ఆప్ ఎమ్మెల్యేపై గృహహింస, హత్యాయత్నం కేసు
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై గృహహింస, హత్యాయత్నం కేసు నమోదైంది. గురువారం నాడు ఫిర్యాదు చేయగా తన భర్తపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆయన భార్య లిపికా మిత్రా మీడియాకు తెలిపారు. అయితే ఈ కేసుపై ఫిర్యాదు చేసిన అనంతరం జరుగుతున్న విషయాలపై తాను చాలా అసంతృప్తిగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. నా భర్త చాలా శక్తివంతమైన మనిషి, ఆయన వెనక సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని తెలిపారు.
ఎమ్మెల్యే భార్య, డీసీడబ్ల్యూ మాజీ చైర్ పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ తో కలిసి సీనియర్ స్పెషల్ పోలీస్ కమిషనర్ దీపక్ మిశ్రాను పోలీసు ప్రధాన కార్యాలయంలో కలిశారు. తన భర్తపై చర్య తీసుకునేందుకు సిద్ధమైనందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మూడు నెలల సమయం పట్టిందని, నాకు కావాల్సిన పనిని పోలీసులు ఇప్పుడైనా చేశారన్నారు. తన వద్ద బలమైన సాక్ష్యాలున్నాయని, తాను గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. సెక్షన్ 307, సెక్షన్ 498(ఎ), సెక్షన్ 406, 420 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు లిపికా మిత్రా చెప్పారు. ఢిల్లీ కోర్టు గురువారం తన స్టేట్ మెంట్ తీసుకున్నట్లు లిపికా మిత్రా వివరించారు. ఈ కేసుకు సంబంధించి నేడు విచారణకు రావాల్సిందిగా ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి గురువారం రాత్రి నోటీసులు అందినట్లు సమాచారం.