ఏయూ క్యాంపస్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర విశ్వవిద్యాలయంపై చౌకబారు విమర్శలు చేయడం పవన్‌కళ్యాణ్ మానుకోవాలని ఏయూ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ జి.రవికుమార్ ఘాటుగా బదులిచ్చారు. ఏయూ ప్రతిష్టకు భంగం కలిగేలా పవన్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఆయన ఖండించారు. ఉద్యోగులు, విద్యార్థుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన జనసేన అధినేత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలకు అందించే ర్యాంకింగ్ అనేది ప్రధానంగా విద్యార్థులు, ఆచార్యుల నిష్పత్తిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
♦ ర్యాంకింగ్‌లో పాల్గొనే విద్యా సంస్థల సంఖ్యపై కూడా వర్సిటీల ర్యాంకులు ఆధారపడి ఉంటుంది. 2019లో ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌కి కేవలం వెయ్యి విద్యా సంస్థలు పాల్గొంటే, 2023లో 2,478 సంస్థలు పాల్గొన్నాయి.
♦ తొలి 100 స్థానాల్లో నిలిచే విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ 2.5 నుంచి 4 మార్కుల వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. ర్యాంకింగ్ విధానంలో ఐఐటీలు, కేంద్రీయ, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కొంతమేర ప్రయోజనం పొందుతున్నాయి.
♦ గతంలోనే ఐఐటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆచార్య రాంగోపాల్ ర్యాంకింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్ర, డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు పరిమితులు (పారామీటర్స్) వేరుగా ఉండాల్సిన అవసరముందని అన్నారు.
♦ ఇక ఏయూలో విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సాధించే వారి సంఖ్య 2018తో పోలిస్తే 25 శాతానికి పైగా పెరిగింది. 2023లో ఏయూ విద్యార్థులు పొందిన అత్యధిక వార్షిక వేతనం రూ.84.5 లక్షలు. 2018లో విద్యార్థులు సాధించిన అత్యధిక వార్షిక వేతనం కేవలం రూ.22 లక్షలు మాత్రమే.
♦ కేంద్ర విశ్వవిద్యాలయాల కంటే మిన్నగా ఏయూలో ఏర్పాటుచేసిన టెక్ స్టార్టప్, ఇంక్యుబేషన్ సెంటర్ పనిచేస్తున్నాయి. ఇప్పటికే 124కి పైగా సాఫ్ట్‌వేర్ సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో ఏయూ స్టార్టప్–ఇంక్యుబేషన్ సెంటర్ 14వ ర్యాంకు సాధించింది. తొలి 13 స్థానాల్లో ఐఐటీలు మాత్రమే నిలిచాయి.
♦ జాతీయ విశ్వవిద్యాలయాల తరహాలో 18 చెయిర్ ప్రొఫెసర్లు కలిగిన ఏకైక విశ్వవిద్యాలయం ఏయూ. దీనిపై ఉన్న నమ్మకంతో నవరత్న కంపెనీల నుంచి అమెరికాలో స్థిరపడిన భారతీయులు, ఏయూ పూర్వవిద్యార్థులు ఐఐటీ ఢిల్లీ తరహాలో ఇక్కడ చెయిర్ ప్రొఫెసర్‌లు ఏర్పాటుచేస్తున్నారు.
ఇలా.. వర్సిటీలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని పవన్ చదవడం సరికాదు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఏయూకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి.
విద్య, వివేకంలేని వ్యక్తిలా పవన్
విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులపా రవీంద్రనాథ్ ఠాగూర్
ఏయూ క్యాంపస్ : జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు విద్య, వివేకంలేని వ్యక్తి మాటల్లా ఉన్నాయని విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులపా రవీంద్రనాథ్ ఠాగూర్ విమర్శించారు. ఏయూపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏయూను శుక్రవారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. ప్రజలు హర్షించేలా పవన్ మాట్లాడాలని హితవు పలికారు. నిజమైన విద్యావంతుడు, సంస్కారవంతులెవరూ ఏయూని ఉద్దేశించి ఇలా మాట్లాడరన్నారు.
పవన్ ఈ ప్రశ్నలకు బదులివ్వు..
ఏయూ విద్యా విభాగాధిపతి డాక్టర్ టి.షారోన్ రాజు
భారతీయ విద్యావ్యవస్థపై పవన్ అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని ఏయూ విద్యా విభాగాధిపతి డాక్టర్ టి.షారోన్ రాజు అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థపై ఆరోపణలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఇన్ని అసత్య ఆరోపణలు చేసిన పవన్‌కు తాను కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నానని.. వాటికి ఆయన సమాధానం చెప్పాలని షారోన్‌రాజు సవాల్ విసిరారు. అవి..
♦ ఏయూకి 2018లో ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.150 కోట్లు నిధులను పసుపు–కుంకుమ పథకానికి ఎందుకు మళ్లించారు. అప్పుడు మీరు దీనిపై ఎందుకు ప్రశ్నించలేదు?
♦ ఏయూ సొంత నిధుల నుంచి రూ.5 కోట్లు వెచ్చించి జ్ఞానభేరి సభను చంద్రబాబు నిర్వహించారు. వాటిని ఎందుకు తిరిగి చెల్లించలేదు?
♦విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాలపై 1996 నుంచి 2006 వరకు, తిరిగి 2014 నుంచి 2018 వరకు ఎందుకు నిషేధం విధించారు?
♦పోలమాంబ ఆలయం పక్కనే, ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రూ.300 కోట్లు విలువైన స్థలాన్ని ఇటీవల ఏయూ స్వాధీనం చేసుకుంది. ఇంతకాలం ఈ స్థలం ఎవరి గుప్పిట్లో ఉందో మీకు తెలుసా?
♦ 2019–2023 మధ్య 200 మందికిపైగా ఆచార్యులు ఏయూలో పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ ఏయూ జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు, స్కోర్‌ను మెరుగుపర్చుకుంటూ వస్తోంది. దార్శనికత కలిగిన రాష్ట్ర సీఎం ప్రపంచ స్థాయి విధానాలను అమలుచేయడంవల్లే ఇది సాధ్యపడింది. ఈ విషయం మీకు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment