ఆ ఎమ్మెల్యే.. భార్యను కొట్టి వేధించేవారు!
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ ప్రభుత్వ మాజీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి తరచు తన భార్యను వేధిస్తూ, కొట్టేవాడని పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. గృహహింస కేసులో ఆయనకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆయన భార్య లిపికా మిత్రా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ ఐఎస్ మెహతాకు పోలీసులు పైవిధంగా చెప్పారు. ఎమ్మెల్యే అయిన తన భర్తకు బెయిల్ ఇచ్చేముందు దిగువ కోర్టు తగిన విధంగా వ్యవహరించలేదని లిపికా మిత్రా కోర్టుకు విన్నవించారు. కోర్టు సూచనల మేరకు పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు.
లిపికా మిత్రా శరీరం మీద ఉన్న మచ్చలన్నీ కుక్క కాట్లు, కాలిన గాయాల వల్లేనని ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే సోమ్‌నాథ్ భారతి తన భార్యను వేధించి, కొట్టి, తిట్టేవాడని, ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా ఏమాత్రం ఊరుకోలేదని.. అలాగే కొనసాగించారని తెలిపారు. గర్భవతిగా ఉన్న సమయంలో లిపికా మిత్రా మధుమేహం, హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు వైద్య నివేదికలు స్పష్టం చేశాయన్నారు. అయితే తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలను సోమ్‌నాథ్ భారతి ఖండించారు.