50 వసంతాల ‘సెస్’
అనేక సంక్షోభాలను సంస్కరణలను ఎదుర్కొని ఐదు దశాబ్దాలుగా కాలపరీక్షకు నిలిచి జాతీయస్థాయిలో పేరు ప్రతిష్టలను పొందిన సంస్థ సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ సిరిసిల్ల(కో–ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై లిమిటెడ్, సిరిసిల్ల). సంస్థను ప్రారంభించి ఈ నవంబర్ 1 నాటికి 50 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుం టోంది. ఈ సంస్థను సంక్షిప్తంగా సెస్ అని వాడుకలో పిలుస్తారు. సహకార రంగంలో విద్యుత్తును తన వినియోగదారులకు సరఫరా చేయడంలోనూ, ఉత్తమ సేవలను అందించడంలోనూ దేశంలోనే అత్యున్నత శిఖరాలకు చేరుకున్న సెస్ స్వర్ణోత్సవాల వైపు పరిగెడుతున్నది.
సహకార శాఖ చట్టం పరిధిలో అక్టోబర్ 1969న రిజిస్ట్రేషన్ చేసుకొని, 1970 నవంబర్ 1 నుంచి ఆచరణాత్మకంగా ‘సెస్’ ఉనికిలోకి వచ్చింది. భారతదేశం గ్రామాల్లో నివసిస్తున్నది అన్న మహాత్మా గాంధీ.. అభివృద్ధికి గ్రామాలు పట్టుకొమ్మలని కూడా చెప్పారు. ఈ స్ఫూర్తితో వ్యవసాయ అభివృద్ధి, గ్రామాల ఉన్నతి, ప్రజల వికాసం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్.ఇ.సి)ను 1969లో ప్రారంభించింది. దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 5 గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంఘాలు ప్రారంభమయ్యాయి. ఆయా రాష్ట్రాల్లోని సంస్థల అభివృద్ధి ప్రణాళికలకు గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ నేపథ్యంలోనే సిరిసిల్లలో సహకార విద్యుత్ సరఫరా సంఘం ఏర్పాటు అయినది. ఇది అప్పటి సిరిసిల్ల పాత తాలూకా ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 13 మండలాలు 2 మున్సిపాలిటీల పరిధిలో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నది.
దీని సాధన, స్థాపన వెనుక అప్పటి సిరిసిల్ల్ల శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు పట్టుదల ఎన్నదగినది. ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల ప్రాంతానికి ఏకైక సంస్థను తీసుకురావడం అంటే మాటలు కావు. అనంతరం సంస్థ మనుగడలో అప్పటి శాసనసభ్యులు జే నర్సింగరావు, గొట్టె భూపతిల పాలనా సామర్థ్యాలు, అప్పటి ఉన్నత అధికారులు, ఉద్యోగులు, విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన సంస్థ ఉద్యోగుల త్యాగాలు, నిస్వార్థ సేవలు కీలక భూమిక వహించాయి. 50 ఏళ్లుగా సంస్థ ఎదురులేకుండా నిలబడడానికి కారణం వారి పటిష్ట ప్రణాళికల పునాది ఫలితమేనని చెప్పాలి. దీనికి నిదర్శనమే నాటి రాష్ట్ర విద్యుత్ బోర్డు నుండి కేవలం 4,720 సర్వీసులు సంస్థకు దఖలు పడగా, నేడు 2 లక్షల 55 వేల 830 కనెక్షన్లు వివిధ కేట గిరీలలో కలిగి, సంస్థ ఎన్నో వందల రెట్లు పురోగతి సాధించింది. నాడు కేవలం 2,299 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా నేడు 76 వేల 306 వ్యవసాయ సర్వీసులున్నాయి.
సంస్థ అయిదు దశాబ్దాల విజయగాథలో సభ్యులు, వినియోగదారులు, అత్యంత క్రియాత్మకంగా బాధ్యత వహించారు. నేడు సభ్యుల సంఖ్య 2 లక్షల 97 వేల 708 కలదు. వీరి వాటా ధనం 6 కోట్ల 14 లక్షల 81 వేల 587 రూపాయలు కలవు. అంటే సంస్థ ఆర్థిక హార్దిక పురోగతిలో వీరి సహాయ సహకారాలు ఎంత అమోఘంగా పని చేశాయో తెలుస్తుంది. ప్రారంభంలో విద్యుత్ లైన్ల నిర్మా ణంలో, ట్రాన్స్ఫార్మర్ల స్థాపనలో, పని ప్రదేశాలకు సామాగ్రి రవాణా చేయడంలో వీరి స్వచ్ఛంద శ్రమదానం ఇమిడి ఉంది. శ్రమదానం విలువ సుమారు ఒక కోటి 50 లక్షలు ఉంటుంది. వినియోగదారుల శ్రమదానం సంస్థలో 1995 వరకు సాగింది. ఇకపోతే సహకార రంగంలో సెస్ పురోగతి గణాంకాలను పరిశీలిస్తే సగటు తలసరి విద్యుత్ వినియోగం దాదాపు 1,600 విద్యుత్ యూనిట్ల వరకు ఉంది. అదే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో తలసరి విద్యుత్ విని యోగం 1,268 యూనిట్లుగా ఉన్నది. ఉద్యోగుల విషయానికి వస్తే సంస్థలో 666 సర్వీసులకు ఒక ఉద్యోగి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాడు. ఎన్పీడీసీఎల్లో 586.45 సర్వీసులకు ఒక ఉద్యోగి తన సేవలను అందిస్తున్నాడు.
సెస్ సహకార రంగంలో విద్యుత్ పంపిణీ నిర్మాణ సంస్థ కాబట్టి, గతంలో ఇప్పుడు కూడా విద్యుత్తును అప్పటి విద్యుత్ బోర్డు నుంచి ,ఇప్పటి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి కొనుగోలు చేసి తన వినియోగదారులకు ప్రభుత్వ ఆదేశాల రేట్ల ప్రకారం వివిధ కేటగిరీల్లో నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తున్నది. విద్యుత్ సంస్కరణలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 1999లో ఏర్పాటుచేసిన రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ నియంత్రణ మండలి (ఇ.ఆర్.సి) నిబంధనలు ఆదేశాలకు లోబడి సంస్థ పనిచేస్తుంది.
1970లో స్థాపించిన సెస్ పని విధానం, నిర్వహణ తీరు తెన్నులను చూసి, నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రాంతాలలో 13 సహకార విద్యుత్ సరఫరా సంఘాలను స్థాపించాయి. కానీ అందులో ఇప్పుడు తెలంగాణలో ఒకే ఒక్క సెస్ సంస్థ మిగిలిపోగా, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి. 8 సంస్థల నష్టాలను దృష్టిలో ఉంచుకొని నాటి ప్రభుత్వం సంబంధిత విద్యుత్ పంపిణీ వ్యవస్థలలో విలీనం చేసింది. ఉద్యోగవర్గాలకు, పాలకవర్గాలకు విని యోగదారులకు మధ్యనగల అవినాభావ సంబంధ బాంధవ్యాలు, సహకార మమకారాల వలననే సంస్థ గత 50 ఏళ్లుగా తన విజయయాత్రను అవి చ్ఛిన్నంగా కొనసాగిస్తున్నది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కూడా వినియోగదారుల సహకారంతో దిగ్విజయంగా సాగిపోతున్నది.
ముఖ్యంగా సంస్థ ప్రారంభమైన ఐదు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధినీ సాధించడమేకాక గణనీయమైన ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించింది. తద్వారా రైతాంగం రైతు కూలీల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి అంతేగాక సిరిసిల్ల నేత రంగం, అనుబంధ రంగాలు, కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న చేనేత పవర్లూమ్ పరిశ్రమకు 50 శాతం విద్యుత్ రాయితీ కల్పించడం వలన చేనేత కుటుంబాల బతుకులు మరింత సుభిక్షంగా ఉన్నాయి. అంతేకాక ఈ సంస్థ పరిధిలో సిరిసిల్ల టెక్సటైల్ పార్క్ కూడా కొనసాగుతున్నది. దీనితో ప్రభుత్వ సంక్షేమ చేయూతతో అనేక మంది నేత కార్మికులు వలసలకు విరామం చెప్పి సిరిసిల్లలోనే తమ వృత్తిని కొనసాగిస్తూ సరిపోయే జీవన భృతిని పొందుతున్నారు. సంస్థ స్వర్ణోత్సవాలు నిర్వహించుకోనున్న సంవత్సరంలో ఉత్తమ వినియోగదారులకు, ఉద్యోగులకు, గ్రామ ప్రతినిధులకు మధ్య మరింత సత్సంబంధాలను ఆదానప్రదానాలుగా కొనసాగాలి. మరో శతాబ్దం వరకు సంస్థ మనుగడ ఇంకా అద్వితీయంగా కొనసాగాలి.
-జూకంటి జగన్నాథం
వ్యాసకర్త కవి, విమర్శకులు ‘ 94410 78095