సాక్షి, అమరావతి: ఓ అధికారి తన నుంచి లంచం తీసుకున్నారంటూ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తే, అందుకు విరుద్ధంగా సాక్ష్యం (హోస్టైల్) చెప్పడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ వ్యక్తి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఐపీసీ సెక్షన్లు 191, 193 కింద ప్రాసిక్యూట్ చేయాలని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ మేరకు అతడిపై విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్కు మూడు వారాల్లోగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించింద
కాగా అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 7, సెక్షన్ 13(1)(డీ), 13(2) కింద అధికారికి ఏసీబీ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు సవరించింది. సెక్షన్ 7 కింద లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే సరిపోదని, అధికారిని పట్టుకున్న తేదీకి ముందు, లేదా ఆ పట్టుకున్న రోజుకు, ఫిర్యాదుదారుకు సంబంధించి అధికారికంగా మేలు (అఫీషియల్ ఫేవర్) అన్నది పెండింగ్‌లో ఉండాలంది.
అయితే సదరు అధికారిని పట్టుకునే రోజుకు ఫిర్యాదుదారు విషయంలో అధికారిక మేలనేది పెండింగ్‌లో ఉన్నట్లు ఏసీబీ నిరూపించలేదని, అందువల్ల సెక్షన్ 7 వర్తించదని తేల్చిచెప్పింది. అందువల్ల సెక్షన్ 7 కింద అధికారికి ఏసీబీ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు ఇటీవల తీర్పు వెలువరించారు.
ఇదీ నేపథ్యం...
ఎస్.చంద్రశేఖర్ 2003 వరకు మచిలీపట్నం పురపాలక కార్యాలయంలో శానిటరీ అండ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ తనను రూ.5 వేలు లంచం అడిగారంటూ ఎం.మురళీధర్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్‌ను ఏసీబీ పట్టుకుంది. ఆయనపై పీసీ యాక్ట్‌లోని సెక్షన్ 7, సెక్షన్ 13(1)(డీ), 13(2) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు అయిన మురళీధర్‌ను కూడా కోర్టు విచారించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌పై తాను చేసిన ఆరోపణలన్నీ తప్పని మురళీధర్ సాక్ష్యం చెప్పారు.
అందరినీ విచారించిన అనంతరం ఏసీబీ కోర్టు చంద్రశేఖర్‌కు సెక్షన్ 7 కింద ఏడాది సాధారణ జైలుశిక్ష, రూ.1,000 జరిమానా, సెక్షన్ 13 కింద ఏడాది జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ 2007లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ చంద్రశేఖర్ అదే ఏడాది హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ముందు తుది విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు తప్పుడు సాక్ష్యం చెప్పారని ఆయనకు తెలిసింది. ఇలా చేసినందుకు ఫిర్యాదుదారు అయిన మురళీధర్‌పై ఏసీబీ కోర్టు.. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసి ఉండాల్సిందని న్యాయమూర్తి తన తీర్పులో అభిప్రాయపడ్డారు. తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఫిర్యాదుదారు ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment