ణక్రియకు మంచిది’ అంటారామె. ఆ తర్వాత పనిలో పడతారు. సాయంత్రం కాసేపు వాకింగ్ చేస్తారు. ఉడకబెట్టిన పప్పులేవైనా తీసుకుంటారు. రాత్రి సూప్‌తోపాటు, ఇడ్లీ సాంబార్ లాంటివి భుజిస్తారు. రాత్రి సరిగ్గా 10.30కు నిద్ర ΄ోతారు. ‘జీవితం ప్రశాంతంగా గడవాలంటే సిస్టమేటిక్‌గా ఉండాలి’ అంటారామె.
యోగా గురువు
హన్సా యోగేంద్ర ముంబైలో పుట్టి పెరిగింది. చిన్న వయసులోనే యోగా పట్ల ఆకర్షితురాలైంది. బిఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చేసినా మనసు యోగా వైపుకు లాగడంతో ప్రఖ్యాత యోగా గురువు యోగేంద్ర స్థాపించిన ‘ది యోగా ఇన్‌స్టిట్యూట్’కు తరచూ వెళ్లేది. అక్కడే ఆమె యోగేంద్ర కుమారుడు జయదేవ యోగేంద్ర దగ్గర యోగా నేర్చుకుంది. ఆ తర్వాత జయదేవను వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి ఆమెవైపు పెద్దలు అంగీకరించలేదు. కాని తన జీవితాన్ని యోగాకు అంకితం చేయాలన్న నిశ్చయంతో ఆమె జయదేవను వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి యోగా కేంద్రాన్ని వృద్ధిలోకి తెచ్చింది. ఇప్పుడు ఆమె 76 సంవత్సరాలు. గత ముప్పై, నలభై ఏళ్లలో ఆమె సంస్థ ద్వారా తయారైన యోగా టీచర్లు, ఆమె ద్వారా కనీసం లక్షమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇవాళ ఆమె చేసే వీడియోలు లక్షల్లో చూస్తున్నారు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి యోగా ఉత్తమ మార్గం అంటారామె.
అలవాట్లు.. ఆలోచనలు
ఆలవాట్లు. ఆలోచనల మీద నియంత్రణ అన్నది జీవితాన్ని అదుపులో ఉంచుతుందని అంటారు హన్సా. అర్థవంతంగా జీవించడం ప్రతి ఒక్కరి అవసరం అని చెబుతారు. విపరీతమైన పరుగులాట, వేళకాని వేళ భోజనం, వేళకాని వేళలో నిద్ర... ఇవి జీవితానికి, ఆరోగ్యానికి ప్రధాన శత్రువులంటారామె. ఇవే అనవసర వృద్ధా΄్యాన్ని తెస్తున్నాయని అంటారు. ప్రకృతిలో దొరికే అందరికీ తెలిసిన పదార్థాలతోనే అకాల వృద్ధా΄్యాన్ని నిరోధించవచ్చంటారు. కాఫీ, టీ వంటివి కూడా శరీరానికి అక్కర్లేదని అవి అలవాటుగా మారి నాడీ వ్యవస్థను డీలా పరుస్తాయంటారు.
‘ఐదు ముఖ్యమైన ఉదయపు అలవాట్లు’,‘మంచినీరు తాగాల్సిన పద్ధతి’, ‘ప్రతి స్త్రీ వేయాల్సిన ఐదు ఆసనాలు’, ‘స్నానం చేయాల్సిన పద్ధతి’,‘ఎలాంటి ఆహారం తీసుకోవాలి’, ‘జబ్బులు రానివ్వని ఐదు ముద్రలు’... ఆమె చేసిన ఇలాంటి వీడియోలన్నీ పెద్దఎత్తున ఆదరణ ΄పొందాయి. సాత్విక ఆహారం గురించి ‘ది సాత్విక్ కిచెన్’ అనే పుస్తకం రాశారామె. ‘ఆ«ధ్యాత్మికత, ఆసనాలు మన జీవితానికి మార్గం చూపుతాయి.
మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తెలుసుకొని ఆధ్యాత్మికంగా మీ బలహీనతలను జయించండి’ అంటారు హన్సా. ‘జీవితం విసిరే సవాళ్లకు సిద్ధంగా ఉండి రిస్క్ తీసుకునైనా నిజాయితీగా ΄ోరాడితే జీవితం కచ్చితంగా మీకు సంతోషాలనే ఇస్తుంది. జీవితాన్ని అనవసర జంజాటాల్లో పడేయకండి’ అంటారామె. హన్సా కుమారుడు రిషి జయదేవ్ యోగేంద్ర కూడా యోగ సాధనలో ఉన్నాడు. ‘అతన్ని చూసి నేను గర్విస్తున్నాను’ అంటారామె.
Comments
Please login to add a commentAdd a comment