సాక్షి, తాడేపల్లి : చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టినా ఆయనకు సిగ్గు రాలేదని, ఏ ముఖం పెట్టుకొని కడపలో అడుగుపెట్టారని ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. కడపకు వచ్చిన ప్రతీసారి కడప, రాయలసీమ రౌడీలంటూ ప్రజలను అవమానించిన చంద్రబాబుకు స్వాగతం పలికిన టీడీపీ నాయకులకు బుద్ధి ఉందా అంటూ ప్రశ్నించారు. ముందు కడప ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత కడపలో చంద్రబాబు అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ మాయ మాటలు పలుకుతున్న బాబు మాటలు ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఒకవేళ మళ్లీ ఎన్నికలు వచ్చిన బాబుకు ఒక్కసీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. కోర్టుల చుట్టూ తిరిగి 26 స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు తనను ఎవరు ఏమి చేయలేరని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ ఎమ్మెల్యేలను ఆంబోతులు అంటూ చంద్రబాబు మాట్లాడడం తగదని హెచ్చరించారు. ఆ మాటకొస్తే వ్యవస్థలను సర్వ నాశనం చేసిన చంద్రబాబే ఆంబోతులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్షలాది ఉద్యోగాలు ఇస్తుంటే చంద్రబాబు వాటిని తీసేస్తామంటున్నారని, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో బాబు యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి భయపడి పిల్లిలా వ్యవహరిస్తున్న బాబు గతంలో అదే మోదీని తన వియ్యంకుడు బాలకృష్ణతో నోటికొచ్చినట్లు తిట్టించిన సంగతి గుర్తుకులేదా అని ప్రశ్నించారు. అలాగే తిరుపతి పర్యటనకు వచ్చిన అమిత్‌షాపై రాళ్ల దాడి చేయించింది మీరు కాదా అని విమర్శించారు.
చంద్రబాబుకు దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్న పవన్‌కల్యాణ్ తాను ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని దుయ్యబట్టారు. కడపలో స్టీల్ ప్లాంట్ రాకుండా అడ్డుకుంది ముమ్మాటికి చంద్రబాబేనని, అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తే ఆ ప్రదేశంలో నెమళ్లు నాట్యం చేస్తాయంటూ ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయించారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ నుంచి తరిమేస్తే అమరావతికి పారిపోయి వచ్చిన చంద్రబాబు అధికారులను భయపడే విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment