భర్తపై తప్పుడు ఫిర్యాదు.. రూ. లక్ష జరిమానా
గృహహింస చట్టం కింద తన భర్త, అత్తమామలపై తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఢిల్లీ కోర్టు ఓ మహిళకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆమె చట్టాలను దుర్వినియోగం చేసి, వ్యక్తిగత స్వార్థం కోసం అతడి నుంచి అన్యాయంగా డబ్బు దోచుకోవాలనుకుందని కోర్టు వ్యాఖ్యానించింది. దక్షిణ ఢిల్లీకి చెందిన సదరు మహిళ ఈ మేరకు చేసిన ఫిర్యాదును మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ డిస్మిస్ చేశారు. తన అత్తమామలను వేధించేందుకు వాస్తవాలను తొక్కిపెట్టి, తప్పుడు ఫిర్యాదులు చేసిందని చెప్పారు.
సాధారణంగా మహిళలు గృహహింసకు బాధితులు అవుతుంటారని, గృహహింస నిరోధక చట్టం కూడా మహిళలకు దీన్నుంచి రక్షణ కల్పించడానికే ఉద్దేశించారని మేజిస్ట్రేట్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ కేసులో మాత్రం ఫిర్యాదుచేసిన మహిళ దీన్ని దుర్వినియోగం చేసి, అనేక అబద్ధాలతో తన ఫిర్యాదును దాఖలు చేశారన్నారు. లక్ష రూపాయల భారీ జరిమానా విధించేందుకు ఈ కేసు తగినదేనని మేజిస్ట్రేట్ చెప్పారు. ఆమె నుంచి వసూలుచేసే లక్ష రూపాయలను 'బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్' ఖాతాలో జమచేయాలని ఆదేశించారు. ఈ జరిమానా భవిష్యత్తులో మరెవ్వరూ ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేయకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందని ఆమె అన్నారు.