గృహహింస చట్టం మహిళలకు వరం
‘498 ఎ’ కన్నా ఎక్కువ రక్షణ
అమలుకు ప్రత్యేక యంత్రాంగం
మరింత అవగాహన అవసరం
అతివలకు అడుగడుగునా అవరోధాలే. ఇంటా బయటా వేధింపులే. ఇది అనాదిగా వస్తున్న దురవస్థ. ఒకవిధంగా ఆలోచిస్తే బయటి సమస్యల కన్నా ఇంట్లోని పరిస్థితులే వారిని మరింత కుంగదీస్తున్నాయి. మహిళలకు రక్షణ కల్పించడానికి రూపొందించిన గృహహింస చట్టం ఇప్పుడిప్పుడే తన ప్రతాపం చూపిస్తోంది. వేధించేవారి వెన్నులో వణుకు పుట్టి ఇది అతివలకు మరింతగా ఉపయోగపడాలంటే ఈ చట్టం గురించి విస్తృత ప్రచారం జరగాలి. అవగాహన పెరగాలి.
విశాఖపట్నం : గృహహింస నుంచి మహిళలను రక్షించేందుకు ప్రవేశపెట్టిన చట్టం మహిళలకు వరం. గృహహింస నివారణ చట్టం 2005-06 అక్టోబర్ 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నెంబర్-43తో ఈ చట్టాన్ని తయారు చేసింది. వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు, అభిప్రాయాల వల్ల సమాజంలోనే కాకుండా ఇంట్లో కూడా స్త్రీ, పురుష సంబంధాలలో అసమానతలు ఏర్పడి గృహహింసకు దారితీస్తున్నాయి. దుర్భర పరిస్ధితులు ఎదుర్కొనే మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. చాలామంది మద్యానికి బానిసై కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబాలలోని మహిళలు కూడా ఏదో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి సంపాదనను కూడా మద్యం కోసం దుబారా చేసే మగపుంగవులు కోకొల్లలు. మద్యం మత్తులో భార్య, కుమార్తెలను ఇష్టానుసారంగా హింసించే మగ రాక్షసులకు కటకటాల వెనక్కినెట్టడమే కాకుండా మస్తుగా జరిమానాలు కూడా వడ్డించేందుకు చట్టం వీలు కల్పిస్తోంది.
గృహహింస..
శారీరకంగాను, మానసికంగాను, ఆర్ధికంగాను, లైంగికంగాను హింస పెట్టడం గృహహింస కిందకే వస్తుంది. ఇంకా బెదిరించడం, భయపెట్టడం దౌర్జన్యానికి పాల్పడడం, ఆరోగ్యాన్ని కుంటుపరిచే చర్యలు కూడా గృహహింసకు సంబంధించినవిగానే
పరిగణిస్తారు.
చట్టం పరిధి..
ఈ చట్టం ప్రకారం బాధితురాలు, ప్రతివాది మధ్య... భార్యభర్తల సంబంధంతోపాటు ఇతర సంబంధాలు కూడా వర్తిస్తాయి. పుట్టుక ద్వారా, పెళ్లి ద్వారా, దత్తత ద్వారా కలిసివుంటున్నవారు, ఒకే ఇంటిలో కలిసి నివసించే స్త్రీ, పురుషులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. గృహహింసకు గురయినపుడు సంబంధిత మహిళ లేదా ఆమె తరపు బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.
అమలు పరిచే వ్యవస్థ
రక్షణ అధికారి, న్యాయ సేవల అధికారి, సేవలు అందించే స్వచ్ఛంద సంస్ధలు, ఆశ్రయం అందించే సంస్ధలు, పోలీస్ అధికారి ఈ చట్టాన్ని అమలుపరుస్తారు. జిల్లాలలోని మహిళా, శిశు అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డెరైక్టర్లను ఈ చట్టం కింద రక్షణ అధికారులుగా నియమించారు. ప్రాజెక్టు డెరైక్టర్‌కు అందిన ఫిర్యాదు మేరకు జిల్లాలోని ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేస్తారు. సంబంధింత న్యాయమూర్తి దరఖాస్తు అందిన మూడు రోజులలోగా మొదటి వాదన వినాలి. వాదోపవాదాలు విన్న తరువాత 60 రోజులలోగా తుది తీర్పు ప్రకటించవలసి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే ప్రతివాదులకు ఏడాది జైలుశిక్షతోపాటు 20 వేల రూపాయల జరిమాన విధించే అవకాశాలు ఉన్నాయి.
ప్రవాస వంచకులతో ఇబ్బందులు..
ప్రవాస భారతీయులను పెళ్లి చేసుకుని మోసపోయిన మహిళలను గృహహింస చట్టం కూడా ఆదుకోలేకపోతుంది. కేసు వేసినా ఇక్కట్లు పడాల్సి వస్తోంది. ఆయా దేశాలలో నివసిస్తున్న వీరి భర్తలకు సమన్లు అందడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. సమన్లు అందినా కోర్టుకి రాకుండా కాలయాపన చేస్తుండటంతో బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగం కావడంతో అమ్మాయిల తల్లిదండ్రులు ముందు, వెనుక చూడకుండా లక్షలాది రూపాయల కట్నం, ఇతర లాంఛనాలతో పెద్ద ఎత్తున వివాహలు జరిపిస్తున్నారు. తీరా కొద్ది కాలానికే తమ కుమార్తె పుట్టింటికి చేరుకోవడంతో తల్లిదండ్రులను అంతులేని ఆవేదన మిగులుతుంది. పోనీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహహింస నివారణ చట్టం 2005 కింద న్యాయం జరుగుతుందేమోనని ఫిర్యాదు చేసినా పరిష్కారం మాట దేవుడెరుగు, సమన్లు పంపడానికే పడరానిపాట్లు పడాల్సివస్తోంది.
నగరంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్-9లోని జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్ధ కార్యాలయంలో ఉమెన్‌సెల్ పనిచేస్తోంది. సంస్ధ ప్రాజెక్ట్ డెరైక్టర్ పర్యవేక్షణలో పనిచేసే ఈ సెల్‌లో ఒక లీగల్ ఆఫీసర్, ఒక కౌన్సిలర్, మరో ఇద్దరు అసిస్టెంట్ కౌన్సిలర్‌లు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పనిచేస్తున్నారు. వీరు బాధితుల నుంచి ముందుగా ఫిర్యాదు తీసుకుంటారు. త రువాత సంబంధీకులను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తారు. రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తారు. రాజీ కుదరకుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సంబంధిత కోర్టులో కేసు దాఖలు చేస్తారు. కోర్టులో న్యాయమూర్తి బాధిత మహిళలకు మధ్యంతర భృతి, తరువాత భరణం మంజూరు చేస్తుంటారు. చట్టంలోని నిబంధల ప్రకారం కేసుని 60 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈసెల్‌లో ఎన్‌ఆర్‌ఐ కేసులు 20 కావడం గమనార్హం.
మొత్తం కేసులు...
2006 నుంచి 2015 జనవరి వరకు ఉమెన్ సెల్‌లో మొత్తం 1447 కేసులు నమోదు కాగా అందులో 273 కౌన్సెలింగ్‌లు జరుగుతున్నాయి. కోర్టులో సెటిల్ అయినవి 381 కేసులు కాగా, కోర్టులో 793 ప్రోసెస్‌లో ఉన్నాయి.
నిర్భయంగా ఫిర్యాదు చేయండి....
గృహహింసకు గురయ్యే మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి. బాధితులు నేరుగా మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. నమోదు చేసిన అనంతరం ఒక నివేదిక రూపంలో కోర్టుకి సమర్పిస్తాం. చట్టపరంగా సహయం, ఉచిత న్యాయసేవలు, ఆర్ధికసాయం, పిల్లల సంరక్షణ, ఆశ్రయం, వైద్యసహాయం వంటివి బాధిత మహిళలకు అందజేస్తాం. కోర్టు కేసు విచారణ తెలిపే నోటీసును ప్రతివాదికి అందజేస్తాం. స్వచ్ఛంద సంస్ధల ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరించి, చట్టప్రకారం వ్యవహరిస్తాం. జిల్లాలోని బాధిత మహిళలు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్‌ఆర్‌ఐ కేసులు ఉన్నాయి. అడ్రస్ లేకపోవడంతో ఇబ్బందులు పడవలసి వస్తోంది.
-బి.డి.జ్యోతిలత , కౌన్సిలర్
ప్రొటెక్షన్ సెల్, డీఆర్‌డీఏ కాంప్లెక్స్,
సెక్టార్-9, ఎంవీపీ కాలనీ,
ఫోన్: 0891-270615
చెయ్యెత్తితే ఖబడ్దార్!
Published Sat, Feb 21 2015 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement