
సాహిత్య విమర్శ ఎలా ఉండాలి?
ఇంచుమించు "సాహిత్యం ఎప్పుడు పుట్టిందో, సాహిత్య విమర్శ కూడా అప్పుడే పుట్టింది" అనే మాట అర్థం లేనిది. విమర్శ అంటే ఆహో, ఓహో అంటూ తలలూపడమూ కాదు, మొదలంటూ తెగ నరకడమూ కాదు. అలాటివి కేవలం ప్రతిస్పందనలు మాత్రమే. ఆ ప్రతిస్పందన నైజాన్ని అన్వేషించి, దానికొక తాత్త్విక పరిపుష్టినీ, శాస్త్రీయ భూమికనూ సమకూర్చేది విమర్శ.
వాస్తవాన్ని సంకేతంలోకి రచయిత మారుస్తుంటే, సంకేతాన్ని వాస్తవంలోకి విమర్శకుడు మారుస్తున్నారు. ఒకరికొకరు పూరకంగా నిలుస్తున్నారు. రచయితకెలాంటి సృజనాత్మక ప్రతిభ కావాలో, విమర్శకునికి కూడా అలాంటి సృజనాత్మక ప్రతిభ కావాలి. ప్రపంచంలో ఏ మూలలో ప్రసిద్ధికి వచ్చిన విమర్శకులను చూసినా, ఈ విషయం స్పష్టం కాకపోదు.
కొత్త విమర్శనా సంప్రదాయాలను నెలకొల్పడం చరిత్రలో సర్వత్రా అగుపించే విషయం. అందుకే బహుకాలం విమర్శ, సృజనాత్మక సాహిత్యంలో భాగంగానే అణగి మణగివుంది. కుకవి నిందలో భాగంగా తొంగి చూసింది. మీమాంస, లక్షణశాస్త్రరూపం పొందిన దశలో కూడా రూపభద్రతకు సంబంధించే తన చర్చను నడిపింది కానీ వస్తుతత్వం పట్ల దృష్టిని ప్రవచించలేదు. వస్తుపరంగా పూర్వ ప్రసిద్ధ ఇతివృత్తాలనే కొనసాగింప చేయాలనడమూ, రూపపరంగా చాపల్య, అవనతులకు స్థానంలేని భద్రతనివ్వాలని సంకల్పించడమూ అందుకు కారణం.
సాహిత్య మీమాంసను ప్రాచీన భారతీయులు "క్రియాకల్ప" అని వ్యవహరించే వారంటూ ఆచార్య వి.రాఘవన్ పేర్కొంటున్నారు. వాత్సాయయనుడిచ్చిన చతుష్షష్టి కళలలో కావ్యక్రియా, అభిధానకోశ, ఛందో జ్ఞానములతోపాటు "క్రియాకల్ప" కూడా ఉంది. ఇదే నేటి కావ్య మీమాంసగా రూపు ధరించిందని రాఘవన్ గారి అభిప్రాయం. కావ్యక్రియలో శబ్ద, సంవిధాన వైఖరికి సంబంధించిన రూప భద్రత వివేచనాన్ని ఈ మాట ఉద్దేశిస్తున్నది. వస్తుభద్రతకు సంబంధించిన వాటికి తత్త్వశాస్త్రాన్నే ఆశ్రయించమని గౌణం చేస్తున్నది. దాన్ని మొదటిమారుగా ప్రస్ఫుటం చేసి, తత్త్వశాస్త్రానికీ, కావ్య మీమాంసకూ మధ్య కొత్త సమన్వయాన్ని రూపొందించేటందుకూ ఒక పరిధిని ఏర్పరచేటందుకూ కృషి చేసినవాడు అభినవగుప్తుడు. కావ్య మీమాంసలో రూపభద్రతకూ, వస్తుభద్రతకూ మధ్య వున్న లంకెను భరతుని వద్దనుంచే అందరూ ప్రస్తావన స్థాయిలో మాత్రం పరామర్శించి విడిపోతే, దాన్ని ప్రస్ఫుటపరచి ఒకే పరిధిలో కుదిర్చేటందుకు అభినవగుప్తుడు తొలిసారిగా కృషి చేశాడు. దురదృష్టవశాత్తూ, ఆ తర్వాత అది సుసంపన్నంగా కొనసాగలేదు. పైపెచ్చు కావ్య మీమాంస యావత్తూ కేవలం రూపాశ్రితమై, అలంకార ప్రయోగాలే సాహిత్య రచన అనే భ్రమకు అవకాశమిస్తూ, అలంకారాల సంఖ్యను పెంచుతూ, వెంట్రుకను శతకోటి ఖండాలుగా చీల్చే నిరర్థక పరిశ్రమగా వక్రీకరించింది. అదే విమర్శన శాస్త్రమనే భ్రమకు అవకాశం ఇచ్చింది.
ఆధునిక యుగం అందించిన భిన్న జాగృతుల మూలంగా, మానవ అధ్యయన పరిధులకి లోబడిన నవచేతనల కారణంగా, విమర్శనం ఒక విడి శాస్త్రంగా సమన్వయ భూమికతో అవతరించడం మొదలైంది. విడి శాఖగా రూపొందేటప్పుడు కూడా లారెన్స్ లాంటివాళ్లు ఇది సగం కళ, సగం శాస్త్రం అంటూ అభిప్రాయపడ్డారు. రచయిత ఎలా తన లోకానుభూతిని వైయక్తిక పరిమితికి లోబడి మాత్రమే అభివ్యక్త పరుస్తున్నాడో, విమర్శకుడు సైతం తన కావ్యానుభూతిని అలా వివరిస్తుంటాడనే అభిప్రాయం ప్రబలింది. పైపెచ్చు, కవిత్వంలో గమనించాల్సింది రచయిత వైయక్తిక అనుభూతి మాత్రమేనన్న మార్గదర్శి సూత్రం వారిని బంధించింది.
అందులోంచి వేరుపడి విస్తారమైన జీవితాన్నంతటినీ అనుశీలనలోకి తీసుకొని జీవన నైతికతను పోషించాల్సిన అవసరాన్ని గుర్తుచేసి, "కవితా విమర్శనమంటే జీవిత విమర్శనమే" నంటూ ఆర్నాల్డ్ వంటి విమర్శకులు కొత్త సంప్రదాయం నెలకొల్పినా, అనుభూతివాదం వివక్షలోంచి తొలగిపోని మూలంగా చాలా కాలం విమర్శ సగం కళా, సగం శాస్త్రం అంటూ కొట్టుమిట్టాడింది. అంతేకాదు, వాస్తవ జీవితంలో ఏ మాత్రం నిమిత్తం లేని శుద్ధ కాల్పనిక ప్రత్యయంగా మాత్రమే కావ్యరచననూ, తన్మూలంగా విమర్శనూ పర్యవసింప చేయటానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే "కళ కోసం కళ", "కావ్యం కోసం కావ్య"మంటూ ఆస్కార్ వైల్డ్, ఎడ్గర్ అలెన్ పో ప్రభృతుల సంప్రదాయం మొదలైంది. "కావ్యం అనేది సాంగోపాంగమైన సంపూర్ణ నిర్మాణం కాబట్టి దాని పరిశీలనమే విమర్శకుని పరమావధి, తదతీతంగా రచయిత జీవితాన్ని కానీ, జాతి జీవితాన్ని కానీ, చరిత్రను కానీ, యుగనేపథ్యాన్ని కానీ చూడటం కేవలం అనవసరం" అంటూ భావించిన నియో క్రిటిసిజం సంప్రదాయ ప్రచారంలోకి వస్తూ పిల్లి మొగ్గలు వేసింది.
వైయక్తిక పరిమితుల మూలంగా పెల్లుబికిన ఈ దుర్లక్షణాల నుంచి విమర్శను బయట పడవేసి దానికి ఆధునికమైన శాస్త్రీయ భూమికను నెలకొల్పాలని ప్రయత్నం చేసింది ఒక చెంప ఐ.ఎ.రిచర్డ్స్, మరో చెంప అడాల్ఫ్ టేన్. రూప విషయంగా అన్వయ కార్యాన్ని ప్రాయోగిక విధానానికి అనువుగా మలిచేటందుకు రిచర్డ్స్ మార్గం వేస్తే, ఆయనకు చాలా మునుపు వస్తుపరంగా విస్తారమైన అన్వయ క్షేత్రాన్ని నెలకొల్పేటందుకు హిప్పోలేట్ అడాల్ఫ్ టేన్ మార్గదర్శకత్వం వహించాడు. ఆయన ప్రతిపాదించిన 1.జాతి చేతన/ప్రతిభ, 2.కాలఘట్టం, 3.పరిసరం అనేవి మూడూ ఆధునిక శాస్త్రీయ విమర్శకు మూలస్తంభాలుగా నిలిచాయి. ఇందులో మొదటగా పేర్కొన్న జాతి చేతన ఆ దేశ ప్రజల విశిష్ట స్వభావం, ఆ జాతి వ్యక్తిత్వ మన్నమాట. కాలఘట్టం అంటే ఆ రచయిత జీవించిన చారిత్రకయుగం, దాని స్వభావం, స్వరూపం అన్నమాట. ఆ కాలానికి సంబంధించిన చేతన పరిసరం అంటే ఆ చారిత్రక యుగానికి, రచయిత ప్రాంతానికి చుట్టూ ఆవరించియున్న పరిసరాల్లోని చైతన్యం, సంఘర్షణలూ, సమస్యలూ.
ఈ మూడు దృక్కోణాలనుంచి చూస్తే కానీ, ఒక రచన సమ్యక్ స్వరూపం, విశిష్ట వ్యక్తిత్వం, దాని ప్రయోజనం, ఆవశ్యకతా అవగాహనలోనికి రావు. ఈ దృక్కోణత్రయం మీద ఆధారపడి చారిత్రక విమర్శ అనే పంథా బయల్దేరింది. ఈ యుగంలో అత్యంత గౌరవాన్ని పొందిన ఆర్కిటైపల్ (మూల రూపాత్మక) మనోవైజ్ఞానిక విమర్శలోని సమష్టి సుప్త చేతన సిద్ధాంతం నుంచి స్ఫూర్తి తీసుకొని, టేన్ ప్రతిపాదించిన "జాతి ప్రతిభ" అనే అంశం మీద ఆధారపడుతూ తన సైద్ధాంతిక రూపాన్ని నిర్మించుకొంది. తొలి సమగ్ర శాస్త్రీయ విమర్శగా పేరుపొందిన చారిత్రక విమర్శలో ఒకే ఒక చిన్న బలహీనత– ఆ విమర్శ అందించే సందేశం ఏమిటి? ప్రస్తుత జీవితానికి కలిగించే స్ఫూర్తి ఏమిటీ? అనేది. విమర్శ సాఫల్యతకు సందేశం గుర్తు!
ఆ సాఫల్యతను దృష్టిలో పెట్టుకొని, చారిత్రక విమర్శనారీతిలోని మూల సూత్రాలనూ సమాజ వాస్తవికతనూ విశ్లేషించి, సామాన్య మానవ జీవితానికి అర్థం, గమ్యం తెలియజెప్పిన ఆర్థిక సామాజికవేత్తల దృక్పథాలనూ వైయక్తిక భావపరిణామాల మీద మాత్రమే కాకుండా, మొత్తం సమాజం అంతటా ప్రసరించే నైతిక దృష్టితో సమన్వయపరచి సశాస్త్రీయ పంథాలో పురోగమిస్తున్నది, "సామాజిక విమర్శ" అనే ఆధునిక సంప్రదాయం. సాహిత్యం పట్ల "రచయితజనత" ఉభయుల అంతరాత్మ పరిశీలకునిగా వ్యవహరించే ఉత్తమ విమర్శకునికి, పరమోపాదేయంగా వెలసిన ఆధునిక మార్గం సామాజిక విమర్శ. విమర్శకుడు తన బాధ్యతను న్యాయంగా నిర్వర్తించాలంటే లక్షణ శాస్త్ర పరిజ్ఞానం కాదు కావలసింది, సమాజశాస్త్ర పరిజ్ఞానం.
(ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ "ఆధునికత సమకాలికత"(కొన్ని పార్శ్వాలు) ఇటీవలే "చినుకు పబ్లికేషన్స్" ద్వారా ప్రచురితమైంది. పై భాగం, అందులోని "సాహిత్య విమర్శశాస్త్ర స్థాయి" వ్యాసంలోంచి సంక్షిప్తం చేసింది.)
ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ
9441809566