కేసీఆర్ బెదిరింపులు సరికాదు: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంపై వచ్చిన విమర్శల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రతో తక్కువ ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోవడంవల్ల రాష్ట్రంపై అధిక నిర్మాణ భారంతో పాటు వచ్చే నీళ్లు కూడా తక్కువగానే ఉంటాయన్నారు. గతంలో ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలిచి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదంటూ వివరించలేదని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఆయా అంశాలను లేవనెత్తిన విపక్షాలపై సీఎం కేసీఆర్, మంత్రులు కేసులు పెడతాం, జైళ్లో పెడతామనే బెదిరింపుల తీరు సరైంది కాదన్నారు.