పాదయాత్రలో భాగంగా ఓ రైతు పొలంలోని టమాటలను పరిశీలిస్తున్న బండి సంజయ్
చేవెళ్ల: రాష్ట్రంలో రైతు సమస్యలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, రైతులకు ఏదో చేశామని ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. చేవెళ్ల మండలంలో గురువారం 6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింది. చేవెళ్లలో రాత్రి బస చేసిన ఆయన ఉదయం 11.30 గంటలకు యాత్రను ప్రారంభించారు. చేవెళ్ల మీదుగా దామరగిద్ద, మీర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్ ఆలూరు మీదుగా రాత్రికి వికారాబాద్ జిల్లా చిట్టెంపల్లికి చేరుకున్నారు.
బండి సంజయ్ గురువారం ఎలాంటి సభలు లేకుండా యాత్ర మాత్రమే సాగించారు. ఈ సందర్భంగా దారి వెంట రైతుల సమస్యలు విన్న ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎంతో చేశామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం నిజానికి ఏమీ చేయలేదన్నారు. రుణమాఫీ అతీగతీ లేదని, సబ్సిడీపై యూరియా అందిస్తామని మాట తప్పిందన్నారు. ఈ యాత్రలో భాగంగా పొలాల్లో పనిచేసుకుంటున్న వివిధ గ్రామాల రైతుల వద్దకు వెళ్లిన సంజయ్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని దామరగిద్ద సమీపంలోని టమాటా రైతుల వద్దకు వెళ్లి ధరల విషయం ప్రశ్నించారు.
అధిక వర్షాలతో చేతికి వచ్చిన పంటలు నష్టపోతున్నామని, అరకొర పంటలు వచ్చినా వాటికి మార్కెట్‌లో ఆశించిన ధరలు లేక నష్టాలు వస్తున్నాయని రైతులు సంజయ్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. మీర్జాగూడ సమీపంలోని ఒక పొలంలో బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావులు నాగలి పట్టి పొలం దున్నారు. రుణమాఫీ రాలేదని, సబ్సిడీపై రైతులకు వచ్చే పనిముట్లు ఇవ్వటం లేదని పలువురు రైతులు వివరించారు.
మండలంలోని దామరగిద్ద, మిర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్‌లలో పలువురు యువకులు బీజేపీలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబో యేది బీజేపీ ప్రభుత్వమేనని, అది చూసే టీఆర్‌ఎస్ నాయకులకు భయం పట్టుకుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. బండి సంజయ్ యాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూసి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులకు మతిపోతోందని పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లాలో సంజయ్‌కి ఘన స్వాగతం
పూడూరు: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర గురువారం రాత్రి వికారాబాద్ జిల్లాలో ప్రవేశించింది. పూడూరు మండలంలోని అంగడిచిట్టంపల్లి గేటు వద్దకు చేరుకోగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి, ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంగడిచిట్టంపల్లి గ్రామ నాయకులు ఏర్పాటు చేసిన జెండాను బండి సంజయ్ ఆవిష్కరించారు. ధరణి కాటన్ మిల్లులో బండి రాత్రికి బస చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment