ఏం సాధించారని వస్తున్నారు బాబూ... | Criticism Of Chandrababu Tour In Vizianagaram District | Sakshi
Sakshi News home page

ఏం సాధించారని వస్తున్నారు బాబూ...

Published Thu, Feb 27 2020 8:57 AM | Last Updated on Thu, Feb 27 2020 10:19 AM

Criticism Of Chandrababu Tour In Vizianagaram District - Sakshi

అధికారం ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ... ఎన్నెన్నో శుష్క వాగ్దానాలు చేశారు. ఏవీ నెరవేర్చకుండానే కాలం గడిపేశారు. వెనుకబడిన జిల్లాను ఏమాత్రం పట్టించుకోలేదు. అభివృద్ధికి చేపట్టిన చర్యలూ లేవు. ఆ పరిస్థితులపై విసిగెత్తిన జనం గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు విశాఖకు రాజధాని ద్వారా జిల్లా అభివృద్ధి సాధిస్తుందనుకుంటే... దానినీ అడ్డుకోవడానికి కుయుక్తులు పన్నుతున్నారు. తగుదునమ్మా... అని ఇప్పుడు జిల్లాకు వస్తున్న ఆయన తీరును జిల్లావాసులు  ఎండగడుతున్నారు. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ  నిలదీస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి విజయనగరం: చంద్రబాబు నాయుడు. ఈ పేరు చెబితేనే జిల్లావాసులు ఊగిపోతున్నారు. ఆగ్రహంతో నిప్పులు చెరుగుతున్నారు. పదవిని అడ్డుపెట్టుకుని చేసిన కుట్రల్లో తాము ఎంతగా కష్టపడిందీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ తమను పీడించిన నియంతృత్వ పోకడల్ని మరిచిపోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో ఈ గాయాలకు మందు రాసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ గాయం తాలూకు మచ్చలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా మానిపోతున్నాయి. జిల్లా ప్రజలకు భవిష్యత్తు మీద ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆశలు చిగురిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. మరోసారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు మళ్లీ జిల్లాకు వస్తున్నారు. 

పేరుకే చైతన్యయాత్ర...  
ఎన్నికల తర్వాత తొలిసారిగా ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది జనవరి మొదటివారంలోనే రావాల్సి ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పర్యటన వాయిదా వేసుకున్నారు. కొద్దిరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున ఇప్పటికైనా రాకపోతే ప్రజలు పూర్తిగా మర్చిపోతారని భయపడి జిల్లా పర్యటనకు వస్తున్నారు. శృంగవరపు కోట, గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.

ఆయన పాలనలో ఒరిగింది శూన్యం 
ప్రజా చైతన్య యాత్ర పేరుతో చంద్రబాబు చేపట్టిన ఈ పర్యటనపై జిల్లా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. విజయనగరం జిల్లా ఎప్పటి నుంచో వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది. ఇక్కడి నుంచి వేలాదిమంది ప్రజలు పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. జిల్లా ప్రజల మంచికోసం చంద్రబాబు ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేయలేదు. భోగాపురం విమానాశ్రయానికి టెండర్లు ఆయన హయాంలో ఖరారు చేయలేకపోయారు. జిల్లా ప్రజల చిరకాల కోరికైన మెడికల్‌ కళాశాలను స్థాపించలేకపోయారు. జూట్‌ మిల్లులు, పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నా పట్టించుకోలేదు.

పైపెచ్చు జన్మభూమి కమిటీలతో సామాన్య ప్రజలను నానా రకాలుగా హింసించారు. స్వపార్టీ వారికే సంక్షేమ పథకాలు ఇచ్చుకున్నారు. ఇలా అనేక విధాలుగా ప్రజలను బాధపెట్టారు. ఇన్నాళ్లకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వంటి జనం బాగుకోరే ముఖ్యమంత్రి వచ్చారు. ఉత్తరాంధ్రకు మంచి చేయాలని భావించి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబు ఆ ప్రయత్నాన్ని కూడా అడ్డుకోవాలని, ఏమాత్రం జిల్లా ప్రజలకు మంచి జరగనివ్వకూడదని పర్యటనల పేరుతో జన వంచనకు సిద్ధమై వస్తున్నారు. 

ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసన 
చంద్రబాబు పర్యటనను జిల్లా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే, విజయనగరం జిల్లాకు వెనుకబాటుతనం పోవాలంటే రాజధాని వికేంద్రీకరణ జరగాలని, విశాఖలో పరిపాలన రాజధాని రావాలని కోరుకుంటున్నారు. కానీ దానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ మండిపడుతున్నారు.  

 ఉత్తరాంధ్రలో ఎందుకు పర్యటిస్తున్నారు? 
విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుకు ససేమిరా అంటున్న విపక్ష నేత చంద్రబాబునాయుడుకు ఈ ప్రాంతంలో పర్యటించే హక్కు కోల్పోయారు. ఏ మొహం పెట్టుకొని ప్రజా చైతన్య యాత్రలు చేపడుతున్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే విజయనగరం వేదికగా మూడు రాజధానుల నిర్ణయాన్ని సమరి్ధంచాలి. టీడీపీ నాయకులు ఆ మేరకు తమ నేతకు దిశ నిర్దేశంచేయాలి. కె.కూర్మినాయుడు,న్యాయవాది,పార్వతీపురం

ఆయన అధికారంలో చేసిందేమిటి?
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పాలనలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ మేలూ చేయలేదు. అప్పుడు లేని ప్రజాచైతన్య యాత్రలు ఇప్పుడు ఎవర్ని మోసగించడానికి చేపడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలు స్వాగతిస్తుంటే చంద్రబాబునాయుడు స్వార్ధంతో దానిని అడ్డుకుంటున్నారు. ఇదేనా ఆయనకు జిల్లాపై ఉన్న ప్రేమ? – కె.వి.కె.రెడ్డి, కాంట్రాక్టర్, పార్వతీపురం

అభివృద్ధిని అడ్డుకుని ఇప్పుడు చైతన్యయాత్రలా? 
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక పథకాలు ప్రవేశపెడి తే వాటిని అడ్డుకుని... ఇప్పుడు చైతన్యయాత్రలంటూ ఎలా వస్తున్నారు? జిల్లా అభివృద్ధికి ఆయన పాటుపడుతుంటే అసె ంబ్లీలో అడ్డుకుని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు. – ఇండుపూరు గున్నేష్‌, వ్యాపారివేత్త, పార్వతీపురం

బాబును నమ్మే రోజులు పోయాయి... 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే రోజులు ఎప్పుడో పోయా యి. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఆయన హయాంలో జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టలేదు. ఏదైనా కార్యక్రమం చేపడితే ఓ అర్ధం ఉండాలి. ఈ యాత్ర ఇప్పుడెందుకు చేస్తున్నారో సొంత పార్టీ నేతలకే తెలియడంలేదు. జిల్లావాసులకు న్యాయం చేయలేని బాబుకు ఈ జిల్లాలో పర్యటించే హక్కు కోల్పోయారు.  – పెనుమత్స సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి

అధికారంలో ఉన్నపుడు ఏంచేశారు? 
రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు విజయనగరం జిల్లా అంటే గుర్తు లేదు. ఇప్పుడు ప్రజా చైతన్య యాత్ర అంటూ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాడు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే ప్రజా చైతన్య యాత్ర పేరుతో అభివృద్ధిని అడ్డుకొనేందుకు వస్తున్నందుకు ప్రజలే బుద్ధి చెబుతారు. – బిడ్డిక అన్నాజీరావు, గిరిజన సంఘం నాయకుడు, నీలకంఠాపురం

ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసిందేమిటి 
ఉత్తరాంధ్రకు ఇన్నాళ్లూ వెనుకబాటుకు గురిచేసిన చంద్రబాబు ఇప్పుడు ఇక్కడ రాజధానిని అడ్డుకుంటూ ఏ ముఖం పెట్టుకుని ప్రజాచైతన్యయాత్ర చేస్తున్నారు? జిల్లాకు న్యాయం చేయలేని ఆయన ఇక్కడకు వచ్చే అర్హత కోల్పోయారు. 
– చుక్క ఈశ్వర అప్పారావు, పీఆర్‌టీయూ నేత, కొత్తవలస

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement