నైతికంగానూ, చట్టప్రకారం కూడా ఆ వివాహం సబబు కాదు | That would not be fair to marry | Sakshi

నైతికంగానూ, చట్టప్రకారం కూడా ఆ వివాహం సబబు కాదు

Published Sun, Mar 27 2016 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

నైతికంగానూ, చట్టప్రకారం కూడా ఆ వివాహం సబబు కాదు

నైతికంగానూ, చట్టప్రకారం కూడా ఆ వివాహం సబబు కాదు

మేము సిక్కు మతస్థులము. మా వివాహమై ఐదేళ్లయింది. నా భర్త బ్యాంక్ ఆఫీసర్. తోటి ఉద్యోగినితో అక్రమ సంబంధం ఏర్పరచుకుని, నన్ను వదిలేసి నిస్సిగ్గుగా ఆమెతోనే కాపురం పెట్టాడు. నేనెన్నో ప్రయత్నాలు చేశాను. అన్నీ విఫలమైనాయి. కోర్టులో విడాకుల కేసు వేయాలని ఉంది. చట్టాల పట్ల అవగాహన లేదు. విడాకుల విషయంలో సిక్కుమతస్థులకు ఎలాంటి చట్టం ఉంది? వివరాలు తెలియజేయగలరు.  - హర్వీందర్ కౌర్, హైదరాబాద్

 మన దేశంలో వివిధ మతస్థుల వారు నివసిస్తున్నారు. వారిమధ్య వివాహానికి సంబంధించిన వివాదాలు అంటే విడాకులు, మనోవర్తి, పిల్లల కష్టడీ, భార్యాభర్తలకు సంబంధించిన ఆస్తి వ్యవహారాలు మొదలైన విషయాల్లో కోర్టును ఆశ్రయించాలంటే వారి వారి వ్యక్తిగత న్యాయచట్టాలు అంటే పర్సనల్ లా స్ ఉన్నాయి. హిందువులకైతే హిందూ వివాహ చట్టం 1955 ఉంది. క్రైస్తవులకు సంబంధించి ‘కైస్తవ వివాహ చట్టం’, విడాకుల చట్టం రెండూ ఉన్నాయి. ముస్లిములకు సంబంధించి వారి పర్సనల్ లా అంటే షరియత్ చట్టం ఉంది. అంతేకాదు, ముస్లిం మహిళలు విడాకులు పొందడానికి మహమ్మదీయ వివాహాల రద్దు చట్టం 1939 ఉంది. మతాల మీద విశ్వాసం లేనివారికి, మతాంతర వివాహాలు కోరుకునేవారికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఉంది.

 ఇక మీ సంగతి. మీరు సిక్కులు కనక మీరు హిందూ మతస్థులుగా పరిగణింపబడి హిందూ వివాహచట్టం పరిధిలోకి వస్తారు. కనుక మీరు హిందూ వివాహ చట్టాన్ని అనుసరించి మీ భర్త నుండి విడాకులు పొందవచ్చు. మీతోబాటు జైనులు, బౌద్ధులు కూడా హిందూ వివాహ చట్ట పరిధిలోకే వస్తారు. పార్సీమతస్థులకు, యూదుమతస్థులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి.

  


మాకు ఒక్కడే సంతానం. మెడిసిన్ పూర్తి చేసి పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు. ఇటీవల వాడు తన క్లాస్‌మేట్ ఒకమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి తాము ప్రేమించుకున్నామని, పెళ్లి చేయమని అడిగాడు. ఆమె ఒక ఎన్నారై. అమ్మానాన్నలు అమెరికాలో 20 సంవత్సరాల నుండి ఉంటున్నారట. అమ్మాయి చాలా చక్కగా ఉంది. మేము అమ్మాయి అమ్మానాన్నల గురించి విచారిస్తే దిగ్భ్రాంతికరమైన విషయం తెలిసింది. మా వారు మంచం పట్టే పరిస్థితి వచ్చింది. అసలు విషయం... ఆ అమ్మాయి... అంటే మా వాడు ప్రేమించిన అమ్మాయి మా వారి మొదటి భార్య కూతురు. విడాకుల తర్వాత ఆమె అమెరికా వెళ్లి మరల  వివాహం చేసుకుని అక్కడే స్థిరపడింది. మా వాడికి ఎలా చెప్పాలి? - విజయలక్ష్మి, గుంటూరు

ఆమె చెల్లెలవుతుందని లక్షణంగా చెప్పండి, వారు వివాహం చేసుకోకూడదనీ చెప్పండి. మనం ఎంత అభివృద్ధి సాధించినా, కాలం ఎంత మారుతున్నా, సామాజిక పరిస్థితులు ఎంత మారుతున్నా, మన సమాజంలో కొన్ని కట్టుబాట్లూ, నీతినియమాలు, రీతి రివాజులు ఉన్నాయి. మానవ సంబంధాలు వికృతమవ్వకుండా కొన్ని నిషేధాలు ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ఏర్పరచుకున్నాము. హిందూ వివాహ చట్టప్రకారం కొన్ని షరతులు ఉన్నాయి. వాటిలో ఒకటి వధూవరుల మధ్య నిషేధించబడిన బంధుత్వాలు ఉండకూడదు. ఇది రక్తసంబంధీకులకు కూడా వర్తిస్తుంది. మీ అబ్బాయి, ఆ అమ్మాయి అసంపూర్ణ రక్తసంబంధీకులు అంటే హాఫ్ బ్లడ్ బ్రదర్ అండ్ సిస్టర్ అన్నమాట. అంటే ఒక తండ్రి ఇరువురు తల్లులకు పుట్టిన సంతానం అన్నమాట. ఇలాంటి వివాహాలు సెక్షన్ 5 హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లవు. కాబట్టి మోరల్‌గా, లీగల్‌గా కూడా వారిద్దరూ వివాహం చేసుకోకూడదు. చదువుకున్న పిల్లలు అర్థం చేసుకుని, సిగ్గుపడి సర్దుకుంటారు, సరిదిద్దుకుంటారు. సందేహ పడకండి.

  


మాకు విడాకులై సంవత్సరం దాటింది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాము. నాకు ఒక పాప ఉంది. ఆమె నా కష్టడీలోనే ఉంది. అతను నెలకొకసారి పాపను చూసేందుకు విజిటింగ్ రైట్స్ పొందాడు. కానీ పాపను చూడ్డానికి వచ్చిన ప్రతిసారీ నన్ను వేధిస్తున్నాడు. కేసు పెట్టే ఓపిక లేదు. ఈ వేధింపులు కూడా గృహహింస కిందికి వస్తాయా?  - కృష్ణవేణి, నెల్లూరు

మీ సందేహం అర్థమైంది. భార్యాభర్తలుగా మీ బంధం తెగిపోయినా పాప తలిదండ్రులుగా మీ సంబంధం ఇంకా ఉంది. విడాకులు తీసుకున్న భార్య కూడా గృహ హింస చట్టం కింద బాధితురాలే. కనుక మీరు, పాపను చూడ్డానికి మీ మాజీ భర్త వచ్చినప్పుడు మిమ్మల్ని వేధిస్తున్నాడని, అటువంటి వేధింపుల నుంచి మీకు రక్షణ కల్పించమనీ కోర్టువారిని కోరండి. మీ సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని కోర్టు  తగిన ఆదేశాలు ఇస్తుంది. అతని వేధింపులను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి లేదా రికార్డ్ చేసి కోర్టువారి ముందు పెట్టండి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమస్యలనుండి బయట పడడానికి వాడుకోండి.

 


లీగల్ కౌన్సెలింగ్
ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్
ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement