ప్రతీకాత్మక చిత్రం
ఇంట్లో దాచిన సొమ్ము చోరీకి గురైనట్టుగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు నాటకీయ పరిణామాల మధ్య విచారణను ముందుకు తీసుకెళ్లింది. పోగట్టుకున్నదని రూ.40 లక్షలు అని బాధితుడు పేర్కొనగా, చివరకు రూ.2.60 కోట్లు బాక్స్‌లో చిక్కడం పోలీసుల్ని విస్మయంలో పడేసింది. విదేశీ కరెన్సీ సైతం ఉండడంతో ఇది హవాలా సొమ్ముగా పోలీసులు తేల్చారు. విచారణను ముమ్మరం చేశారు. శివగంగై జిల్లా కారైక్కుడిలో ఈ ఘటన వెలుగు చూసింది.
సాక్షి, చెన్నై : శివగంగై జిల్లా కారైక్కుడి గాంధీపురం రెండో వీధికి చెందిన సుబ్రమణియన్ (47) స్థానికంగా విదేశీ బ్రాండ్ వస్తువుల విక్రయ దుకాణం నడుపుతున్నాడు. గత వారం సుబ్రమణియ పురంలోని చిన్నమ్మ సీతాలక్ష్మి ఇంట్లో ఓ అట్ట పెట్టె బాక్స్‌ను ఉంచి వచ్చాడు. గురువారం ఆ బాక్స్‌ను తీసుకునేందుకు సుబ్రమణియన్ వచ్చాడు. అయితే, అందులో ఉప్పు ప్యాకెట్లు ఉండడంతో ఆందోళనలో పడ్డారు. చిన్నమ్మను ప్రశ్నించగా, డ్రైవర్ నారాయణ మీద అనుమానం వ్యక్తంచేశారు.
రూ.40 లక్షలు చోరీగా ఫిర్యాదు
ఆ బాక్స్‌లో రూ.40 లక్షలు నగదు ఉన్నట్టు, ఇది తన కుమార్తె వైద్య విద్యా కోర్సుల నిమిత్తం దాచి పెట్టి ఉన్నట్టుగా పేర్కొంటూ కారైక్కుడి డీఎస్పీ కార్తికేయన్‌ను సుబ్రమణియన్ ఆశ్రయించాడు. దీంతో ఇన్‌స్పెక్టర్ దేవకీ, ఎస్‌ఐ అరవింద్‌కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. నారాయణను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ బాక్స్‌ను తానే అపహరించినట్టు అంగీకరించాడు. అయితే, అందులో ఏమున్నదో తనకు తెలియదు అని, దానిని సుబ్రమణియన్ రహస్యంగా తీసుకొచ్చి పెట్టడంతో అపహరించినట్టు పేర్కొన్నాడు. ఆ బాక్స్‌ను విరుదునగర్ కార్యపట్టిలో ఉన్న బంధువు సెల్వరాజ్ ఇంట్లో దాచి పెట్టినట్టు తెలిపాడు. దీంతో పోలీసులు అక్కడికి పరుగులు తీశారు. సెల్వరాజ్ ఆ బాక్స్‌ను రామనాథపురంలోని తన స్నేహితుడు శేఖర్ ఇంట్లో దాచిపెట్టి ఉండడం వెలుగుచూసింది. శివగంగై జిల్లా నుంచి
విరుదునగర్ జిల్లాకు, ఆతదుపరి రామనాథపురం జిల్లా రామనాథపురానికి పోలీసులు పరుగులు తీశారు. శనివారం ఉదయాన్నే శేఖర్ ఇంట్లో సోదాలు జరిపారు. అక్కడ ఆ బాక్స్ లభించింది. ఇంతవరకు విచారణ, దర్యాప్తు సక్రమంగానే సాగినా, ఆ బాక్స్‌లో ఉన్న నగదును చూసిన పోలీసులు విస్మయానికి గురయ్యారు. సుబ్రమణియన్ పేర్కొన్నట్టుగా అందులో రూ.40 లక్షలు కాదు, ఏకంగా రూ.2.60 కోట్లు బయటపడింది. ఇందులో రెండు కోట్లు ఇండియన్ కరెన్సీ కాగా, రూ. 60 లక్షలు విదేశీ నగదు ఉండడంతో అనుమానాలు బయలు దేరాయి. ఆ నగదుతో పాటు నారాయణ, సెల్వరాజ్, శేఖర్‌లను అదుపులోకి తీసుకున్నారు. సుబ్రమణియన్‌ను కారైక్కుడి స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు.
పోగొట్టుకున్నది రూ.40 లక్షలు అయితే, అందులో రూ.2.60 కోట్లు ఎలా వచ్చినట్టు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. తాము ఆ బాక్స్‌ను తెరచి చూడలేదని నిందితులు ముగ్గురూ పేర్కొంటుండడంతో సుబ్రమణియన్ మీద అనుమానాలు బయలుదేరాయి. విచారణలో సుబ్రమణియన్ హవాలా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. తరచూ విదేశాలకు వెళ్లి వస్తున్న ఇతగాడు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడి చట్ట విరుద్ధంగా నగదు తరలిస్తున్నట్టు తేలింది. అయితే, అంత పెద్ద మొత్తానికి వాటాదారులు మరెందరో ఉండవచ్చనే భావనతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment