1984లో సిక్కులను హత్య చేస్తుంటే రాజ్యాంగం గుర్తుకురాలేదు
కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ
హోషియార్‌పూర్: ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగం గొంతు పిసికిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ అంటూ గొంతు చించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. 1984 నాటి అల్లర్లలో సిక్కుల మెడలకు టైర్లు బిగించి, నిప్పంటించి కాల్చి చంపుతుంటే కాంగ్రెస్‌కు రాజ్యాంగం గుర్తుకు రాలేదని ధ్వజమెత్తారు. గురువారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు.
ఈ ఎన్నికల్లో మోదీకి ఇదే చివరి సభ. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి ఉద్దేశాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లలో కోత విధించి, బడుగు బలహీనవర్గాలకు అన్యాయం చేసిన చరిత్ర ప్రతిపక్షాలకు ఉందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టేందుకు విపక్షాలు ప్రయతి్నస్తున్నాయని దుయ్యబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తిని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనోభావాలను ప్రతిపక్షాలు కించపరుస్తున్నాయని ఆక్షేపించారు.
అవినీతిలో కాంగ్రెస్ డబుల్ పీహెచ్‌డీ
కాంగ్రెస్ పార్టీ అవినీతికి తల్లిలాంటిదని ప్రధానమంత్రి నిప్పులు చెరిగారు. అవినీతిలో ఆ పార్టీ డబుల్ పీహెచ్‌డీ చేసిందని ఎద్దేవా చేశారు. మరో అవినీతి పారీ్ట(ఆమ్ ఆద్మీ పార్టీ) కాంగ్రెస్‌తో చేతులు కలిపిందన్నారు. ఢిల్లీలో కలిసికట్టుగా, పంజాబ్‌లో విడివిడిగా పోటీ చేస్తూ ఆ రెండు పారీ్టలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ గర్భంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఊపిరి పోసుకుందని అన్నారు. కాంగ్రెస్ నుంచే అవినీతి పాఠాలు చేర్చుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో మునిగి తేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సైనిక దళాలను బలహీనపర్చిందని ఆరోపించారు. సైన్యంలో సంస్కరణలు చేపట్టడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు.
ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలి
వారణాసి ప్రజలకు ప్రధాని పిలుపు
లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. వారణాసిలో శనివారం పోలింగ్ జరుగనుంది. తన నియోజకవర్గ ప్రజలకు మోదీ గురువారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. భారతదేశ అభివృద్ధి కోసం వారణాసి ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చారు.
కాశీ విశ్వనాథుడితోపాటు అక్కడి ప్రజల ఆశీర్వచనాలతోనే పార్లమెంట్‌లో వారణాసికి ప్రాతినిధ్యం వహించే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. పవిత్ర గంగామాత తనను దత్తత తీసుకుందన్నారు. నవకాశీతోపాటు ‘అభివృద్ధి చెందిన భారత్’ను సాకారం చేసుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలకమని వివరించారు. జూన్ 1న జరిగే ఓటింగ్‌లో వారణాసి ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని, ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. కాశీని ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని మోదీ హామీ ఇచ్చారు.
కన్యాకుమారిలో మోదీ ధ్యానముద్ర
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్‌లోని ధ్యాన మండపంలో ప్రధాని మోదీ గురువారం సాయంత్రం ధ్యానం ప్రారంభించారు. దాదాపు 45 గంటపాటు ఆయన ధ్యానం కొనసాగించనున్నారు. మోదీ తొలుత కేరళలోని తిరువనంతపురం నుంచి హెలికాప్టర్‌లో కన్యాకుమారికి చేరుకున్నారు. సంప్రదాయ ధోతీ, తెల్ల రంగు కండువా ధరించి భగవతి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మోదీ సముద్ర తీరం నుంచి పడవలో రాక్ మెమోరియల్‌కు చేరుకున్నారు. ధ్యాన మండపం మెట్లపై కాసేపు కూర్చుకున్నారు. తర్వాత ధ్యాన మండపంలో సుదీర్ఘ ధ్యానానికి శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment