సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండిసంజయ్ 36 రోజుల పాటు నిర్వహించిన తొలివిడత ‘ప్రజాసంగ్రామయాత్ర’పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఓ ప్రేరణగా నిలుస్తుందని పాదయాత్ర ప్రముఖ్, ఇన్‌చార్జి డా.గంగిడి మనోహర్‌రెడ్డి చెప్పారు. తొలివిడత అనుభవం, ప్రజల నుంచి వచ్చిన స్పందన చూశాక రెండో, మూడో విడత యాత్రను కూడా సునాయాసంగా పూర్తిచేయగలమనే నమ్మకం కలిగిందన్నారు.
భవిష్యత్‌లో బీజేపీ వివిధ రాష్ట్రాల్లో చేపట్టే పాదయాత్రలకు ఇదొక ‘రోల్ మోడల్’గా నిలిచిపోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తొలివిడత పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇందులో పూర్తిస్థాయిలో నిమగ్నమై, ఏర్పాట్లు మొదలుకుని, యాత్ర నిర్వహణలో మమేకమైన మనోహర్‌రెడ్డి ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే..
ఊహించిన దాని కంటే బాగా...
‘‘ఈ పాదయాత్ర ఊహించిన దానికంటే కూడా బాగా జరిగింది. ఇంత పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొంటారని అనుకోలేదు. హైదరాబాద్ వరకే స్పందన ఉంటుంది ఆ తర్వాత ఉండదనుకున్నాం. కానీ, వివిధ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ మంచి స్పందన వ్యక్తమైంది. మరో రెండున్నరేళ్ల తర్వాతే అసెంబ్లీ ఎన్నికలుండగా ఇప్పుడు పాదయాత్ర చేపట్టడం సరైనదికాదేమోనని చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఐతే పాదయాత్రకు కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన స్పందన చూశాక ఇప్పుడు చేయడమే మంచిదైందని భావిస్తున్నాం. ప్రభుత్వ అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలను గట్టిగా వ్యతిరేకించే సరైన పార్టీ, నాయకుడు వచ్చారనే భావన ప్రజల్లో కలిగింది.
ప్రతికూల పరిస్థితుల్లో కొనసాగించాం
భారీవర్షాలు, ఆ వెంటే ఎండలు ఇలా ప్రతికూల పరిస్థితుల్లో ఈ యాత్రను ప్రారంభించాం. పార్టీ జాతీయ నాయకత్వం, ముఖ్యనేతలు ఏ పాదయాత్రలోనూ ఈ స్థాయిలో భాగస్వాములు కాలేదు. పాదయాత్రలో పాల్గొనేందుకే తాను నిర్మల్‌కు వచ్చానంటూ కేంద్రహోంమంత్రి అమిత్‌షా ప్రకటించడం కేడర్‌లో, నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించింది.
సమస్యల తీవ్రత తెలిసొచ్చింది
ప్రజాసంగ్రామయాత్ర ద్వారా టీఆర్‌ఎస్‌పై, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులపై ఉన్న ప్రజా వ్యతిరేకత, ఆగ్రహం బయటపడింది. రాష్ట్రంలో నిరుద్యోగసమస్య తీవ్రత తెలిసొచ్చింది. ఉన్నత చదువులు చదివినా, తగిన విద్యార్హతలు ఉన్నా ఉద్యోగాలు రాకపోవడం, గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇప్పటికీ నెరవేరకపోవడంపై యువతలో తీవ్రస్థాయిలో కోపోద్రేకాలు వ్యక్తమవుతున్నాయి.
రైతన్న తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురైన తీరును పాదయాత్రలో దగ్గర నుంచి చూడగలిగాం. రుణమాఫీ కాకపోవడం, పేదలకు డబుల్ బెడ్‌రూంలు అందకపోవడం, కరోనా సమయంలో అన్నీ అమ్ముకుని చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందనే ఆవేదన వివిధ వర్గాల్లో వెల్లడైంది.
టీఆర్‌ఎస్ విమర్శలే యాత్ర విజయానికి కొలమానం
బీజేపీ ఎక్కడుందని గతంలో ప్రశ్నించిన టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు పాదయాత్ర సాగిన 36 రోజులూ మాపై విమర్శలు సంధించారు. దీనిని బట్టి మా యాత్ర ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే విజయవంతమైందని భావిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment