రాజీకి లిపికా మిత్రా నో
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతితో రాజీ కుదుర్చుకోవడానికి ఆయన భార్య లిపికా మిత్రా నిరాకరించారు. దీంతో సోమ్‌నాథ్ మరింత చిక్కుల్లో పడ్డారు. మధ్యవర్తిత్వానికి లిపికా నిరాకరించడంతో ఆయనపై దాఖలైన గృహహింస, హత్యాయత్నం క్రిమినల్ కేసులపై న్యాయస్థానంలో విచారణ కొనసాగనుంది.
సుప్రీంకోర్టు ఎదుట హాజరైన లిపికా మిత్రా.. తన భర్తతో రాజీ కుదుర్చుకోవడానికి, మధ్యవర్తిత్వంలో పాల్గొనడానికి సముఖంగా లేనని ఆమె ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనానికి స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వానికి లిపికా నిరాకరించడంతో సోమ్‌నాథ్ భారతి పెట్టుకున్న బెయిలు దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు ద్వారా బెయిలు కోసం ప్రయత్నించాలని న్యాయస్థానం ఆయనకు సూచించింది.