ఆమెకు గౌరవమేదీ? | NCRB's Crime in India report revealed | Sakshi
Sakshi News home page

ఆమెకు గౌరవమేదీ?

Published Fri, Dec 1 2017 1:20 AM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM

NCRB's Crime in India report revealed - Sakshi

మహిళలను అగౌరవపరచడం, కించపరచడంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. 2016లో ఆంధ్రప్రదేశ్‌లో ఐపీసీ 509 కింద 1,831 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 1,003 కేసులు నమోదయ్యాయి. 924 కేసులతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచింది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) రూపొం దించిన ‘క్రైమ్‌ ఇన్‌ ఇండియా’ నివేదికను గురువారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఢిల్లీలో విడుదల చేశారు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక వివరాలివీ..    – సాక్షి, హైదరాబాద్‌


1,311 హైదరాబాద్‌లో గృహ హింస కేసులు
దోపిడీలు, హత్యలు, దొంగతనాలు, కిడ్నాపులు తదితర కేసులు రాష్ట్ర విభజన తర్వాత తగ్గాయి. అయితే మహిళలపై అత్యాచారాలు, కిడ్నాపులు, ఇతర కేసుల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. నమోదైన కేసుల్లో 8.1 శాతం మంది నిందితులకు మాత్రమే శిక్షలు పడ్డాయి.

ఇక గృహ హింస కేసుల్లో హైదరాబాద్‌ మెట్రో సిటీలో కేసులు పెరిగాయి. రాష్ట్రం మొత్తంగా 7,202 కేసులు నమోదు కాగా, కేవలం హైదరాబాద్‌లోనే 1,311 కేసులు నమోదయ్యాయి. ఇందులో మొదటి స్థానంలో ఢిల్లీ (3,645) ఉండగా, రెండో స్థానంలో హైదరాబాద్‌ ఉంది. మూడో స్థానంలో జైపూర్‌ (1,008) ఉంది. మరోవైపు బాల్యాన్ని చిదిమేస్తున్న కేసుల్లోనూ రాష్ట్ర పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. 2016లో జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద నమోదైన 491 కేసులతో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. 344 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది.

ఆర్థిక నేరాల్లోనూ అంతే..
ఆర్థిక నేరాల్లోనూ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. 2014లో 9,413 కేసులు నమోదు కాగా 2015లో 8,979, 2016లో 9,286 కేసులు నమోదయ్యాయి. ఆర్థిక నేరాల్లో రాజస్తాన్‌ మొదటి స్థానంలో, ఢిల్లీ రెండో స్థానంలో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో తగ్గుదల కని పించినా మొదటి 5 స్థానాల్లో తెలంగాణ ఉంది. 1,741 కేసులతో తొలి స్థానంలో కర్ణాటక, 1,066 కేసులతో రెండో స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్, 750 కేసులతో జార్ఖండ్‌ మూడో స్థానంలో, 513 కేసులతో ఏపీ నాలుగో స్థానంలో, 480 కేసులతో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నాయి. కేసులు వందల్లో ఉంటే శిక్షల శాతం మాత్రం కేవలం 6.5 శాతానికే పరిమితమైంది.

మైనర్లపై లైంగిక వేధింపుల్లో టాప్‌
లైంగిక వేధింపుల నియంత్రణ (పోస్కో) చట్టం కింద 2016లో అత్యధిక కేసులు తెలంగాణలోనే నమోదయ్యాయి. ఏడాదిలో చిన్నారులపై జరిగిన దాడులు, వేధింపులు, తదితర కేసులన్నీ 2,909 కాగా, వీటిలో లైంగిక దాడులకు సంబంధించి 178 కేసులు న్నాయి. దేశవ్యాప్తంగా పోస్కో యాక్ట్‌ 12, ఐపీసీ 509 కింద తెలంగాణలోనే 178 కేసులు నమోదు కాగా, తర్వాతి స్థానంలో యూపీలో 123 కేసులు నమోదయ్యాయి. మరోవైపు సీనియర్‌ సిటీ జన్లపై జరిగిన దాడులకు సంబంధించి రాష్ట్రంలో 2014లో 422, 2015లో 1,519, 2016లో 1,382 కేసులు నమోదయ్యాయి. ఇందులో చంఢీగఢ్‌ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఉన్నాయి. చీటింగ్‌ కేసుల్లో సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ తొలిస్థానంలో ఉంది.


57 మంది పోలీసులపై కేసులు
పోలీస్‌ శాఖలో నేరాలకు పాల్పడ్డ 57 మంది పోలీస్‌ అధికా రులు, సిబ్బందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 33 మం దిని అరెస్ట్‌ చేయగా, 29 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేశారు.

1.48 లక్షల కేసులు దర్యాప్తులోనే..
రాష్ట్ర పోలీస్‌ శాఖ పరిధిలో 2016లో 1,08,991 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు నమోదైన కేసుల్లో దర్యాప్తులో దశలో ఉన్నవి 39,233 కేసులు. మొత్తంగా 2016 డిసెంబర్‌ 31 వరకు 1,48,224 లక్షల కేసుల దర్యాప్తు పెండింగ్‌లో ఉంది. ఆధారాలు లేక 838 కేసులు మూసివేసే స్థితిలో ఉన్నాయి. 420 కేసులు తప్పుడు కేసులని రాష్ట్ర పోలీసు శాఖ కోర్టుకు తెలిపింది.

భారీగా నకిలీ నోట్ల స్వాధీనం..
రాష్ట్రంలో నకిలీ నోట్లకు సంబంధించి 52 కేసులు నమోదు చేయగా, 74 మందిని అరెస్ట్‌ చేశారు. రూ.76 లక్షల నకిలీ కరె న్సీని స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా రూ.15.92 కోట్లు నకిలీకరెన్సీని సీజ్‌ చేసి 1,107 మందిని అరెస్ట్‌ చేశారు.

సైబర్‌ నేరాల్లో 4 స్థానం
2016లో 593 కేసులతో సైబర్‌ నేరాల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. చిన్నారులపై లైంగిక వేధింపులు, యువ తులను వేధించడం, తదితర నేరస్థులను గుర్తించడం పోలీస్‌ శాఖకు కష్టంగానే మారింది. అరెస్ట్‌ చేసిన కేసుల్లోనూ పెద్దగా శిక్షల శాతం పెరగక పోవడం నిందితులకు భయం లేకుండా చేస్తోంది. 2016లో సైబర్‌ నేరాల్లో రాష్ట్రంలో కన్విక్షన్‌ రేటు ‘సున్నా’గా ఉండటమే దీనికి ప్రధాన కారణం. సైబర్‌ నేరాల్లో మొదటి స్థానంలో అస్సాం, రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో కర్ణాటక ఉన్నాయి.

తీవ్రత కలిగిన నేరాల వివరాలు
నేరం            2014     2015      2016
హత్యలు       1,308    1,188     1,046
కిడ్నాపులు   1,152    1,044     1,302

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement