కేజ్రీవాల్‌కు లిపిక కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతిని పోలీసులకు లొంగిపొమ్మని సూచించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సోమనాథ్ భార్య లిపికా మిత్ర కృతజ్ఞతలు తెలిపారు. సోమనాథ్ తనపై హత్యాయత్నం, గృహహింసకు పాల్పడ్డాడని లిపిక కేసుపెట్టిన విషయం విదితమే. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సోమనాథ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు.
ఈ విషయం గురించి మాట్లాడటానికి ముఖ్యమంత్రి సుదీర్ఘ సమయం తీసుకున్నప్పటికీ ఇప్పటికైనా లొంగిపొమ్మని చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ వైఖరిపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేజ్రీవాల్ ముందుగా ఒక ముఖ్యమంత్రిలా వ్యవహరించారని, స్నేహానికి తరువాతి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సోమనాధ్ లాంటి వ్యక్తి ఆగస్టులో జరిగిన ఒకరోజు అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారతపై మాట్లాడటం తనకు ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.