
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటుంటారు. ఈ సామెత వచ్చింది కూడా పెళ్లి గురించే. ఒకప్పుడు అంటే ఆడపిల్లలకు 18ఏళ్లు రాగానే పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. పెళ్లి విషయంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిల ఆలోచన ధోరణి కూడి మారింది. అసలు లైఫ్‌లో పెళ్లి అంత ముఖ్యం కాదు.. చేసుకోవాలని లేదు అని ఈ కాలం యువత అనుకుంటున్నారట. ఆరోగ్యరీత్యా ఆడపిల్లలు ఏ వయసులో పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి సరైన సమయం? 30తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి?
ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లా ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తోంది. దాంతో పెళ్లి, పిల్లలు వంటి బాధ్యతలు తీసుకోవడానికి తొందరపడట్లేదు. అనేకంటే సిద్ధంగా ఉండట్లేదు అనొచ్చేమో! అందుకే 35 ఏళ్లు దాటిన తరువాత ప్రెగ్నెన్సీతో వచ్చే అమ్మాయిలను ఎక్కువగా చూస్తున్నాం. ఎర్లీ మ్యారెజెస్‌లో ఇంకో రకమైన సమస్యలను చూస్తున్నాం. కాబట్టి పెళ్లికి ఏది సరైన వయసు అని చెప్పడం కాస్త కష్టమే. అయితే ఈ రెండు పారామీటర్స్‌ని దృష్టిలో పెట్టుకుని 28–32 ఏళ్ల మధ్య వయసును బెస్ట్ ఏజ్‌గా చెప్పాయి కొన్ని అధ్యయనాలు.
ఈ వయసుకల్లా అటు వృత్తిపరంగా స్థిరపడడమే కాక పెళ్లి, పిల్లలు వంటి నిర్ణయాలు తీసుకునేందుకు మానసికంగానూ సంసిద్ధత వచ్చేస్తుంది. శారీరక ఆరోగ్యమూ సహకరిస్తుంది. ఎమోషనల్‌గానూ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత అమ్మాయిల్లో.. నేచురల్, స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతుంటాయి. చాలామందిలో మారిన జీవన శైలి వల్ల అండాల నాణ్యతా తగ్గిపోతుంది.
ఏఎమ్‌హెచ్ అనే పరీక్షతో దీన్ని కనిపెట్టవచ్చు. 30 –35 మధ్యలో ప్రెగ్నెన్సీ వస్తే బీపీ, సుగర్ వచ్చే చాన్సెస్ పెరుగుతాయి. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడంతో పిల్లల్ని కనడమూ ఆలస్యమవుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కాబట్టి 28–30 ఏళ్ల మధ్య వయసులో పెళ్లి ప్లాన్ చేసుకుంటే అన్ని రకాలుగా మంచిది. ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ తగ్గుతాయి.
డా‘‘ భావన కాసు
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్