ఢిల్లీ ఎమ్మెల్యే అరెస్టు ఖాయం?
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే, ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతి అరెస్టు దాదాపు ఖాయమైనట్టే. గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ సురేష్ కైత్ ఈ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏక్షణంలోనైనా సోమ్నాథ్ ని అదుపులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
సోమనాథ్ భారతిపై ఆయన భార్య లిపికా ఈ ఏడాది జూలై 10న మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా వేధిస్తూ, హింసిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు తన పెంపుడు కుక్క లాబ్రడార్ ను ఉసికొల్పి హత్య చేయడానికి ప్రయత్నించారని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆప్ మాజీ మంత్రిపై గృహ హింస, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
మరోవైపు సోమనాథ్ భారతి విచారణకు సహకరించడం లేదని ఆరోపిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పేర్కొంటూ, అరెస్టు వారెంట్ ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు.