
మృగాళ్ల ఆరళ్లు.. ఆరని కుంపట్లు
పలు రాజకీయ కుటుంబాల్లో గృహహింస గుట్టు చప్పుడు కాకుండానే కాదు బహిరంగంగా జరిగినా... పర్యవసానాలు బాధితులకు ప్రతికూలమే!
సమకాలీనం
పలు రాజకీయ కుటుంబాల్లో గృహహింస గుట్టు చప్పుడు కాకుండానే కాదు బహిరంగంగా జరిగినా... పర్యవసానాలు బాధితులకు ప్రతికూలమే! సంపద, హోదా, రాజకీయ పలుకుబడి.. ఇలాంటివి నిందితులకు రక్షణ కవచాలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఓ పెద్ద హోదా అనుభవిస్తున్న బడా నేత కోడల్ని ఇంట్లోంచి గెంటించి, విశాఖపట్నంలో కొట్టి, బాబును లాక్కొని, ప్రత్యక్షనరకం చూపించినా కిమ్మన్న వాళ్లు లేరు. తెలంగాణలో ఓ మాజీ జడ్పీ ఛైర్మన్, ఓ మాజీ మంత్రి, ఓ ఎమ్మెల్యే... ఇలా ఎందరెందరో నాయకుల, శాసనకర్తల ఇళ్లల్లో రగిలేవి నిత్య రావణ కాష్టాలే!
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు జరిగిన చావు అంతకన్నా కాదు. ఆత్మ హత్యపై అనుమానాలున్నాయి. ఇది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జరిగిన హత్య. హంతకులెవరు? ఒకరా, ఇద్దరా, పలువురా? అన్నది తేలాల్సి ఉంది. తేలుతుందా తేలదా కూడా తెలియదు, ఎందుకంటే అది అనేకానేక అంశా లతో ముడివడి ఉంటుంది. పిల్లలు ముగ్గుర్ని చంపి సారిక తాను ఆత్మహత్య చేసుకుందా? అందరూ చనిపోయి, అది ఆత్మహత్యలా కనిపించేట్టు పథక రచనతో ఎవరైనా కుట్రపన్ని హతమార్చారా? అన్నది సాక్ష్యాధారాలు, సాంకే తికాంశాల ఆధారంగా దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి, న్యాయస్థానాలు ధృవీక రిస్తాయి. దానికి సమయం పట్టొచ్చు. ఈ లోపున... సందేహాలకతీతంగా నిర్ధారణ అవుతున్న నిజం మాత్రం, ఇది ముమ్మాటికీ హత్య అని! సారిక భర్త అనిల్, ఆయన కుటుంబీకులు సుదీర్ఘ కాలంగా వేధించి నిర్దాక్షిణ్యంగా జరి పించిన సామూహిక హత్యగానే భావించాలి.
ఇక హంతకుల జాబితా... అనిల్‌తోనో, ఆయన కుటుంబీకులతోనో ఆగిపోవటం లేదు. ఇది చాలా పెద్దదిగానే ఉంది. ఈ హత్యే కాదు, ఇటీవల జరిగిన, జరుగుతున్న, జరుగ బోయే ఇటువంటి అనేకానేక హత్యల వెనుక ఒకరిద్దరు ప్రత్యక్ష నిందితులుగా మనకు కనబడుతున్నా పెద్ద వ్యవస్థే నిందితురాలిగా నిలుస్తోంది. అన్నెం పున్నెమెరుగని పసికందుల జీవితాల్ని మొగ్గలోనే నలిపేస్తూ తనువు చాలి స్తున్న వేనవేల సారికల మౌన రోదనలు ఎవరికీ వినిపించడం లేదు. రోజూ ఎక్కడో ఓ చోట ఇటువంటి ఘటనలు పునరావృతమౌతూనే ఉన్నాయి. ఇక వెలుగుచూడని దురాగతాలు ఎన్నో!
మన సామాజిక, రాజకీయ, పాలన, పోలీసు, న్యాయ వ్యవస్థలన్నీ తిలాపాపం తలా పిడికెడన్న చందంగా ఈ విపరీత పరిస్థితులకు దోహదపడుతున్నాయి. గృహహింస యథేచ్ఛగా కొనసాగుతోంది. డబ్బు, హోదా ఉన్న సంపన్నుల ఇళ్లల్లో నోరిప్పక నలుగు తున్న సారికలెందరో! తెగించి బయటికొస్తేనో, వేగలేక తనువు చాలిస్తేనో తప్ప ఏ ఇంటిగుట్టూ బయటికి రావట్లేదు. ఎదిరించలేక వేదన మౌనమై రోదించే చోట సరేసరి, ఇక తెగించి బయటికొచ్చిన చోట కూడా న్యాయం జరగట్లేదు. చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా, న్యాయస్థానాలు కొంత చొరవ చూపుతున్నా... లంచగొండితనం, డబ్బు, పలుకుబడి, హోదాల ఆధిపత్యం ముందు చట్టం అమలు నిలువునా నీరుగారిపోతోంది.
నాలుగు ప్రాణాలైనా నిలిచేవి!
సారిక బాధలకు ఏ వ్యవస్థ సక్రమంగా స్పందించినా అమానుషంగా అగ్నికి ఆహుతి కాకుండా నాలుగు ప్రాణాలు నిలిచేవి. ఆరేళ్లుగా పోలీసు- న్యాయ వ్యవస్థ కూడా జాప్యాలే తప్ప ఏ మాత్రం న్యాయం చేయలేదు. అప్పటికీ ఆమె ఎంతో ధైర్యం చేసింది, ఓ పోరాటమే సాగించింది. కనీసం రాజకీయ వ్యవస్థయినా తన మొర వింటుందేమో అనుకున్న ఆమె ఆశలు రాజయ్యకు టిక్కెట్టు ఖరారుతో గల్లంతయ్యాయి. టిక్కెట్టివ్వొద్దని, తనను వేధిస్తున్నారని అఖిలభారత కాంగ్రెస్ నాయకత్వానికి ఆమె మొరపెట్టుకున్నారు. నూట పాతికేళ్ల పైబడ్డ చరిత్ర కలిగిన పార్టీ కూడా గెలుపు అవకాశాల కోణంలో తప్ప మరో తరహా ఆలోచించలేకపోయింది. గత ఎన్నికలప్పుడే సారిక ఆత్మ హత్యా యత్నం, రాజయ్య ఎం.పి. అయ్యాక ఆయన ఇంటిముందు నిరసన ధర్నా, తాజా హెచ్చరికలు... ఇవన్నీ జరిగాక కూడా టిక్కెట్టు ఇవ్వడం రాజకీయ అవకాశవాదాన్నే స్పష్టం చేస్తోంది.
పలుకుబడితో కేసులోంచి పేరు తీయించుకున్నంత మాత్రాన అభియోగం ఎక్కడికీ పోదన్నది నాయకత్వం గ్రహించి ఉండాల్సింది. ఈ కారణం చూపి, టిక్కెట్టు నిరాకరించి ఉంటే సారిక నైతిక స్థయిర్యం పెరగడమే కాకుండా, రాజకీయ పార్టీగా ఓ మంచి సంకేతం పంపినట్టయ్యేది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో నైతిక ప్రమాణాలు పాటించడం లేదు. పలు రాజకీయ కుటుంబాల్లో గృహహింస గుట్టు చప్పుడు కాకుండానే కాదు బహిరంగంగా జరిగినా... పర్యవసానాలు బాధితులకు ప్రతికూలమే! సంపద, హోదా, రాజకీయ పలుకుబడి ఇలాంటి నిందితులకు రక్షణ కవచాలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఓ పెద్ద హోదా అనుభవిస్తున్న బడా నేత కోడల్ని ఇంట్లోంచి గెంటించి, విశాఖపట్నంలో కొట్టి, బాబును లాక్కొని, ప్రత్యక్ష నరకం చూపించినా కిమ్మన్న వాళ్లు లేరు.
తెలంగాణలో ఓ మాజీ మంత్రి, ఓ మాజీ జడ్పీ ఛైర్మన్... ఇలా ఎందరెందరో నాయకుల, శాసనకర్తల ఇళ్లల్లో రగిలేవి నిత్య రావణ కాష్టాలే! యథేచ్ఛగా జరిగే వివాహేతర సంబంధాలు తరచూ కుటుంబ కలహాలకు కారణమౌతు న్నాయి. బలవన్మరణాలు మామూలవుతున్నాయి. సారిక అగ్నికి ఆహుతైన ఇల్లు స్వచ్ఛందంగా ఇచ్చింది కాదు, న్యాయస్థానం ఇప్పించిందే! వలదని తాను వినతి చేసినా కాంగ్రెస్ టిక్కెట్టివ్వడం ఒక ఎత్తయితే, వాస్తు అనో, సౌకర్యమనో మళ్లీ కుటుంబం అంతా తానున్న ఇంటికే రావడం సారికలో అభద్రతని, భవిష్యత్తు పట్ల భయాన్నీ పెంచి ఉంటాయి.
కాపురాలకు రక్షణ-బతుక్కు భరోసా ఏది?
చిన్న వివాదాల నుంచి జఠిల సమస్యల వరకు భార్యా-భర్తల మధ్య గొడవలు కాపురాల్లో చిచ్చు రగిలిస్తున్నాయి. భర్తో, బావో, మామో.... ఇలా ఎవరో పురుషులే నిర్ణేతలుగా ఉండే కుటుంబాలవడం వల్ల అత్యధిక సందర్భాల్లో మహిళలకు న్యాయం జరగట్లేదు. ఆరళ్లకు, అణచివేతకు వారు గురవుతున్నారు. కష్టమైనా, నిష్ఠురమైనా కిమ్మనకుండా భరిస్తే సరేసరి! కాదని ధిక్కరిస్తే.... వేధింపులు, భౌతికదాడులు, బలవంతంగా విడిపోయే ఒత్తిళ్లు, మార్గాంతరం లేక మరణించే పరిస్థితులు కల్పిస్తున్నారు. కొన్నిసార్లు చంపేస్తున్నారు. రక్షించే వ్యవస్థ లేదు. జనాభాలో సగమై ఉన్న మహిళల రక్షణకు అవసరమైన సంఖ్యలో మహిళా పోలీసులు లేరు. పోలీసు విభాగంలో మహిళలు ఎనిమిది శాతానికి దాటట్లేదు. వరకట్న వేధింపులపై ఫిర్యాదు చేయాలన్నా ప్రయాసే. పలుకుబడి లేని వారు చేసేవైనా, పలుకుబడి ఉన్న వారిపై చేసే ఫిర్యాదులైనా కేసులుగా మారట్లేదు. ఈ కేసుల్ని కచ్చితంగా డీఎస్పీ స్థాయి అధికారే దర్యాప్తు చేయాలి. దాంతో, సాధారణ పరిస్థితుల్లో పోలీసులు వీటిని తీసుకోవడానికి విముఖత చూపడమో, కౌన్సెలింగ్ పేరిట తాత్సారం చేసి మధ్యలో తాము సొమ్ము చేసుకోవడమో జరుగుతోంది. ఫిర్యాదు తీసుకున్నా పోలీసుస్టేషన్లలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఉండవు. ఇక ఇలాంటి కేసుల కోసమే ఏర్పాటైన మహిళా పోలీసుస్టేషన్ల విషయానికొస్తే, మహానగరమైన హైదరాబాద్‌లో ఉన్నవి మూడే. సైబరాబాద్‌లో ఒకటి. తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన చోట్ల జిల్లాకు ఒక్కటి మాత్రమే!
ఈ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు లేకపోవడం, ఉన్న వాటిలోనూ పని భారంతో తీర్పుల్లో జాప్యం ఓ పెద్ద అవరోధంగా మారింది. భర్తకు దూరమై, తల్లిదండ్రుల ఆదరణ లేని అతివలు అంత సుదీర్ఘకాలం పోరాడలేక చతికిల పడుతున్నారు. వరకట్న వేధింపు కేసుల్లో పురుషాధిక్య వ్యవస్థ దురాగతాల్ని అడ్డుకునే ఆయుధం లాంటి భారతీయ శిక్షాస్మృతి, సెక్షన్ 498(ఎ) వేర్వేరు కారణాల వల్ల నిరుపయోగమౌతోంది. ఇది అప్పుడప్పుడు దుర్వినియోగం అవుతోంది. దాంతో, వరకట్న వేధింపులంటూ వచ్చే ఫిర్యాదులు అన్నిసార్లు వాస్తవం కాదనే భావన బలపడింది. కొన్ని సందర్భాల్లో సాక్షాత్తు న్యాయ మూర్తులే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
ఇదే అభిప్రాయంతో ఉండే పోలీసులు, కోర్టులు నిజమైన బాధితులకూ పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దరిమిళా, సీఆర్పీసీ 41(ఎ) సవరణ తదనంతరం... భార్యను మానసికంగా, శారీకరంగా వేధించిన మృగాళ్లూ పోలీసుస్టేషన్ నుంచే బెయిల్ పొంది వెళ్లిపోవడాన్ని బాధితులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపణై, శిక్షలు పడుతున్న సందర్భాలు 25 శాతం కూడా ఉండట్లేదు. దీంతో సుదీర్ఘ విచారణ పూర్తయ్యే వరుకు ఎదురు చూసినా... చివరకు అనుకూలంగా తీర్పు వస్తుందనే భరోసా బాధితులకు కలగట్లేదు. ఈ దుస్థితే అనేక సందర్భాల్లో విపరీత నిర్ణయాలకు కారణమవుతోంది.
జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో 2014 గణాంకాల ప్రకారం...
498 (ఎ) కేసులు: ఏపీ- 6362, టీఎస్- 6369/ వరకట్న మరణాలు: ఏపీ- 215, టీఎస్- 289/ వరకట్న నిషేధ చట్టం కింద కేసులు: ఏపీ-468, టీఎస్-563/ వరకట్న వేధింపులతో ఆత్మహత్యలు: ఏపీ-36, టీఎస్-62. ఈ నేరాల తీరు ఆందోళన కలిగించేదే.
మానసిక దృఢత్వం సున్న..!
సమష్టి కుటుంబ వ్యవస్థ సన్నగిల్లిన తర్వాత ఒకరిద్దరు పిల్లలతో ఉండే పరిమిత కుటుంబాలెక్కువయ్యాయి. మానవ సంబంధాల పరంగా పిల్లల్లో ఆలోచన పరిధి అంతగా విస్తరించడం లేదు. మంచి-చెడుల విచక్షణ, ప్రేమ-ఆకర్షణల మధ్య వ్యత్యాసం తెలియటం లేదు. ఇటీవలి కాలంలో నవతరాన్ని తలిదండ్రులు తీర్చిదిద్దే తీరే వింతగా ఉంటోంది. సున్నితత్వం పాళ్లెక్కువై మానసిక దృఢత్వం పెంచే యత్నం ఆడపిల్లల పెంపకంలో లోపిస్తోంది. ఇందుకు పూర్తి విరుద్ధంగా, మగపిల్లల నిర్లక్ష్యపు పెంపకం వల్ల వారిలో స్పందనా రాహిత్యం-తెంపరితనం పాళ్లెక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా దూకుడు, బాధ్యతా రాహిత్యం వార్ని వ్యసనపరులు, దురహం కారులుగా తయారు చేస్తోంది. దాంతో పర్యవసానాలు ఆలోచించలేనంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లలు గాలివానలో తమలపాకులా చిన్న చిన్న విషయాలకే తల్లడిల్లిపోయేంత సున్నిత మనస్కులుగా తయారవు తున్నారు. ఏదీ లోతుగా ఉండదు. పైపై ఆకర్షణలకే అత్యధికులు వశమై పోయే పరిస్థితులున్నాయి. దీనికితోడు... ప్రపంచీకరణ ప్రభావం వల్ల పెరి గిన వస్తు వ్యామోహానికి యువతీయువకులు బాగా ప్రభావితులవుతున్నారు.
ప్రేమ-వ్యామోహం మధ్య సన్నటి పొరను ఎప్పుడో చెరిపేశారు. కుటుంబ విలువల పట్ల, కట్టుబాట్ల పట్ల చులకన భావం పెరుగుతోంది. సమకాలీన సినిమాల్లో, టీవీ సీరియళ్లలో వస్తున్న ఇతివృత్తాలు, కథనాల్ని నడిపే తీరు, వస్తు వ్యామోహం, పాత్రల వ్యక్తిత్వాలకు సంబంధించిన చవకబారుతనం, నేర దృక్పథం, ప్రేమ అనే ఉదాత్త భావనను పలుచబార్చిన తీరు... ఇవన్నీ యువతను పెడదారి పట్టిస్తున్నాయి. జిమ్ దగ్గర చూడగానే పుట్టిన ప్రేమ నిలువక ఓ అమ్మాయి చిక్కుల్లో చిక్కుకోవడమైనా, పీఎఫ్ ఆఫీసులో పనిచేసే ఒక జులాయి దురాగతాలకు 300 పైచిలుకు అమ్మాయిలు మోసపోవడమైనా ఈ పరిస్థితులకే అద్దం పడుతున్నాయి. రాజయ్య కోడలు సారిక-ఆమె ముగ్గురు పిల్లల అమానుష మరణం, దాని వెనుక కారణాల్ని విశ్లేషించి నపుడు... ఇవన్నీ స్ఫురణకు వస్తున్నాయి. ప్రతి ఆత్మహత్యా హత్యే అన్న సామాజికవేత్తల వ్యాఖ్య నిజమని మరోమారు రుజువౌతోంది.
దిలీప్ రెడ్డి, ఈమెయిల్: dileepreddy@sakshi.com