false complaint
-
సెల్‌ఫోన్ ఫ్రాడ్ కేసులో బ్రిటన్ మంత్రి రాజీనామా
లండన్: సెల్‌ఫోన్ చోరీకి గురైందంటూ దశాబ్దం క్రితం తప్పుడు ఫిర్యాదు చేసిన కేసులో యూకే రవాణా శాఖ మంత్రి లూయీజ్ హే(37) శుక్రవారం పదవికి రాజీనామా చేశారు. 2013లో లూయాజ్ను గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. తను పోగొట్టుకున్న వాటిలో సెల్‌ఫోన్ కూడా ఉందంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె సెల్‌ఫోన్ దొరికింది. దీనిపై పోలీసుల విచారణలో ఆమె..దోపిడీకి గురైనవాటిలో మొబైల్ ఉందంటూ పొరపాటున ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కోర్టులో కూడా ఆమె తన తప్పిదాన్ని అంగీకరించారు. మొదటి తప్పుగా భావించి కోర్టు ఆమెను విడుదల చేసింది. రవాణా మంత్రి లూయీజ్ ఫ్రాడ్ చేసినట్లుగా మీడియాలో వార్తలు రావడంతో లాయర్ సలహా మేరకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాజా పరిస్థితుల్లో రాజీనామా చేయడమే ఉత్తమమని భావిస్తున్నానని, ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు కొనసాగిస్తానని ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌కు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఎంపీగా షెఫీల్డ్ నుంచి లూయీజ్ హే ఎన్నికయ్యారు. -
ఫిర్యాదుదారే తప్పుడు సాక్ష్యం ఇస్తారా?
సాక్షి, అమరావతి: ఓ అధికారి తన నుంచి లంచం తీసుకున్నారంటూ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తే, అందుకు విరుద్ధంగా సాక్ష్యం (హోస్టైల్) చెప్పడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ వ్యక్తి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఐపీసీ సెక్షన్లు 191, 193 కింద ప్రాసిక్యూట్ చేయాలని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ మేరకు అతడిపై విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు మూడు వారాల్లోగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించింద కాగా అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 7, సెక్షన్ 13(1)(డీ), 13(2) కింద అధికారికి ఏసీబీ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు సవరించింది. సెక్షన్ 7 కింద లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే సరిపోదని, అధికారిని పట్టుకున్న తేదీకి ముందు, లేదా ఆ పట్టుకున్న రోజుకు, ఫిర్యాదుదారుకు సంబంధించి అధికారికంగా మేలు (అఫీషియల్ ఫేవర్) అన్నది పెండింగ్‌లో ఉండాలంది. అయితే సదరు అధికారిని పట్టుకునే రోజుకు ఫిర్యాదుదారు విషయంలో అధికారిక మేలనేది పెండింగ్‌లో ఉన్నట్లు ఏసీబీ నిరూపించలేదని, అందువల్ల సెక్షన్ 7 వర్తించదని తేల్చిచెప్పింది. అందువల్ల సెక్షన్ 7 కింద అధికారికి ఏసీబీ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ నేపథ్యం... ఎస్.చంద్రశేఖర్ 2003 వరకు మచిలీపట్నం పురపాలక కార్యాలయంలో శానిటరీ అండ్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ తనను రూ.5 వేలు లంచం అడిగారంటూ ఎం.మురళీధర్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్‌ను ఏసీబీ పట్టుకుంది. ఆయనపై పీసీ యాక్ట్‌లోని సెక్షన్ 7, సెక్షన్ 13(1)(డీ), 13(2) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు అయిన మురళీధర్‌ను కూడా కోర్టు విచారించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌పై తాను చేసిన ఆరోపణలన్నీ తప్పని మురళీధర్ సాక్ష్యం చెప్పారు. అందరినీ విచారించిన అనంతరం ఏసీబీ కోర్టు చంద్రశేఖర్‌కు సెక్షన్ 7 కింద ఏడాది సాధారణ జైలుశిక్ష, రూ.1,000 జరిమానా, సెక్షన్ 13 కింద ఏడాది జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ 2007లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ చంద్రశేఖర్ అదే ఏడాది హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ముందు తుది విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు తప్పుడు సాక్ష్యం చెప్పారని ఆయనకు తెలిసింది. ఇలా చేసినందుకు ఫిర్యాదుదారు అయిన మురళీధర్‌పై ఏసీబీ కోర్టు.. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసి ఉండాల్సిందని న్యాయమూర్తి తన తీర్పులో అభిప్రాయపడ్డారు. తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఫిర్యాదుదారు ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పారు. -
ఇట్లు.. ఆకాశరామన్న!.. రెండేళ్లలో 120 తప్పుడు ఫిర్యాదులు
సాక్షి, హన్మకొండ: ఎన్పీడీసీఎల్లో ఊరు, పేరు లేకుండా ఫిర్యాదు అందుతుం ది. ఆపై ఉన్నతాధికారులు స్పందిస్తారు. విచారణ చేపడతారు. దీంతో ఉద్యోగులు బెం బేలెత్తిపోతున్నారు. అలాంటి ఫిర్యాదులను పరిశీలనకు, విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని సెంట్రల్ విజిలెన్స్, స్టేట్ విజిలెన్స్ ఆదేశాలున్నా యి. అయినా కొందరు అధికారులు అత్యుత్సాహంతో విచారిస్తున్నారు. అవసరం లేకున్నా విచారణకు పిలుస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో రెండేళ్లలో 120 తప్పుడు ఫిర్యాదులు అందాయి. చదవండి: (అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం) ఉద్యోగినులకు సంబంధాలు అంటగడుతూ.. టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 జిల్లాల్లో తప్పుడు లేఖలు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. చివరికి మహిళా ఉద్యోగులకు వివాహేతర సంబంధాలు అంటగట్టే స్థాయికి దిగజారారు. ప్రస్తుతం ఆకాశరామన్న ఉత్తరాలు టీఎస్ ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు, అధికారుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా టీఎస్ ఎన్పీడీసీఎల్లోని యాంటీ పవర్ థెఫ్ట్ స్టేషన్ (ఏపీటీఎస్) అండ్ విజిలెన్స్ విభాగం అధికారులు తప్పుడు ఫిర్యాదులను అత్యుత్సాహంగా విచారిస్తుండటంతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. కాసుల కోసమేనా? ఖమ్మం జిల్లా (సర్కిల్)లో డిప్యుటేషన్‌పై పోలీస్ శాఖ నుంచి వచ్చి ఇటీవల బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి తప్పుడు ఫిర్యాదులను ఆసరాగా తీసుకొని బాధితులపై విచారణ చేపట్టినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. వారిని బెదిరించి అక్రమార్జనకు పాల్పడ్డారని విద్యుత్ ఉద్యోగుల నుంచి ఆరోపణలున్నాయి. ఖమ్మం జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయి ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో ఫిర్యాదు చేసుకోవడం పరిపాటైందని ఉద్యోగులు వాపోతున్నారు. ఫిర్యాదులపై పట్టించుకోవద్దని ఆదేశాలున్నా.. ఇలాంటి ఫిర్యాదులను పట్టించుకోవద్దని సెంట్రల్ విజిలెన్స్ ఆదేశించింది. కోర్టు తీర్పులనూ ఉదహరించింది. అయినప్పటికీ కొందరు అధికారులు అత్యుత్సాహం చూపుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు వాపోతున్నారు. -
భార్యపై అత్యాచారం జరిగిందన్నాడు.. కానీ
నోయిడా : పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తి అరెస్ట్ అయిన ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫేస్ 2 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇలహాబాస్ గ్రామానికి చెందిన నరేశ్ సింగ్ బుధవారం పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. తన భార్యపై దుండగులు అత్యాచారం జరిపి, హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అదంతా నిజం కాదని గుర్తించారు. తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు గాను అతన్ని అరెస్ట్ చేశారు. ‘ఉదయం 5 గంటలకు మా ఎమర్జెన్సీ నెంబర్ 100 ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ తన భార్యపై దుండగులు అత్యాచారం చేసి, హత్య చేశారని తెలిపాడు. దీంతో ప్రత్యేక పోలీసు బృందంతో అతను చెప్పిన ప్రదేశానికి వెళ్లాం. తీరా అతని ఇంటికి వెళ్లాక అక్కడ అలాంటిదేమీ జరగలేదని.. అంతా సక్రమంగానే ఉందని గుర్తించాం. ఆ సమయంలో అతని భార్య కూడా అక్కడే ఉన్నారు. ఆమె క్షేమంగానే ఉన్నార’ ని ఓ పోలీసు అధికారి తెలిపారు. -
40 లక్షలు పోయాయంటే.. 2.60 కోట్లు దొరికాయ్..
ఇంట్లో దాచిన సొమ్ము చోరీకి గురైనట్టుగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు నాటకీయ పరిణామాల మధ్య విచారణను ముందుకు తీసుకెళ్లింది. పోగట్టుకున్నదని రూ.40 లక్షలు అని బాధితుడు పేర్కొనగా, చివరకు రూ.2.60 కోట్లు బాక్స్‌లో చిక్కడం పోలీసుల్ని విస్మయంలో పడేసింది. విదేశీ కరెన్సీ సైతం ఉండడంతో ఇది హవాలా సొమ్ముగా పోలీసులు తేల్చారు. విచారణను ముమ్మరం చేశారు. శివగంగై జిల్లా కారైక్కుడిలో ఈ ఘటన వెలుగు చూసింది. సాక్షి, చెన్నై : శివగంగై జిల్లా కారైక్కుడి గాంధీపురం రెండో వీధికి చెందిన సుబ్రమణియన్ (47) స్థానికంగా విదేశీ బ్రాండ్ వస్తువుల విక్రయ దుకాణం నడుపుతున్నాడు. గత వారం సుబ్రమణియ పురంలోని చిన్నమ్మ సీతాలక్ష్మి ఇంట్లో ఓ అట్ట పెట్టె బాక్స్‌ను ఉంచి వచ్చాడు. గురువారం ఆ బాక్స్‌ను తీసుకునేందుకు సుబ్రమణియన్ వచ్చాడు. అయితే, అందులో ఉప్పు ప్యాకెట్లు ఉండడంతో ఆందోళనలో పడ్డారు. చిన్నమ్మను ప్రశ్నించగా, డ్రైవర్ నారాయణ మీద అనుమానం వ్యక్తంచేశారు. రూ.40 లక్షలు చోరీగా ఫిర్యాదు ఆ బాక్స్‌లో రూ.40 లక్షలు నగదు ఉన్నట్టు, ఇది తన కుమార్తె వైద్య విద్యా కోర్సుల నిమిత్తం దాచి పెట్టి ఉన్నట్టుగా పేర్కొంటూ కారైక్కుడి డీఎస్పీ కార్తికేయన్‌ను సుబ్రమణియన్ ఆశ్రయించాడు. దీంతో ఇన్స్పెక్టర్ దేవకీ, ఎస్ఐ అరవింద్‌కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. నారాయణను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ బాక్స్‌ను తానే అపహరించినట్టు అంగీకరించాడు. అయితే, అందులో ఏమున్నదో తనకు తెలియదు అని, దానిని సుబ్రమణియన్ రహస్యంగా తీసుకొచ్చి పెట్టడంతో అపహరించినట్టు పేర్కొన్నాడు. ఆ బాక్స్‌ను విరుదునగర్ కార్యపట్టిలో ఉన్న బంధువు సెల్వరాజ్ ఇంట్లో దాచి పెట్టినట్టు తెలిపాడు. దీంతో పోలీసులు అక్కడికి పరుగులు తీశారు. సెల్వరాజ్ ఆ బాక్స్‌ను రామనాథపురంలోని తన స్నేహితుడు శేఖర్ ఇంట్లో దాచిపెట్టి ఉండడం వెలుగుచూసింది. శివగంగై జిల్లా నుంచి విరుదునగర్ జిల్లాకు, ఆతదుపరి రామనాథపురం జిల్లా రామనాథపురానికి పోలీసులు పరుగులు తీశారు. శనివారం ఉదయాన్నే శేఖర్ ఇంట్లో సోదాలు జరిపారు. అక్కడ ఆ బాక్స్ లభించింది. ఇంతవరకు విచారణ, దర్యాప్తు సక్రమంగానే సాగినా, ఆ బాక్స్‌లో ఉన్న నగదును చూసిన పోలీసులు విస్మయానికి గురయ్యారు. సుబ్రమణియన్ పేర్కొన్నట్టుగా అందులో రూ.40 లక్షలు కాదు, ఏకంగా రూ.2.60 కోట్లు బయటపడింది. ఇందులో రెండు కోట్లు ఇండియన్ కరెన్సీ కాగా, రూ. 60 లక్షలు విదేశీ నగదు ఉండడంతో అనుమానాలు బయలు దేరాయి. ఆ నగదుతో పాటు నారాయణ, సెల్వరాజ్, శేఖర్‌లను అదుపులోకి తీసుకున్నారు. సుబ్రమణియన్‌ను కారైక్కుడి స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. పోగొట్టుకున్నది రూ.40 లక్షలు అయితే, అందులో రూ.2.60 కోట్లు ఎలా వచ్చినట్టు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. తాము ఆ బాక్స్‌ను తెరచి చూడలేదని నిందితులు ముగ్గురూ పేర్కొంటుండడంతో సుబ్రమణియన్ మీద అనుమానాలు బయలుదేరాయి. విచారణలో సుబ్రమణియన్ హవాలా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. తరచూ విదేశాలకు వెళ్లి వస్తున్న ఇతగాడు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడి చట్ట విరుద్ధంగా నగదు తరలిస్తున్నట్టు తేలింది. అయితే, అంత పెద్ద మొత్తానికి వాటాదారులు మరెందరో ఉండవచ్చనే భావనతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
ఓ విద్యార్థిని ప్రేమ నాటకం
చెన్నై: ప్రేమించిన విద్యార్థి మాట్లాడడం లేదనే కోపంతో.. ముగ్గురు విద్యార్థులు కత్తితో గాయపరిచారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ విద్యార్థిని నాటకం బయటపడింది. చెన్నై, పురసైవాక్కంలోని ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్న ఓ అమ్మాయి.. తనను ప్లస్‌టూ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కత్తితో పొడిచినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయిని ముగ్గురు విద్యార్థులు ప్రేమించారని, ప్రేమ విషయంలో వారి మధ్య గొడవ జరిగిందని, పాఠశాలకు వెళుతున్న సమయంలో ముగ్గురు కలసి.. ఆమెను అడ్డుకుని కత్తితో దాడి చేసినట్టు వార్తలు రావడం సంచలనం కలిగించింది. ఇన్స్పెక్టర్ ప్రభు ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టారు. విద్యార్థిని కుడి చేతిపై ఉన్న గాయాన్ని పరిశీలించిన వైద్యులు.. ఎవరో చేసిన గాయం కాదని, హెయిర్పిన్లో గీచుకున్నట్టు ఉందని తెలిపారు. దీంతో గురువారం పోలీసులు.. విద్యార్థినిని ఆమె చదువుతున్న పాఠశాలకు తీసుకెళ్లి విచారించారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. తాను ఓ విద్యార్థిని ప్రేమిస్తున్నానని, కొన్ని నెలలుగా ఆ అబ్బాయి మాట్లాడకపోవడంతో కక్ష సాధింపు కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పింది. హెయిర్ పిన్‌తో తన చేతిని గాయపరచుకుని నాటకం ఆడినట్టు ఒప్పుకుంది. పోలీసులు ఆ విద్యార్థిని మందలించి పంపారు. -
భర్తపై తప్పుడు ఫిర్యాదు.. రూ. లక్ష జరిమానా
గృహహింస చట్టం కింద తన భర్త, అత్తమామలపై తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఢిల్లీ కోర్టు ఓ మహిళకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆమె చట్టాలను దుర్వినియోగం చేసి, వ్యక్తిగత స్వార్థం కోసం అతడి నుంచి అన్యాయంగా డబ్బు దోచుకోవాలనుకుందని కోర్టు వ్యాఖ్యానించింది. దక్షిణ ఢిల్లీకి చెందిన సదరు మహిళ ఈ మేరకు చేసిన ఫిర్యాదును మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ డిస్మిస్ చేశారు. తన అత్తమామలను వేధించేందుకు వాస్తవాలను తొక్కిపెట్టి, తప్పుడు ఫిర్యాదులు చేసిందని చెప్పారు. సాధారణంగా మహిళలు గృహహింసకు బాధితులు అవుతుంటారని, గృహహింస నిరోధక చట్టం కూడా మహిళలకు దీన్నుంచి రక్షణ కల్పించడానికే ఉద్దేశించారని మేజిస్ట్రేట్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ కేసులో మాత్రం ఫిర్యాదుచేసిన మహిళ దీన్ని దుర్వినియోగం చేసి, అనేక అబద్ధాలతో తన ఫిర్యాదును దాఖలు చేశారన్నారు. లక్ష రూపాయల భారీ జరిమానా విధించేందుకు ఈ కేసు తగినదేనని మేజిస్ట్రేట్ చెప్పారు. ఆమె నుంచి వసూలుచేసే లక్ష రూపాయలను 'బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్' ఖాతాలో జమచేయాలని ఆదేశించారు. ఈ జరిమానా భవిష్యత్తులో మరెవ్వరూ ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేయకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందని ఆమె అన్నారు.