
భర్త ల్యాప్ టాప్ లాక్కున్నాడని..
తాను ఎనిమిదో తరగతిలో టాప్ మార్కులు తెచ్చుకోవడంతో లభించిన ల్యాప్ టాప్ అది. తాగుడు బానిస అయిన భర్త దానిని లాక్కొని అమ్మేందుకు ప్రయత్నించాడు. భార్యకు చాలా కోపం వచ్చింది. క్షణికావేశంలో తాగినమైకంలో ఉన్న భర్తను ఓ పెద్దరాయి తీసుకొని విసిరికొట్టింది. ఆ దెబ్బ గట్టిగా తలకు తగలడంతో భర్త వెంటనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని కనొటాలో గురువారం జరిగింది.
నిందితురాలికి 16 ఏళ్ల ప్రాయంలోనే హర్ఫుల్ (20) అనే వ్యక్తితో పెళ్లయింది. హర్ఫుల్ ఓ ఆటోమొబైల్ షో రూమ్ లో పనిచేస్తున్నాడు. హర్ఫుల్ తాగుబోతు కావడంతో అతనికి భార్యతో నిత్యం గొడవ జరిగేది. భార్యకు మూడేళ్ల కిందట ఎనిమిదో తరగతిలో టాప్ రావడంతో ల్యాప్ టాప్ బహుమతిగా లభించినది. ఆ అపురూపమైన బహుమతిని కూడా తాగుడు డబ్బుల కోసం అమ్మేందుకు హర్ఫుల్ ప్రయత్నించాడు. నువ్వు మూడేళ్ల కిందటే చదువు ఆపేశావు కనుక నీకు ల్యాప్ టాప్ తో అవసరం లేదని భార్యతో వాదించాడు. భార్యతో ఆ బహుమతిని వదులుకొనేందుకు సిద్ధపడలేదు.
ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భర్త తన మాట ఎంతకూ వినకపోవడంతో ఇంట్లో కుండలకు కుదురుగా ఉండేందుకు పెట్టే పెద్ద రాయిని తీసుకొని భార్య విసిరికొట్టింది. అది హర్ఫుల్ తలకు తగలడంతో అతను వెంటనే కుప్పకూలడు. భార్య తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు హర్ఫుల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై జైపూర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.