సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడం, ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడంలో భాగంగా ముందుగానే కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందా? పార్టీ నాయకులు, కేడర్‌లో ఎన్నికల జోష్‌ను నింపేందుకు దశల వారీగా అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించిందా? అంటే అవుననే సమాధానమే ముఖ్యనేతల నుంచి వస్తోంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొలిదశ ‘ప్రజా సంగ్రామయాత్ర’ముగింపు సందర్భంగా దాదాపు పదిసీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్టు సమాచారం. చార్మినార్ నుంచి ప్రారంభమైన ఈ తొలిదశ పాదయాత్ర వివిధ జిల్లాల్లోని 22 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలను కవర్ చేస్తూ అక్టోబర్ 2న హుజూరాబాద్‌లో ముగియనుంది.
కొన్ని స్థానాలపై కసరత్తు పూర్తి!
ఇప్పటివరకు సంజయ్ యాత్ర సాగిన ప్రాంతాల్లోని వివాద రహిత స్థానాలు, ముఖ్యనేతల నియోజకవర్గాలతో కూడిన పది సీట్ల ముందస్తు జాబితాను జాతీయ నాయకత్వం అనుమతితో ప్రకటించే అవకాశాలున్నట్టు పార్టీ ముఖ్యనేతల సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో నేతలకున్న పట్టు, పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, సామాజిక వర్గాల వారీగా ఉన్న ఓట్లు, తదితర అంశాల ప్రాతిపదికన సీట్లు, అభ్యర్థుల పేర్లపై కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయమున్నా ఇప్పటినుంచే స్పష్టతనిస్తే పోటీచేసే అభ్యర్థులతో పాటు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో అంకిత భావంతో పనిచేసేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొదటి దశ పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొనడంతో పాటు, ఈ యాత్ర విజయవంతానికి జరిపిన కృషి ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగినట్టుగా చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల వరకు మరో నాలుగు విడతల్లో పాదయాత్ర కొనసాగనున్నందున, ఇకముందు యాత్ర సాగే రూట్లలో పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సమాయత్తం అయ్యేందుకు ముందస్తు అభ్యర్థుల ప్రకటన దోహదపడుతుందని భావిస్తున్నారు.
2న రోడ్ షోకు స్మృతీ ఇరానీ
వచ్చేనెల 2న హుజూరాబాద్‌లో పాదయాత్ర ముగింపు సందర్భంగా రోడ్ షో నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. తొలుత ఇక్కడ బహిరంగ సభ నిర్వహించి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని భావించారు. అయితే సెప్టెంబర్ 17న నిర్మల్‌లో అమిత్‌షా సభ నిర్వహించినందున, 15 రోజుల వ్యవధిలోనే మరో బహిరంగ సభ కంటే ఉప ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడేలా రోడ్ షో నిర్వహణకు మొగ్గుచూపారు.
మరో ముఖ్యమైన సందర్భంలో నడ్డా రాష్ట్ర పర్యటనకు రానున్నందున, పాదయాత్ర ముగింపు సభా కార్యక్రమంలో మార్పు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో 2న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఈ నియోజకవర్గాలకు ముందే..
చార్మినార్ శ్రీభాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించినందున.. ముందుగా అభ్యర్థులను ప్రకటించే నియోజకవర్గాల జాబితాలో ఈ కింది స్థానాలు ఉండొచ్చునని భావిస్తున్నారు. చార్మినార్, నాంపల్లి, కార్వాన్ (అమర్‌సింగ్), గోషామహల్ (రాజాసింగ్ సిట్టింగ్ స్థానం), వికారాబాద్ (మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్), ఆందోల్ (మాజీమంత్రి బాబూమోహన్), నరసాపూర్, దుబ్బాక (సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావు), ఎల్లారెడ్డి (మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి), హుజూరాబాద్ (మాజీ మంత్రి ఈటల రాజేందర్).
Comments
Please login to add a commentAdd a comment