బాల్యానికి మూడు ముళ్ళు...
♦ మైనార్టీ తీరక ముందే పెళ్లిళ్లు..
♦ తల్లిదండ్రుల్లో మార్పు రావాలి
♦ అవగాహన కల్పిస్తున్నా మారని వైనం
బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు అమల్లోకి తెచ్చిన చట్టం.. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తిస్థాయి ఫలితాలను ఇవ్వడం లేదు. బాల్యవివాహాల వల్ల వాటిల్లే అనర్థాలను అధికారులు వివరిస్తున్నా.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. అక్కడక్కడ వివాహ యత్నాలను అడ్డుకుంటున్నా.. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండకముందే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసి గుండెలమీదినుంచి భారం దిగినట్లుగా భావిస్తున్నారు. దీంతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడడంలేదు. - నిజామాబాద్ క్రైం
ఈ ఏడాది ఘటనలు..
♦ ఫిబ్రవరి 4 : సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌లో బాల్య వివాహం జరపడానికి వధూవరుల కుటుంబాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. వధువు పదో తరగతి చదువుతోంది. విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో.. వారు పోలీసులతో కలిసి గ్రామానికి చేరుకుని వధూవరుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికను కేజీబీవీలో చేర్పించారు.
♦ ఫిబ్రవరి 18 : తాడ్వాయి మండలం సోమారంపేట్లో బాల్య వివాహం జరగాల్సి ఉంది. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి వెళ్లి బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనారిటీ తీరేంతవరకు వివాహం చేయబోమని ఒప్పందం రాయించుకున్నారు.
♦ ఫిబ్రవరి 19 : బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక వివాహన్ని అధికారులు అడ్డుకున్నారు.
♦ ఏప్రిల్ 23 : ఎడపల్లి మండలంలో రెండు, వర్ని మండలంలో ఒక బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు.
♦ ఎడపల్లికి చెందిన 17 ఏళ్ల బాలికను ఆదిలాబాద్‌కు చెందిన యువకుడికి ఇచ్చి వివాహం జరపడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఐసీడీఎస్ అధికారులు గ్రామానికి వెళ్లి బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి వివాహాన్ని నిలిపివేయించారు. అదేరోజు ఇదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక వివాహాన్నీ అధికారులు అడ్డుకున్నారు.
♦ వర్ని మండలంలోని పొట్టిగుట్ట తండాలో 16 ఏళ్ల బాలిక వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. మైనారిటీ తీరకముందు వివాహం జరిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యుక్త వయసు వచ్చాకే వివాహం జరిపిస్తామని ఒప్పంద పత్రాలు రాయించుకున్నారు.
♦ ఏప్రిల్ 28 : నవీపేట్ మండలం నాగేపూర్‌కు చెందిన బాలిక వివాహం జరగాల్సి ఉంది. ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు.
♦ జూన్ 13 : ఎల్లారెడ్డి మండలానికి చెందిన 16 ఏళ్ల బాలిక ప్రేమవివాహ యత్నాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు.
మానసిక స్థితి దెబ్బతింటుంది
బాల్య వివాహాల వల్ల చిన్నతనంలోనే ఒత్తిడి పెరుగుతుంది. మానసిక స్థితి దెబ్బతింటుంది. హిస్టీరియా బారిన పడే ప్రమాదం ఉంటుంది. యుక్తవయసుకు రాకముందే వివాహం చేయడం వల్ల శరీరంలో ఎదుగుదల లోపిస్తుంది. అన్ని అవయవాలు అభివృద్ధి చెందవు. అందువల్ల యుక్త వయసు వచ్చాకే పెళ్లి చేయాలి. - విశాల్, మానసిక వైద్యనిపుణులు, నిజామాబాద్
అవగాహన పెంచాలి
బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు, బాల్యవివాహాల వల్ల అనర్థాలను వివరించేందుకు న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాల్య వివాహాల వల్ల అనర్థాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. స్థానిక నాయకులకు బాల్య వివాహం గురించి తెలియగానే.. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. - రాజ్‌కుమార్ సుబేదార్, న్యాయసేవాధికార సంస్థ సలహాదారు
చట్టరీత్యా నేరం
యుక్త వయసు రాకముం దే బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరం. చిన్న వయసులోనే వివాహం చేయడం వల్ల అనేక అనర్థాలుంటాయి. తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు మోయాల్సి వస్తుంది. దీంతో మానసికంగా కుంగిపోతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయి. మాతాశిశు మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ. బాల్య వివాహాలు చేసే వారికి, ప్రోత్సహించేవారికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశాలుంటాయి.
- శారద, ఐసీడీఎస్ పీడీ
హక్కులను కాలరాయడం..
బాల్యంలోనే పెళ్లి చేయడం అంటే బాలల హక్కులను కాలరాయడమే.బాల్య వివాహాలను నిరోధించేందుకు చట్టాలు ఉన్నాయి. అయితే ప్రజలలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. బాలికల ఉన్నతి కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఎక్కడైనా యుక్తవయసు రానివారికి వివాహం జరిపిస్తున్నారని తెలిస్తే.. అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఏ ఊళ్లోనైనా వివాహం జరుగుతుంటే ఆ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, వీఆర్వోలకు తెలుస్తుంది.. వారు బాలికల వయసును ఆరా తీసి, బాల్య వివాహమైతే కౌన్సెలింగ్ నిర్వహించాలి.
- ఆనంద్‌కుమార్, డీఎస్పీ, నిజామాబాద్
అవగాహన లేకపోవడం వల్లే..
బాల్య వివాహాల వల్ల వాటిల్లే అనర్థాల వల్ల తల్లిదండ్రులకు సరైన అవగాహన లేదు. అందుకే చిన్న వయసులోనే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నారు. ఈ విషయమై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి. కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
- సాయినాథ్, పీజీ విద్యార్థి
ఆడపిల్లలపై వివక్ష..
ఆడ పిల్లలకు ఎక్కువ చదువులు ఎందుకని పది, ఇంటర్‌తోనే చదువు ఆపేస్తున్నారు. ఆ తర్వాత తమ భారం దింపుకోవడానికి పెళ్లి చేయాలని చూస్తున్నారు. మంచి సంబంధం దొరికిందని చిన్నతనంలో పెళ్లి చేయాలని ఇంకొందరు చూస్తున్నారు. ఇది సరికాదు.. చిన్న వయసులో పెళ్లి వల్ల భవిష్యత్‌లో ఏర్పడబోయే అనర్థాలగురించీ ఆలోచించాలి. యుక్త వయసు వచ్చాకే పెళ్లి చేయాలి.
- సంధ్యారాణి, విద్యార్థి