ఫ్లోరిడా: క్రిమినల్ అభియోగాలు ఎదుర్కోవడమే కాదు.. కోర్టు విచారణకు హాజరయ్యే క్రమంలో అరెస్టయిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా కూడా డొనాల్డ్ ట్రంప్ చరిత్రకెక్కారు. అయితే కోర్టు విచారణ అనంతరం ఈ కేసుపై మీడియాతో మొదటిసారిగా మాట్లాడిన ట్రంప్.. అధ్యక్షుడు జో బైడెన్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. బైడెన్ పాలనలో అమెరికా నానాటికీ నాశనం అవుతోందంటూ మండిపడ్డారాయన.
శృంగార తారతో అనైతిక ఒప్పందం కేసులో ఆయన కోర్టులో లొంగిపోయేందుకు వెళ్లగా.. పోలీసులు అరెస్ట్ చేసి మరీ కోర్టులో హాజరు పరిచారు. తానే నేరమూ చేయలేదని ట్రంప్ వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ మాన్‌హట్టన్ కోర్టులో సుమారు గంటపాటు విచారణ జరిగిన తర్వాత.. ట్రంప్ నేరుగా ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో ఇంటికి వెళ్లిపోయారు. అయితే కాసేపటికే ఆయన మీడియాతో మాట్లాడారు.
అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని ఏనాడూ ఊహించలేదు. ఇలా జరగాలని కోరుకోవడం లేదు కూడా. నేను చేసిన నేరమల్లా ఒక్కటే. దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న శక్తులకు ధైర్యంగా ఎదురొడ్డి పోరాడడమే అని ట్రంప్‌అన్నారు.
అమెరికా నరకంగా మారి నాశనం వైపు అడుగులేస్తోందని, అది చూసి ప్రపంచమంతా నవ్వుకుంటోందని ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తనపై ఈ కుట్ర జరుగుతోందని, దానిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసంటూ ఈ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో తదుపరి విచారణ కోసం ట్రంప్ డిసెంబర్‌లో మళ్లీ కోర్టు ఎదుట హాజరు కావొచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment