lipika mitra
-
ఆ ఎమ్మెల్యే.. భార్యను కొట్టి వేధించేవారు!
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ ప్రభుత్వ మాజీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి తరచు తన భార్యను వేధిస్తూ, కొట్టేవాడని పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. గృహహింస కేసులో ఆయనకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆయన భార్య లిపికా మిత్రా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ ఐఎస్ మెహతాకు పోలీసులు పైవిధంగా చెప్పారు. ఎమ్మెల్యే అయిన తన భర్తకు బెయిల్ ఇచ్చేముందు దిగువ కోర్టు తగిన విధంగా వ్యవహరించలేదని లిపికా మిత్రా కోర్టుకు విన్నవించారు. కోర్టు సూచనల మేరకు పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. లిపికా మిత్రా శరీరం మీద ఉన్న మచ్చలన్నీ కుక్క కాట్లు, కాలిన గాయాల వల్లేనని ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే సోమ్‌నాథ్ భారతి తన భార్యను వేధించి, కొట్టి, తిట్టేవాడని, ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా ఏమాత్రం ఊరుకోలేదని.. అలాగే కొనసాగించారని తెలిపారు. గర్భవతిగా ఉన్న సమయంలో లిపికా మిత్రా మధుమేహం, హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు వైద్య నివేదికలు స్పష్టం చేశాయన్నారు. అయితే తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలను సోమ్‌నాథ్ భారతి ఖండించారు. -
నా డాన్‌ను వేధిస్తున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు తన కుక్కను వేధిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ఆరోపిస్తున్నారు. కేసు విచారణలో తాను పూర్తిగా సహకరిస్తున్నా, తన పెంపుడు కుక్క డాన్‌ను వేధించడం సరికాదన్నారు. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు లాక్కొచ్చి మూగజీవిని కష్టపెట్టారని విమర్శించారు. ఆప్ నేతపై ఉన్న గృహహింస కేసు విచారణలో భాగంగా ద్వారాకానాథ్ పోలీసులు సోమనాథ్ భారతి పెంపుడు కుక్క డాన్(12)ను గురువారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. కాగా తాను గర్భవతిగా ఉన్నప్పుడు తన భర్త దాడికి పాల్పడ్డాడని, ఆయన తన లాబ్రడార్ జాతికి పెంపుడు కుక్కను తనపైకి వదిలేవాడని భార్య లిపికా మిత్రా ఫిర్యాదు చేశారు. ఆప్ ప్రభుత్వంలో పెద్ద అలజడి సృష్టించిన ఈ వివాదంలో, సోమనాథ్ భారతిపై గృహహింస, హత్యాయత్నం కేసు నమోదైంది. చివరికి అనేక నాటకీయ పరిణామాల మధ్య సోమ్పాథ్ కోర్టు ముందు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో ఆ కుక్కను గతంలో పోలీసు స్టేషన్‌కు తరలించడం సంచలనం సృష్టించింది. అయితే సోమనాథ్ భారతి ఆదేశాలను డాన్ (కుక్క) పాటించడం లేదంటూ అప్పట్లో క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. -
రాజీకి లిపికా మిత్రా నో
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతితో రాజీ కుదుర్చుకోవడానికి ఆయన భార్య లిపికా మిత్రా నిరాకరించారు. దీంతో సోమ్‌నాథ్ మరింత చిక్కుల్లో పడ్డారు. మధ్యవర్తిత్వానికి లిపికా నిరాకరించడంతో ఆయనపై దాఖలైన గృహహింస, హత్యాయత్నం క్రిమినల్ కేసులపై న్యాయస్థానంలో విచారణ కొనసాగనుంది. సుప్రీంకోర్టు ఎదుట హాజరైన లిపికా మిత్రా.. తన భర్తతో రాజీ కుదుర్చుకోవడానికి, మధ్యవర్తిత్వంలో పాల్గొనడానికి సముఖంగా లేనని ఆమె ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనానికి స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వానికి లిపికా నిరాకరించడంతో సోమ్‌నాథ్ భారతి పెట్టుకున్న బెయిలు దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు ద్వారా బెయిలు కోసం ప్రయత్నించాలని న్యాయస్థానం ఆయనకు సూచించింది. -
విచారణలో సోమనాథ్ భారతి కన్నీళ్లు
న్యూఢిల్లీ: పోలీసుల విచారణలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సోమనాథ్ భారతి కన్నీరు పెట్టుకున్నారు. కేసు విచారణ నిమిత్తం పోలీసుల వేసిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఏడ్చేశారు. తనపై గృహహింసకు పాల్పడ్డారని, హత్చేసేందుకు కూడా ప్రయత్నించారని సోమనాథ్ భారతి భార్య లిపికా మిత్ర కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చాలాసార్లు తప్పించుకోవాలని ప్రయత్నించి చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసులకు లొంగిపోయారు. విచారిస్తున్న సమయంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని విచారణ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయనపై ఐపీసీ సెక్షన్ 212 (అపరాధికి ఆశ్రయం ఇవ్వడం) కింద కూడా కేసు నమోదు చేశామని, మరో ఐదుగురిని కూడా నిందితులుగా చేర్చామని చెప్పారు. ఇన్ని రోజులు ఎక్కడెక్కడకు వెళ్లారో, ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారో అనే వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఆయన ఏయే ప్రాంతాల్లో ఆశ్రయం పొందారో ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి విచారణ జరపాల్సి ఉందని చెప్పారు. -
కేజ్రీవాల్‌కు లిపిక కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతిని పోలీసులకు లొంగిపొమ్మని సూచించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సోమనాథ్ భార్య లిపికా మిత్ర కృతజ్ఞతలు తెలిపారు. సోమనాథ్ తనపై హత్యాయత్నం, గృహహింసకు పాల్పడ్డాడని లిపిక కేసుపెట్టిన విషయం విదితమే. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సోమనాథ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడటానికి ముఖ్యమంత్రి సుదీర్ఘ సమయం తీసుకున్నప్పటికీ ఇప్పటికైనా లొంగిపొమ్మని చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ వైఖరిపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేజ్రీవాల్ ముందుగా ఒక ముఖ్యమంత్రిలా వ్యవహరించారని, స్నేహానికి తరువాతి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సోమనాధ్ లాంటి వ్యక్తి ఆగస్టులో జరిగిన ఒకరోజు అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారతపై మాట్లాడటం తనకు ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. -
ఆప్ ఎమ్మెల్యేపై గృహహింస, హత్యాయత్నం కేసు
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై గృహహింస, హత్యాయత్నం కేసు నమోదైంది. గురువారం నాడు ఫిర్యాదు చేయగా తన భర్తపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆయన భార్య లిపికా మిత్రా మీడియాకు తెలిపారు. అయితే ఈ కేసుపై ఫిర్యాదు చేసిన అనంతరం జరుగుతున్న విషయాలపై తాను చాలా అసంతృప్తిగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. నా భర్త చాలా శక్తివంతమైన మనిషి, ఆయన వెనక సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే భార్య, డీసీడబ్ల్యూ మాజీ చైర్ పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ తో కలిసి సీనియర్ స్పెషల్ పోలీస్ కమిషనర్ దీపక్ మిశ్రాను పోలీసు ప్రధాన కార్యాలయంలో కలిశారు. తన భర్తపై చర్య తీసుకునేందుకు సిద్ధమైనందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మూడు నెలల సమయం పట్టిందని, నాకు కావాల్సిన పనిని పోలీసులు ఇప్పుడైనా చేశారన్నారు. తన వద్ద బలమైన సాక్ష్యాలున్నాయని, తాను గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. సెక్షన్ 307, సెక్షన్ 498(ఎ), సెక్షన్ 406, 420 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు లిపికా మిత్రా చెప్పారు. ఢిల్లీ కోర్టు గురువారం తన స్టేట్ మెంట్ తీసుకున్నట్లు లిపికా మిత్రా వివరించారు. ఈ కేసుకు సంబంధించి నేడు విచారణకు రావాల్సిందిగా ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి గురువారం రాత్రి నోటీసులు అందినట్లు సమాచారం.