ప్రభుత్వాలు దోపిడిదారులవైపే ఉన్నాయి తప్ప అణగారిన వర్గాల ప్రజలవైపు లేవని ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఇండియా ఇంచార్జీ సోమనాధ్ భారతి అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శ్రామిక విభాగం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సోమనాధ్ భారతి మాట్లాడుతూ ఢిల్లీలో పాలన పేదల వైపే ఉందని అన్నారు.
ఢిల్లీ కార్మికమంత్రి గోపాలరావు కార్మికులకు గుర్తింపు కార్డులను ఇచ్చి వారి సమస్యలను దగ్గరుండి పరిస్కరిస్తున్నారని అన్నారు.ప్రజలకు కావల్సింది ముఖ్యంగా విద్య, వైద్య సౌకర్యాలని, తెలంగాణ ప్రభుత్వం ఈ రెండింటికి తక్కువ ప్రాధన్యత ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యకు 25 శాతం నిధులను కెటాయించిందని అన్నారు. దీని వల్ల ప్రై వేట్ విద్యాసంస్థలకంటే ప్రభుత్వ విద్యా సంస్థలే మెరుగుపడుతాయని అన్నారు.
మోదీ ప్రభుత్వం రాహుల్‌నే ప్రత్యర్ధిగా భావిస్తుందని,ఐతే దేశ ప్రజలు మాత్రం కేజ్రివాల్‌నే ప్రత్యర్ధిగా భావిస్తున్నారని అన్నారు. పీడిత ప్రజలవైపు ఉండటమే ప్రభుత్వం లక్ష్యంగా ఉండాలని, అయితే పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేస్తుందని విమర్శించారు. పేదలకు సేవ చేయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. పేదలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆప్ శ్రామిక విభాగం జాతీయ ముఖ్య నాయకులు సరోజ్ సినా, రాజు ఘోషన్, తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్ ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు, అడ్వయిజర్ ఆర్.వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఎస్.శ్రీశైలం, నాయకులు హైదర్ అబ్బాస్, ఎస్.మధుసూదన్ రావు, నమ్రితా జైశ్వాల్, బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.