అమెరికన్ రచయిత్రి, జర్నలిస్ట్ నాన్సీ గిబ్స్ ఇమోజీలపై తన ఇష్టాన్ని ఇలా ప్రకటించుకుంది... ‘నిఘంటువులలో పదాలు వ్యక్తీకరించలేని భావాలు, ఇమోజీలు అవలీలగా వ్యక్తీకరిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. బలం’ ఇమోజీ...అంటే ‘సరదా’ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం అవి సందేశ సారథులుగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. మహిళలకు సంబంధించిన సమస్యల నుంచి సాధికారత వరకు...భావ వ్యక్తీకరణకు ప్రపంచంలోని ఎన్నో సంస్థలు ఇమోజీలను వాడుకుంటున్నాయి...
కోవిడ్ సమయంలో...
మహిళలపై గృహహింస పెరిగిందని గణాంకాలు చెప్పాయి. మరొకరి నీడను కూడా చూసి భయపడుతున్న కాలంలో తమ గురించి ఆలోచించకుండా, భయపడకుండా మహిళలు సేవాపథంలో అగ్రగామిగా ఉన్నారు. పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్‌కేర్ వర్కర్స్ మూడు రెట్లు ఎక్కువ రిస్క్‌ను ఎదుర్కొన్నారు... ఇట్టి విషయాలను చెప్పుకునేందుకు పెద్ద వ్యాసాలు అక్కర్లేదని చెప్పడానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నించింది. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు రకాల ఇమోజీలను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది.
అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ‘గర్ల్ పవర్’ ‘జెండర్ ఈక్వాలిటీ’లపై ఇమోజీలు తీసుకువచ్చింది. యూనికోడ్ ఇమోజీ సబ్‌కమిటీ స్త్రీ సాధికారతను ప్రతిఫలించే, సాంకేతికరంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని సూచించే ఇమోజీలకు ప్రాధాన్యత ఇచ్చింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ‘ఎవ్రీ ఉమెన్’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రత్యేకమైన ఇమోజీని తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను వ్యతిరేకిస్తూ ‘జెనరేషన్ ఈక్వాలిటీ’ ‘16 డేస్’ ‘ఆరేంజ్ ది వరల్డ్’ ‘హ్యూమన్ రైట్స్ డే’ హ్యాష్‌ట్యాగ్‌లతో ఇమోజీలు తీసుకువచ్చింది.
చెప్పుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాంకేతిక సంస్థలు, సామాజిక సంస్థలు ఇమోజీలను బలమైన సందేశ వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ‘ఇమోజీ’ అనేది మేజర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్‌గా మారిన నేపథ్యంలో... గతంలోలాగా... ‘చక్కగా చెప్పారు’ ‘చక్కగా నవ్వించారు’ ‘ఏడుపొచ్చింది’... ఇలాంటి వాటికే ఇమోజీ పరిమితం కాదు. కాలంతో పాటు ఇమోజీ పరిధి విస్తృతమవుతూ వస్తోంది. అందులో భాగంగా సామాజిక కోణం వచ్చి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment