one lakh fine
-
ఆ ఒక్క బిస్కెట్ విలువ రూ.1 లక్ష !
తిరువల్లూర్(తమిళనాడు): చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ఒక బిస్కెట్ మిస్సయింది. ప్యాకెట్లో లేని ఆ ఒక్క బిస్కెట్ విలువ ఎంత ఉంటుంది?. నిజానికి అదేం బంగారు బిస్కెట్ కాదు కాబట్టి దాని విలువ చాలా తక్కువే ఉంటుంది. కానీ ఆ ఒక్క బిస్కెట్ కోసం ఐటీసీ ఫుడ్స్ వారు రూ.1 లక్ష జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏమిటీ బిస్కెట్ బాగోతం అనేగా మీ సందేహం. వివరాల్లోకి వెళ్తే అంతా తెలుస్తుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో పి.దిల్లిబాబు అనే వ్యక్తి ఇటీవల సన్‌ఫీస్ట్ మ్యారీ లైట్ అనే బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. ‘ఈ ప్యాకెట్లో 16 బిస్కెట్లు ఉంటాయి’ ఆ ప్యాకెట్ రేపర్‌పై ఉంది. అది చూసిన దిల్లిబాబు సరదాకి ప్యాకెట్లోని బిస్కెట్లు లెక్కించాడు. ఒక బిస్కెట్ లెక్క తగ్గింది. తప్పుడు ప్రచారం చేస్తూ కంపెనీ మోసం చేస్తోందంటూ నేరుగా ఆయన తిరువల్లూర్ జిల్లా వినియోగదారుల ఫోరమ్ వద్దకెళ్లి కేసు వేశారు. ప్యాకెట్‌ను తయారుచేసిన ఐటీసీ ఫుడ్స్ సంస్థపై రూ.100 కోట్ల పెనాల్టీ వేయాలని కోరారు. సరైన వ్యాపార విధానాలు అవలంభించని కారణంగా రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో సేవా లోపాన్ని ఎత్తిచూపారు. ప్యాకెట్‌ను బరువు ఆధారంగా విక్రయిస్తామేగానీ అందులో ఉన్న బిస్కెట్ల సంఖ్యను బట్టి కాదు అంటూ తయారీసంస్థ చేసిన వాదనలను వినియోగదారుల ఫోరమ్ పట్టించుకోలేదు. ‘ రేపర్‌పై ఉండే సమాచారంతో సంతృప్తి చెందిన వినియోగదారులే ఆయా వస్తువులను కొంటారు. బరువును చూసి కాదు ఇందులోని బిస్కెట్ల సంఖ్యను చూసే కొనండి అని రేపర్‌పై ప్రత్యేకంగా ముద్రించి ఉంది’ అంటూ కోర్టు గుర్తుచేసింది. వినియోగదారునికి రూ.1 లక్ష నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు అందించాలని సూచించింది. -
కోర్టులో ఓ మూలన కూర్చోండి
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ఓ అధికారిని బదిలీ చేసిన ఘటనలో కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే ఒక మూలన కూర్చోవాలంటూ ఆదేశించింది. అంతేకాదు సాయంత్రం కోర్టు సమయం ముగియక ముందే మరోసారి వెళ్లేందుకు అనుమతి అడగ్గా.. రేపటి వరకూ కోర్టులోనే ఉంటారా.. అంటూ ఆగ్రహించింది. బిహార్‌లోని వసతిగృహాల్లో బాలికలపై లైంగిక దాడికి సంబంధించిన ఘటనలపై విచారణ జరుపుతున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మను అప్పటి సీబీఐ డైరెక్టర్ అయిన ఎం.నాగేశ్వరరావు బదిలీ చేశారు. అయితే ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమి తులైన సమయంలోనే ఎటువంటి బదిలీలు చేయడానికి వీల్లేదని కోర్టు అప్పట్లో పేర్కొంది. అయితే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఆయన బదిలీ చేశారు. దీనికి సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టులో సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు తమ ఉత్తర్వులను ధిక్కరించారని, ఇందుకు గాను ఆయనకు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. నాగేశ్వరరావుతోపాటు సీబీఐ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరాం కూడా దోషేనని పేర్కొంటూ ఆయనకూ జరిమానా విధించింది. అలాగే కోర్టు సమయం పూర్తయ్యే వరకు కోర్టు ప్రాంగణంలోనే ఓ మూలన కూర్చోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎల్ఎన్ రావు, సంజీవ్ కన్నాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు వారిరువురు సుప్రీం కోర్టుకు చెప్పిన క్షమాపణలను సైతం న్యాయస్ధానం తోసిపుచ్చింది. కోర్టుకు ఏదైనా చెప్పుకునే అవకాశం ఇస్తామని, అయితే దీనికోసం వారు 30 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చని అని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ఏమైనా చెబుతారా అంటూ వారిద్దరిని ప్రశ్నించింది. ఈ సమయంలో సీబీఐ తరఫున వాదిస్తున్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయలేదని, ఇందుకు ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పినట్లు ఆయన న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కోర్టు అనుమతి లేకుండా విచారణ అధికారిని బదిలీ చేయకూడదని నాగేశ్వరరావుకి తెలుసని, తాను ఏది అనుకున్నానో అదే చేశాను అనేలా ఆయన ధోరణి ఉందని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సాయంత్రం వరకూ కోర్టులోనే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అదనపు డైరెక్టర్ నాగేశ్వరరావు, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరామ్‌లు సాయంత్రం కోర్టు వేళలు ముగిసే వరకు కోర్టులోనే గడిపారు. అనంతరం కోర్టు నుంచి వెళ్లి పోయారు. -
ఎయిమ్స్‌లోనూ చికిత్సాలోపం.. లక్ష జరిమానా
ఏదో చిన్నా చితకా ఆస్పత్రులలో వైద్యసేవల లోపం జరిగిందంటే అనుకోవచ్చు.. ఎయిమ్స్ లాంటి పెద్ద ఆస్పత్రిలో కూడా అదే తంతు అని తేలింది. ఓ బాలిక కార్నియా ఆపరేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమె తల్లిదండ్రులకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని ఎయిమ్స్‌ను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. హర్యానాకు చెందిన ప్రియాంకకు మూడుసార్లు కార్నియా గ్రాఫ్టింగ్ చేశారు. కానీ మూడూ ఫెయిలయ్యాయి. తగినంత జాగ్రత్తలు తీసుకోకుండా ఆపరేషన్లు చేయడం వల్లే ఇలా జరిగిందని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్ తేల్చింది. ఇందుకు గాను బాలిక తల్లిదండ్రులకు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 1998 నుంచి 2001 వరకు మూడు సార్లుగా ప్రియాంకకు ఎయిమ్స్‌లో కార్నియా గ్రాఫ్టింగ్ చేశారు. అయితే తమ వైద్యంలో ఎలాంటి లోపం లేదంటూ ఎయిమ్స్ వాదించింది. -
సారా తయారీ కేసులో లక్ష జరిమానా
సంగారెడ్డి (మెదక్) : సారా తయారీ, విక్రయం కేసులో బైండోవర్ చేసిన నిందితుల్లో ముగ్గురికి ఎక్సైజ్ అధికారులు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు. అందులో ఓ నిందితుడు లక్ష రూపాయల మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించినట్టు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సంగారెడ్డి సూపరింటెండెంట్ కె.రఘురాం తెలిపారు. ఇప్పటివరకు సారా విక్రయం, తయారీ కేసులో ఇంత పెద్ద మొత్తం జరిమానా విధించి చెల్లించడం రాష్ట్రంలోనే ఇదే ప్రథమం. సంగారెడ్డి ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఎస్ మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. సారా తయారీ, విక్రయం పెద్ద ఎత్తున జరిపిన నేపథ్యంలో నిందితులను తహశీల్దార్ల ఎదుట బైండోవర్ చేస్తారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించగా ఇద్దరు చెల్లిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. కాగా చిన్నశంకరంపేట మండలం సంకాపూర్ తండాకు చెందిన లంబాడి నింబ్యా(45) అనే వ్యక్తి జరిమానా చెల్లించకపోవడంతో అతనికి ఏడాదిపాటు జైలు శిక్షను అధికారులు ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు నిందితుల్లో రేగోడ్ మండలం గజివాడ తండాకు పాల్టి గురునాథ్ లక్ష రూపాయల జరిమానాను ప్రభుత్వానికి చెల్లించినట్టు సంగారెడ్డి ఈఎస్ కె.రఘురాం తెలిపారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ సారా తయారు చేసినా, విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
భర్తపై తప్పుడు ఫిర్యాదు.. రూ. లక్ష జరిమానా
గృహహింస చట్టం కింద తన భర్త, అత్తమామలపై తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఢిల్లీ కోర్టు ఓ మహిళకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆమె చట్టాలను దుర్వినియోగం చేసి, వ్యక్తిగత స్వార్థం కోసం అతడి నుంచి అన్యాయంగా డబ్బు దోచుకోవాలనుకుందని కోర్టు వ్యాఖ్యానించింది. దక్షిణ ఢిల్లీకి చెందిన సదరు మహిళ ఈ మేరకు చేసిన ఫిర్యాదును మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ డిస్మిస్ చేశారు. తన అత్తమామలను వేధించేందుకు వాస్తవాలను తొక్కిపెట్టి, తప్పుడు ఫిర్యాదులు చేసిందని చెప్పారు. సాధారణంగా మహిళలు గృహహింసకు బాధితులు అవుతుంటారని, గృహహింస నిరోధక చట్టం కూడా మహిళలకు దీన్నుంచి రక్షణ కల్పించడానికే ఉద్దేశించారని మేజిస్ట్రేట్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ కేసులో మాత్రం ఫిర్యాదుచేసిన మహిళ దీన్ని దుర్వినియోగం చేసి, అనేక అబద్ధాలతో తన ఫిర్యాదును దాఖలు చేశారన్నారు. లక్ష రూపాయల భారీ జరిమానా విధించేందుకు ఈ కేసు తగినదేనని మేజిస్ట్రేట్ చెప్పారు. ఆమె నుంచి వసూలుచేసే లక్ష రూపాయలను 'బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్' ఖాతాలో జమచేయాలని ఆదేశించారు. ఈ జరిమానా భవిష్యత్తులో మరెవ్వరూ ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేయకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. -
రైల్లో శాకాహారంలో ఎముకలు.. లక్ష జరిమానా!!
దూరప్రయాణాలు చేయడానికి రాజధాని లాంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లయితే బాగుంటుందని అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే, గువాహటి వెళ్లే రాజధాని రైల్లో ఇచ్చిన శాకాహార భోజనంలో ఎముక ముక్కలు కనిపించాయి. తికమ్ చంద్ జైన్ (65) తరచు రాజధానిలో వెళ్తుంటారు. ఆయన సెప్టెంబర్ 19న ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కి, అక్కడ తర్వాతి రోజుకు శాకాహారం కావాలని ఆర్డర్ ఇచ్చారు. కానీ, తనకు ఇచ్చిన కూరలో ఎక్కడో ఎముకలు వచ్చినట్లు అనుమానం వచ్చింది. తీరా చూస్తే నిజంగానే అందులో ఎముకలున్నాయి. దీంతో కేటరింగ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసి, ప్రధాన కార్యాలయానికి కూడా లిఖిత పూర్వక ఫిర్యాదు పంపారు. దాంతో ఆ రైల్లో కేటరింగ్ చేస్తున్న బృందావన్ ఫుడ్ వారికి రైల్వేశాఖ లక్ష రూపాయల జరిమానా విధించింది. దాంతోపాటు ఫిర్యాదును చాలా సీరియస్‌గా పరిగణించారు. ఇంతకుముందు గోవా ఎక్స్‌ప్రెస్‌లో సూప్‌లో బొద్దింక వచ్చింది. ఆ కేసులోనూ కేటరర్కు లక్ష రూపాయల జరిమానా విధించారు. -
మెడికల్ సీటు వద్దంటే.. లక్ష ఫైన్!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. సీటు తీసుకున్నాక దాన్ని రద్దు చేసుకుంటే లక్ష రూపాయల అపరాధ రుసుం కట్టాల్సి ఉంటుందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బుట్టా శ్రీనివాస్ తెలిపారు. అయితే ఈ లక్ష రూపాయల నిబంధనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో కౌన్సెలింగ్‌లో తమ పిల్లలకు మంచి కాలేజీలో సీటు వస్తే దాన్ని మార్చుకోవడం తప్పా అని వారు వాదిస్తున్నారు. అయితే.. కావాలని సీటు రద్దు చేసుకుంటేనే ఫైన్ కట్టాల్సి ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు.. ఎంసెట్ మెడికల్ విభాగంలో 19వ ర్యాంకు వచ్చినా.. కౌన్సెలింగ్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో డీనా అనే ర్యాంకర్‌ను అధికారులు తిప్పిపంపారు. మరోవైపు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కూడా మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మెడికల్ సీట్లలో 15% ఎన్ఆర్ఐ కోటాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వీసీని కలిసి మెమోరాండం ఇచ్చేందుకు పీడీఎస్‌యూ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.