ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న సీఎం
ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శ
సాక్షి, హైదరాబాద్: జిల్లాల విభజన విషయంలో ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానిస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఉద్యమాల ద్వారానే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మరిచిపోయి ప్రజా ఉద్యమాలను కించపరుస్తూ టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి జిల్లాల పేరిట టీఆర్‌ఎస్ నేతలే రోజుకో మాటతో అతిపెద్ద డ్రామా ఆడుతున్నారని వంశీచంద్ విమర్శించారు.
జిల్లాల పేరుతో ప్రజలను విభజించి, నిప్పు రాజేసి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను చెప్పడానికి కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేని దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. టీఆర్‌ఎస్ నేతలు అంతర్గతంగా ఒకమాట, బహిరంగంగా మరోమాట మాట్లాడుతున్నారని, ప్రజలే తగిన సమయంలో బుద్ధిచెప్తారని వంశీచంద్ హెచ్చరించారు.